Manipur violence: మణిపూర్ హింసలో మయన్మార్ మత్తు.. వెలుగు చూస్తున్న మరో కోణం..!

మణిపూర్ హింసకు, డ్రగ్స్ మాఫియాకు సంబంధం ఉందనే వాదన వినిపిస్తోంది. మణిపూర్‌లో మొదట హింస చెలరేగిన చురాచాంద్‌పూర్‌కు, మయన్మార్‌లో డ్రగ్స్ అధికంగా ఉత్పత్తి అయ్యే చిన్ ప్రాంతానికి మధ్య దూరం 65 కిలోమీటర్లు మాత్రమే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 23, 2023 | 09:57 AMLast Updated on: Jul 23, 2023 | 9:57 AM

Role Of Myanmar Based Drug Lords Suspected In Manipur Violence

Manipur violence: మణిపూర్‌లో జరుగుతున్న హింస ఘటన వెనుక సంచలన నిజాలున్నట్లు తేలుతోంది. ఈ హింస ఈ స్థాయిలో చెలరేగడం వెనుక మణిపూర్ డ్రగ్స్ మాఫియాతోపాటు, మయన్మార్ డ్రగ్ ముఠాల హస్తం కూడా ఉందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మణిపూర్ హింసకు, మయన్మార్‌కు సంబంధం ఉంది.
మనకు పొరుగునే ఉన్న దేశం మయన్మార్. ఇది మన దేశంతో 1640 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది. అందులో 400 కిలోమీటర్ల సరిహద్దు మణిపూర్‌తోనే ఉంది. అయితే, ఈ సరిహద్దులో పది శాతం భూభాగంలోనే కంచె ఉంది. మిగతా అంతా సాధారణ భద్రత మాత్రమే ఉంది. ఇలాంటి సరిహద్దు మార్గం గుండా మయన్మార్ నుంచి ఇండియాకు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. ప్రపంచంలోనే గంజాయి వంటి అత్యధిక డ్రగ్స్ పండించే రెండో దేశం మయన్మార్. అక్కడ పండించిన డ్రగ్స్‌ను సరిహద్దు గుండా ఇండియాకు తరలిస్తున్నారు. ఇరు దేశాల్లోనూ డ్రగ్స్ ముఠాలు దీనికి సహకరిస్తుంటాయి. మయన్మార్‌లో డ్రగ్స్ సాగుకు దగ్గరగా ఉండే గోల్డెన్ ట్రయాంగిల్ (మయన్మార్, లావోస్, థాయిలాండ్ సరిహద్దు ప్రాంతం) పరిధిలోని కంచె లేని ప్రాంతం గుండా మణిపూర్ సహా ఈశాన్య రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా అవుతుంటాయి.

దీని వెనుక స్థానిక రాజకీయ నేతలు, వ్యాపారులు, పోలీసులు, అధికారులు, సైనికాధికారుల హస్తం కూడా ఉందని ప్రచారం ఉంది. వీరి సహకారం ఉండటంతో మయన్మార్ నుంచి ఇండియాకు సరిహద్దు ద్వారా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. తాజాగా మణిపూర్ హింసకు, డ్రగ్స్ మాఫియాకు సంబంధం ఉందనే వాదన వినిపిస్తోంది. మణిపూర్‌లో మొదట హింస చెలరేగిన చురాచాంద్‌పూర్‌కు, మయన్మార్‌లో డ్రగ్స్ అధికంగా ఉత్పత్తి అయ్యే చిన్ ప్రాంతానికి మధ్య దూరం 65 కిలోమీటర్లు మాత్రమే. మరోవైపు మణిపూర్‌లోనూ గిరిజనులు మత్తు మందు పంటలు సాగు చేస్తున్నారు. ఈ పంటలను ప్రభుత్వం ధ్వంసం చేసింది. అయితే, వీరికి ప్రత్యామ్నాయం మాత్రం చూపించడం లేదు. ఇక వ్యవసాయానికి సంబంధించి కేంద్రం నుంచి కూడా ప్రోత్సాహం అందడం లేదు. ఈ నేపథ్యంలో ఆదివాసీల్లోనూ అసంతృప్తి మొదలైంది. ఇదే సమయంలో మైతేయి తెగవారికి ఎస్టీ హోదా అంశం తెరపైకి రావడంతో వారిలో అసంతృప్తి మరింతగా పెరిగింది.

దీంతో వాళ్లే ఆదివాసీ తెగలను రెచ్చగొట్టి, హింసకు ప్రేరేపించి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. డ్రగ్స్ ముఠాలు, వాటిని నడిపించే టెర్రరిస్ట్ సంస్థలకు కూడా ఈ హింసలో ప్రమేయం ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రజల్లో చెలరేగిన అశాంతిని, డ్రగ్స్ ముఠాలు మరింతగా పెంచి, ఆజ్యం పోశాయని, హింసాత్మక ఘటనల వెనుక ఉన్న వీరి ప్రమేయాన్ని కొట్టిపారేయలేమని అధికారులు అంటున్నారు. మణిపూర్‌లో హింసను ఆపాలంటే డ్రగ్స్ ముఠాల పని కూడా పట్టాల్సి ఉంది.