E-Challan Scam: చలాన్ల పేరుతో కొత్త స్కాం.. వెహికల్ ఓనర్లూ జాగ్రత్త..!
ఏదైనా ఒక వాహనం ఉండి, దానిపై చలాన్ ఉన్న వాళ్లే ప్రస్తుతం సైబర్ నేరగాళ్ల టార్గెట్. ఆన్‌లైన్‌లో చలాన్ల గురించి తెలుసుకోవచ్చు అన్న సంగతి తెలిసిందే. దీన్ని ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు దోపిడీకి పాల్పడుతున్నారు.
E-Challan Scam: సైబర్ నేరగాళ్లు జనాల్ని మోసం చేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త దారుల్ని వెతుక్కుంటూనే ఉంటారు. ఒక విషయంలో జనానికి అవగాహన పెరిగి, అప్రమత్తం కాగానే.. మరో రూపంలో మోసానికి తెరతీస్తారు. ఇదే కోవలో ఇప్పుడు చలాన్ల పేరుతో స్కాంకు పాల్పడుతున్నారు. వాహనాల చలాన్లు కట్టాలని సూచిస్తూ, మెసేజెస్ పంపి, అకౌంట్లోని డబ్బు దోచేస్తున్నారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఏదైనా ఒక వాహనం ఉండి, దానిపై చలాన్ ఉన్న వాళ్లే ప్రస్తుతం సైబర్ నేరగాళ్ల టార్గెట్. ఆన్‌లైన్‌లో చలాన్ల గురించి తెలుసుకోవచ్చు అన్న సంగతి తెలిసిందే. దీన్ని ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు దోపిడీకి పాల్పడుతున్నారు. ఆన్‌లైన్, చలాన్లకు సంబంధించిన ప్రభుత్వ వెబ్‌సైట్ల నుంచి చలాన్, బండి నెంబర్, మొబైల్ నెంబర్ వంటి వివరాల్ని సంపాదిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎలాగైతే తమ పోర్టల్ ద్వారా వివరాలు సేకరిస్తారో.. అలాగే సైబర్ నేరగాళ్లు డాటా తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఆ చలాన్ వివరాలతో, సంబంధిత వాహన యజమానికి ఒక మెసేజ్ లింక్ పంపుతారు. మీ వాహనం మీద ఇంత చలాన్ ఉందని, వెంటనే ఈ లింక్‌పై క్లిక్ చేసి డబ్బులు చెల్లించాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని ఆ మెసేజ్ సారాంశం. ఒకవేళ ఆ వివరాల్ని వాహన యజమానులు ఆన్‌లైన్‌లో చెక్ చేసుకున్నా అవే వివరాలు ఉంటాయి. అందువల్ల యజమానులు తమకు ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ నుంచే మెసేజ్ వచ్చిందేమో అనే అనుమానంతో, చలాన్ కట్టేందుకు మెసేజ్‌తోపాటు వచ్చిన లింక్‌పై క్లిక్ చేస్తున్నారు. లింక్‌పై క్లిక్ చేయగానే, మీ మొబైల్ డేటా మొత్తం వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది. మీ మొబైల్‌కు సంబంధించిన పాస్‌వర్డ్స్, ఇతర డేటా వారి దగ్గరకు వెళ్తుంది. యూజర్ల అకౌంట్లోని డబ్బు వారి అకౌంట్లోకి వెంటనే ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది.
ఇలా జాగ్రత్త పడండి
చలాన్‌కు సంబంధించి ఏదైనా మెసెజ్, లింక్ రాగానే వెంటనే దానిపై క్లిక్ చేయకూడదు. ఆ లింక్ అడ్రస్ చెక్ చేయాలి. గవర్నమెంట్ నుంచి వచ్చే లింక్ చివరన gov.in అని ఉంటుంది. స్కామర్లు పంపే లింక్ కూడా అదే సైట్ పేరుతో ఉన్నప్పటికీ, చివరన gov.in ఉండదు. అందువల్ల లింక్‌పై క్లిక్ చేసి పే చేసే ముందు జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే లింక్ ద్వారా కాకుండా.. అఫీషియల్ సైట్‌కు వెళ్లి, ఆన్‌లైన్‌లో పే చేయాలి. దానికి ముందు మీ వాహనం నెంబర్, చాసిస్ నెంబర్ వంటివి కూడా సరిచూసుకోవాలి. అలాగే ఈ చలాన్ అలర్ట్స్ ఎప్పుడూ ఫోన్ నెంబర్ల నుంచి రావని గుర్తుంచుకోవాలి. ఒకవేళ డబ్బులు కట్ అయిపోతే వెంటనే 1930కు కాల్చేయాలి. సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. లేదా వెంటనే దగ్గర్లని పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి, ఫిర్యాదు చేయాలి.