Cyber Fraud: మీ సిమ్ కార్డు డీయాక్టివేట్ అయ్యిందా..? అయితే మీరు ప్రమాదంలో చిక్కుకున్నట్టే..!

సిమ్ డీ యాక్టివేట్ అయిన కొన్ని గంటలకే మీ నెంబర్‌తో లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోతుంది. మీ ప్రమేయం లేకుండానే మీ ఖాతా నుంచి డబ్బులు వేరే ఖాతాలోకి వెళ్లిపోతాయి. మీరు ప్రమాదాన్ని గుర్తించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇంతకీ సిమ్ కార్డు డీయాక్టివేషన్‌కు, బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవ్వడానికి సంబంధం ఏంటి..? మీ డబ్బులను కాజేసింది ఎవరు..?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 2, 2023 | 09:55 AMLast Updated on: Jul 02, 2023 | 9:55 AM

Scammers Doing Cyber Fraud By Sim Card Deactivation Be Alert

Cyber Fraud: ఉన్నట్టుండి మీరు వాడుతున్న సిమ్ కార్డు డీయాక్టివేట్ అయిపోతుంది.. మీ సర్వీసు ప్రొవైడర్‌కు మీరు ఎలాంటి రిక్వెస్ట్ ఇవ్వకుండానే మీ ఫోన్ నెంబర్ పని చేయడం ఆగిపోతుంది. ఒకవేళ ఇదే మీకు జరిగితే మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చిందని అర్థం. ఎందుకంటే ఆలా డీ యాక్టివేట్ అయిన కొన్ని గంటలకే మీ నెంబర్‌తో లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోతుంది. మీ ప్రమేయం లేకుండానే మీ ఖాతా నుంచి డబ్బులు వేరే ఖాతాలోకి వెళ్లిపోతాయి. మీరు ప్రమాదాన్ని గుర్తించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇంతకీ సిమ్ కార్డు డీయాక్టివేషన్‌కు, బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవ్వడానికి సంబంధం ఏంటి..? మీ డబ్బులను కాజేసింది ఎవరు..?
సైబర్ స్కామర్స్ ఉన్నారు జాగ్రత్త..!
కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే కొద్దీ, దానిని అడ్డం పెట్టుకుని మోసాలకు పాల్పడే విధానాలు కూడా కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. మనకు తెలియకుండానే ఫోన్లలో చొరబడి విలువైన డేటాను చోరీ చేయడం, వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించడం ఇవన్నీఎప్పటి నుంచో జరుగుతున్న మోసాలే. అయితే ఈ మధ్య సైబర్ స్కామర్స్ కొత్త అవతారాలెత్తారు. బ్యాంకులకు, కస్టమర్లకు ఎలాంటి అనుమానం రాకుండా మూడో కంటికి తెలియకుండా బ్యాంక్ ఖాతాలను హ్యాక్ చేస్తున్నారు. సినిమాల్లో చూపించినట్టు క్షణాల్లో అమాయకుల అకౌంట్ల నుంచి డబ్బు కాజేస్తున్నారు. టెక్నాలజీని బాగా ఒంటపట్టించుకున్న ఒకరిద్దరు వ్యక్తులు చేస్తున్న మోసం కాదిది. దీని వెనుక అంతర్జాతీయ స్థాయిలో భారీ స్కామ్ జరగుతున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో తేలింది
స్కామర్స్ నెట్‌వర్క్ ఎలా పనిచేస్తుంది ?
కేవలం 500 రూపాయలు… అవును జస్ట్ 500 రూపాయలు ఖర్చు చేసి మీ విలువైన బ్యాంక్ అకౌంట్ వివరాలను స్కామర్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెలుసుకుంటున్నారని మీకు తెలుసా..? అవును ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేరు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఖాతాదారుల ఫినాన్షియల్ డిటేల్స్‌ను తస్కరించి వాటిని వెబ్‌సైట్లు, టెలిగ్రామ్ ఛానల్స్ ద్వారా అమ్మకానికి పెడుతున్నారు సైబర్ కేటుగాళ్లు. ఏ డెబిట్ కార్డు, ఏ క్రెడిట్ కార్డుతో మీరు ఎక్కడ, ఎప్పుడు షాపింగ్ చేశారు..? మీ పేరేంటి..? మీ కార్డు సీవీవీ వివరాలు ఇలా ఒక్కటేంటి.. రహస్యంగా మీకు మాత్రమే తెలియాల్సిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమస్త సమాచారం మార్కెట్‌లో అమ్మకానికి ఉంది.
మనకు తెలియకుండా ఎలా మోసం చేస్తారు..?
సైబర్ సెక్యూరిటీ గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. కానీ సైబర్ సెక్యూరిటీని బ్రీచ్ చేసి.. యూజర్ల వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను ఎలా రాబట్టాలో సైబర్ కేటుగాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. మీరు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తారు, పెద్ద సంస్థకు చెందిన వెబ్‌సైట్ కదా.. మీ డేటా సెక్యూర్డ్‌గా ఉంటుందిలే అనుకుంటారు. క్రెడిట్, డెబిట్ కార్డు డిటేల్స్‌ను ఎంటర్ చేసేస్తారు. ఆ తర్వాత మీరు ఆ వెబ్‌సైట్ గురించి మర్చిపోతారు. కానీ సైబర్ స్కామర్ల అసలు పని అక్కడే మొదలవుతుంది. ఇలాంటి వెబ్‌సైట్ల నుంచి వివిధ పద్ధతల్లో బ్యాంకింగ్ డేటాను తెలుసుకుంటున్న సైబర్ మోసగాళ్లు వాటిని ఇంటర్నేషనల్ స్కామర్లకు అమ్మకానికి పెడుతున్నారు. జస్ట్ 5 డాలర్లు లేదా తక్కువలో తక్కువ 500 రూపాయలు చెల్లించి స్కామర్స్ ఆ వివరాలు సేకరిస్తున్నారు. ఇక అప్పటి నుంచి మీఖాతాలో సొమ్మును కాజేసే ప్రక్రియ మొదలవుతుంది.
ఫోన్‌కు ఓటీపీ వస్తుంది కదా..? మరి మోసం ఎలా జరుగుతుంది..?
చాలా దేశాల్లో 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ విధానం లేదు. కార్డు డిటేల్స్ ఇవ్వగానే ట్రాన్సాక్షన్ పూర్తయిపోతుంది. ఓటీపీ అవసరమే ఉండదు. కానీ మన దేశంలో ప్రతి లావాదేవీ ఓటీపీ ద్వారా జరుగుతుంది. అంటే బ్యాంకులు మనకు ఓటీపీ పంపించి అది నిజమైన లావాదేవీ అని గుర్తించడం ద్వారా మాత్రమే పేమెంట్‌ను ప్రాసెస్ చేస్తాయి. ఒకరకంగా ఇది చాలా అత్యాధునిక పద్ధతి. సాధ్యమైనంత వరకు సైబర్ మోసగాళ్ల బారిన పడకుండా ఓటీపీ వెరిఫికేషన్ పనిచేస్తుంది. కానీ ఇప్పుడు దీన్ని కూడా సైబర్ స్కామర్స్ మానిపులేట్ చేసేస్తున్నారు. టెలిగ్రామ్, వివిధ వెబ్‌సైట్ల ద్వారా వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్న మోసగాళ్లు నిజమైన కస్టమర్లలాగా టెలికామ్ ప్రొవైడర్లను సంప్రదిస్తున్నారు. దొంగిలించిన వ్యక్తిగత, బ్యాంక్ వివరాలను అందజేసి సిమ్‌కార్డును డీయాక్టివేట్ చేయించి కొత్త సిమ్ కార్డులను తీసుకుంటున్నారు. డూప్లికేట్ సిమ్ కార్డు తీసుకుని బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. సిమ్ కార్డు ఎందుకు డీయాక్టివేట్ అయ్యిందో గుర్తించే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
సైబర్ స్కామర్లు ఎక్కడి నుంచి పనిచేస్తున్నారు ?
సైబర్ మోసగాళ్లు ఒక్కరో ఇద్దరో ఆ మూల, ఈ మూల ఉండరు. గుట్టుచప్పుడు కాకుండా ఒక నెట్‌వర్క్‌గా ఏర్పడి ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇలాంటి మోసాలన్నీ ఉక్రెయిన్, రష్యా కేంద్రంగా జరుగుతున్నట్టు మన సైబర్ పోలీసులు గుర్తించారు. డబ్బుల కోసం వ్యక్తిగత డేటాను అమ్ముతున్న ఇలాంటి వెబ్‌సైట్స్, టెలిగ్రామ్ ఛానల్స్‌పై గతంలోనే గుజరాత్ పోలీసులు కొరడా ఝులిపించారు. కానీ ఎప్పటికప్పుడు కొత్త ముఠాలు పుట్టుకొస్తున్నాయి. సైబర్ మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు.