ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌లో సంచలనాలు ఆ వెబ్‌ సిరీస్‌ చూసి హ*త్య క్లూస్‌ ఎలా మాయం చేశాడంటే…

హైదరాబాద్ మీర్పేటలో ఓ వ్యక్తి తన భార్యను కిరాతకంగా హత్య చేసి, ముక్కలుగా నరికిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 25, 2025 | 06:22 PMLast Updated on: Jan 25, 2025 | 6:22 PM

Sensation In The Forensic Report Is How The Murder Clues Disappeared After Watching That Web Series

హైదరాబాద్ మీర్పేటలో ఓ వ్యక్తి తన భార్యను కిరాతకంగా హత్య చేసి, ముక్కలుగా నరికిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో కలిసుండేందుకే పథకం ప్రకారం భార్యను అంతమొందించినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని ముక్కలుగా నరికి బకెట్ నీళ్లలో వేసి, హీటర్‌తో ఉడికించి మాంసాన్ని ముద్దగా మార్చి సమీపంలోని చెరువులో వేసినట్లు నిందితుడు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. అతను ఇంత పాశవికంగా వ్యవహరించడానికి ఓ వెబ్ సిరీస్ నుంచి ప్రేరణ పొందినట్లు పోలీసులు చెప్తున్నారు. పోలీసులు నిందితుడి ఫోన్లో పరిశీలించినప్పుడు ఓ మహిళతో ఉన్న ఫొటోలను గుర్తించారు.

ఈనెల 18న నమోదు చేసిన మిస్సింగ్‌ కేసును.. హత్య కేసు సెక్షన్ల కింద మారుస్తున్నారు. గురుమూర్తికి వెంకటమాధవితో 13 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు. గురుమూర్తి ఆర్మీలో జవానుగా పనిచేసి నాయక్ సుబేదార్‌గా పదవీ విరమణ పొందాడు. ప్రస్తుతం కంచనాబాగ్ డీఆర్డీవోలో సెక్యూరిటీ గార్డ్‌గా కాంట్రాక్ట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. కొన్నాళ్లుగా తన సమీప బంధువైన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం భార్యకు తెలియడంతో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో భార్యను అడ్డుతొలగించాలని భావించాడు. అదను కోసం ఎదురు చూశాడు. సంక్రాంతి సందర్భంగా తన ఇద్దరు పిల్లల్ని నగరంలోనే ఉండే తన సోదరి ఇంటికి పంపించాడు. 13, 14 తేదీల్లో మాధవితో కలిసి ఉదయంపూట సోదరి ఇంటికెళ్లి సాయంత్రానికి తిరిగొచ్చారు.

వేరే మహిళతో గురుమూర్తి ఉన్న కొన్ని ఫొటోలను ఆమె చూడటంతో 15న ఉదయం ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అప్పటికే భార్యను హతమార్చాలనే పన్నాగంతో ఉన్న గురుమూర్తి… ఆమె తలను గోడకేసి కొట్టడంతో కిందపడిపోయింది. చనిపోయిందని నిర్ధారించుకున్నాక ఆరు నెలల క్రితం ఓటీటీలో చూసిన ఒక వెబ్‌సిరీస్‌లో ఉన్నట్లుగానే… మృతదేహాన్ని బాత్‌రూంలోకి తీసుకెళ్లి ముక్కలుగా నరికాడు. తర్వాత వాటిని బకెట్ నీళ్లలో వేసి హీటర్‌తో మరగబెట్టాడు. ముక్కలు మొత్తగా మారాక మాంసాన్ని ఎముకల నుంచి విడదీసి మరో బకెట్లో వేసి రోకలితో దంచి ముద్దగా చేశాడు. ఎముకలు, మాంసం ముద్దలను సంచుల్లో నింపి సమీపంలోని చెరువులో వేశాడు. హత్య తర్వాత రెండ్రోజులపాటు నిద్రలేకుండా ఇదంతా చేసినట్లు నిందితుడు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని మాయం చేశాక గదిని శుభ్రం చేశాడు. 17వ తేదీ సాయంత్రం భార్య కనిపించడం లేదని వెంకటమాధవి తల్లిదండ్రులకు ఫోన్లో చెప్పాడు. చిన్న గొడవతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు ఫిర్యాదు చేయించాడు.

కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా మాధవి ఇంట్లోకి వెళ్లడం తప్ప బయటకు వచ్చిన దృశ్యాలు కనిపించలేదు. దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించినప్పుడు అసలు విషయం బయటపడింది. బుధ, గురువారాల్లో నిందితుడి ఇంట్లో క్లూస్‌ టీం, ఫోరెన్సిక్‌ టీం.. నీళ్ల బకెట్, వాటర్ హీటర్‌తో పాటు ఇతర కీలక ఆనవాళ్లను సేకరించాయి. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాయి. వెంకటమాధవి హత్య జిల్లెలగూడలో తీవ్ర అలజడి రేపింది. న్యూ వెంకటేశ్వరనగర్ కాలనీలోని ఓ అపార్టుమెంటులో గురుమూర్తి దంపతులు ఉంటున్నారు. భార్యను హత్య చేసి ముక్కలుగా నరికినట్లు తెలియగానే అపార్టుమెంటులోని జీ+2 అంతస్తుల్లో ఉండే వారంతా ఖాళీ చేసి వెళ్లిపోయారు. కింది అంతస్తులో ఉండే యజమాని మరో ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంట్లో ఆధారాలు బయటికి తీసేందుకు ఫోరెన్సిక్‌ ఎక్స్‌పర్ట్స్‌కే రెండు రోజులు పట్టిందంటే ఎంత జాగ్రత్తగా గురుమూర్తి ఈ మర్డర్‌ చేశాడని పోలీసులు షాక్‌ అవుతున్నారు.