Singapore: గంజాయి స్మగ్లింగ్.. భారత మూలాలున్న వ్యక్తిని ఉరితీసిన సింగపూర్.. అసలేం జరిగింది ?

కఠినమైన చట్టాలు చేయడం.. వాటిని అంతే కఠినంగా అమలు చేయడంలో నూటికి నూరుపాళ్లు నిక్కచ్చిగా వ్యవహరించే సింగపూర్ ప్రపంచ దేశాలు వద్దంటున్నా సరే తాను అనుకున్న పనిచేసింది. గంజాయి స్మగ్లింగ్ చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ మూలాలు ఉన్న వ్యక్తిని కొన్ని గంటల క్రితం ఉరితీసింది. దాదాపు కేజీ గంజాయిని సింగపూర్ తరలించడంలో కీలక పాత్ర పోషించాడని అభియోగాలు ఎదుర్కొంటున్న 46 సంవత్సరాలు తంగరాజు సుప్పయ్యను సింగపూర్ అధికారులు ఉరి తీశారు. చంగి ప్రిజన్ కాంప్లెక్స్ ‌లో తంగరాజు సుప్పయ్యను ఉరితీసినట్టు సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 26, 2023 | 03:30 PMLast Updated on: Apr 26, 2023 | 3:30 PM

Singapore Government Hang To Indian

ఎవరీ తంగరాజు.. నిజంగా స్మగ్లింగ్ చేశాడా ?

తంగరాజు పుట్టింది పెరిగింది సింగపూర్‌లోనే అతను సింగపూర్ జాతీయుడే. దశాబ్దాల క్రితమే తంగరాజు కుటుంబం భారత్ నుంచి సింగపూర్ వలస వెళ్లిపోయింది. వీళ్ల మాతృభాష తమిళం. తండ్లి లేడు…చెల్లెలు అనుకోని కారణాలతో దూరమైపోయింది. తల్లి సింగపూర్ ప్రభుత్వ విభాగంలో క్లీనర్‌గా పనిచేస్తోంది. చిన్నప్పుడే తంగరాజుకు చెడు వ్యసనాలు అలవాటయ్యాయి. 12 ఏళ్ల వయసులోనే గంజాయి తీసుకోవడం మొదలు పెట్టాడు. మాదక ద్రవ్యాల నేరానికి సంబంధించి 14 ఏళ్ల వయసులోనే శిక్ష అనుభవించాడు. తంగరాజు జీవితంలో చాలా భాగం జైలుకు వెళ్లిరావడంతోనే సరిపోయింది. డ్రగ్స్ తీసుకోవడం లేదని నిర్ధారించేందుకు ప్రతివారం యూరిన్ రిపోర్ట్సు ఇవ్వాలన్న కండిషన్ పై తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు.

ఉరి తీసేటంత నేరం చేశాడా ?

దాదాపు కేజీ గంజాయిని సింగపూర్‌లో అక్రమ రవాణాకు పాల్పడ్డారన్నది తంగరాజుపై ఉన్న ప్రధాన అభియోగం. అయితే దీని వెనుక చాలా పెద్ద కథ ఉంది. 2013లో మలేషియాకు చెందిన మోగన్ వాలో అనే వ్యక్తి ఉద్యోగం కోసం సింగపూర్ వచ్చాడు. మినీ మార్టులో ఉద్యోగం ఉందని సెల్వా అనే వ్యక్తి ద్వారా తెలుసుకుని ఆ సంస్థ నెంబర్ సంపాదించాడు. ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి భాష భారతీయుడిలా ఉండటంతో అతని నెంబర్‌ను ఇండియా అని సేవ్ చేసుకున్నాడు. అయితే సెల్వా అనే వ్యక్తి మలేసియా నుంచి సింగపూర్‌కు ఓ పార్సిల్ డెలివరీ చేయమని మోగన్ వాలోను కోరాడు. దీని కోసం 900 డాలర్లు కూడా చెల్లించాడు. అయితే సెంట్రల్ నార్కోటిక్ బ్యూరో దాడులు చేసి ఆ పార్సిల్ లో గంజాయి ఉందని గుర్తించింది. నేరాన్ని అంగీకరించిన మోగన్ వాలో.. సెల్వా అనే వ్యక్తి ఇండియా అనే వ్యక్తికి ఆ పార్సిల్ డెలవరీ చేయమని చెప్పినట్టు సింగపూర్ పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అప్పటి నుంచి తంగరాజుపై ఉచ్చు బిగుస్తూ వస్తోంది. మోగన్ చెప్పిన ఫోన్ నెంబర్ తనదేనని.. కానీ గంజాయి అక్రమ రవాణాతో తనకు ఎలాంటి సంబంధం లేదని వాదించాడు. 2017 నుంచి సింగపూర్ న్యాయస్థానాల్లో ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. మరో వ్యక్తితో కలిసి గంజాయి అక్రమ రవాణాకు కుట్ర చేసినట్టు నిర్ధారించిన సింగపూర్ హైకోర్టు 2018లో తంగరాజుకు ఉరిశిక్ష విధించాలని తీర్పు ఇచ్చింది. తనకు ఏపాపం తెలియదంటూ తంగరాజు చేసిన న్యాయపోరాటాలు ఫలించలేదు. 2019లో అతను పెట్టుకున్న అప్పీల్ పిటిషన్‌ను కూడా అప్పీల్ కోర్టు కొట్టేసింది.

తంగరాజు విషయంలో సింగపూర్ తొందరపడిందా ?

ఉరిశిక్ష అమలును నిలిపివేయాలంటూ తంగరాజు కుటుంబం వేడుకున్నా సింగపూర్ ప్రభుత్వం, న్యాయస్థానాలు కరుణించలేదు. నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు తంగరాజుకు సరైన అవకాశం కల్పించలేదని ఆయన కుటుంబం విమర్శిస్తోంది. దర్యాప్తు సమయంలో తమిళ అనువాదకుడిని ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కూడా కల్పించకపోవడాన్ని ప్రధానంగా ప్రశ్నిస్తోంది. తంగరాజు కేసు దర్యాప్తులో సింగపూర్ ప్రభుత్వం తొందరపాటుతో వ్యవహరించిందని హక్కుల సంఘాలు కూడా విమర్శలు గుప్పించాయి. అయినా సరే సింగపూర్ ప్రభుత్వం కోర్టు ఆదేశాలను అమలు చేసింది. తంగరాజును ఉరితీయబోతున్నామంటూ వారం రోజుల ముందు కుటుంబానికి వర్తమానం పంపిన జైలు అధికారులు.. ఇవాళ ఉరిశిక్ష అమలు చేశారు.

ఉరిశిక్ష అమలుపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు

గంజాయి రవాణా వివాదంలో ఓ వ్యక్తిని ఉరితీయడంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో సింగపూర్ ప్రభుత్వాన్ని ఐక్యరాజ్యసమితి హక్కుల సంఘం కూడా తప్పుపట్టింది. ఉరిశిక్ష నిలిపివేయాలని పదేపదే విజ్ఞప్తి చేసింది. తంగరాజు ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలని యూరోపియన్ యూనియన్ డిమాండ్ చేసింది. బ్రిటన్ వ్యాపారవేత్త రిచర్డ్ బ్రాన్సన్ కూడా తంగరాజుకు మద్దతుగా గళం వినిపించారు. జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న గ్లోబల్ కమిషన్ ఆన్ డ్రగ్ పాలసీలో రిచర్డ్ బ్రాన్సన్ సభ్యుడిగా ఉన్నారు. ఈ డ్రగ్ కేసుతో తంగరాజుకు ఎలాంటి సంబంధం లేదని.. అయినా ఉరిశిక్ష విధించడం హక్కులను కాలరాయడమేనని ఆయన వాదించారు. ఓ అమాయకుడ్ని సింగపూర్ ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటుందని విమర్శించారు. ఎన్నో అంశాల్లో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్న సింగపూర్ ఇలాంటి కొన్ని విధానాలతో విమర్శలపాలవుతుందని బ్రాన్సన్ ఆవేదన వ్యక్తం చేశారు.

సింగపూర్ ఎందుకింత కఠినంగా వ్యవహరించింది ?

మిగతా దేశాలతో పోల్చితే సింగపూర్‌లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. వాటిని తూచ తప్పకుండా అమలు చేయడంలో సింగపూర్ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడదు. మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా అన్నది సింగపూర్‌లో అతిపెద్ద నేరం. చాలా దేశాలు గంజాయి వాడకాన్ని పరిమిత మోతాదులో అనుమతిస్తుంటే… సింగపూర్ మాత్రం గంజాయి సహా డ్రగ్స్ వాడకం, రవాణా విషయంలో ఏదేశంలోనూ లేనంత కఠిన చట్టాన్ని అమలు చేస్తోంది. మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష విధిస్తుంది. ఉరిశిక్ష మాత్రమే సింగపూర్‌లో డ్రగ్స్ ను కట్టడి చేయగలదని ఆ దేశ ప్రభుత్వం నమ్ముతుంది. డ్రగ్ ట్రాఫికింగ్ తో పాటు మొత్తం 33 నేరాలకు సింగపూర్‌లో మరణశిక్ష అమలులో ఉంది. పొరుగునే ఉన్న మలేసియా మాదక ద్రవ్యాల నేరాల్లో ఉరిశిక్ష ను పక్కన పెట్టినా సింగపూర్ మాత్రం తన విధానాన్ని మార్చుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా హక్కుల కార్యకర్తలు ఎంత మొత్తుకుంటున్నా సింగపూర్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అందులో భాగంగానే తంగరాజును ఉరితీసింది.