Software Employee: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి కేసులో వెలుగులోకి సంచలన నిజాలు..

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆకాంక్ష మృతి కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్నటి వరకూ ఆమె ఆత్మహత్య చేసుకుందని అంతా అనుకున్నారు. కానీ ఆకాంక్షను ఆమె ప్రియుడు అర్పిత్‌ హత్య చేశాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 7, 2023 | 04:37 PMLast Updated on: Jun 07, 2023 | 4:37 PM

Software Employee Death Case

బెంగళూరులోని జీవన భీమానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ లిమిట్స్‌లోని కౌడిహళ్లిలో ఉంటోంది ఆకాంక్ష. అక్కడే ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తోంది. స్నేహితులతో కలిసి ఓ ఫ్లాట్‌లో ఉంటున్న ఆకాంక్షను తన బాయ్‌ఫ్రెండ్‌ అర్పిత్‌ తరచుగా కలిసేవాడు. వీకెండ్స్‌లో ఆకాంక్ష ఫ్లాట్‌లోనే ఉండేవాడు. అయితే ఫ్రెండ్స్‌ ఉన్నప్పుడు తనను కలవడం ఇబ్బందిగా ఉందని.. వాళ్లతో కాకుండా సపరేట్‌గా ఫ్లాట్‌ తీసుకుని ఉండాలంటూ ఆకాంక్షను ఇబ్బంది పెట్టేవాడట అర్పిత్‌. కానీ ఆకాంక్ష దానికి ఒప్పుకోకపోవడంతో చాలా సార్లు వాళ్లిద్దరికీ గొడవ జరిగిందట.

పోయిన వారం ఆకాంక్ష ఫ్లాట్‌కు అర్పిత్‌ వచ్చినప్పుడు కూడా వాళ్లిద్దరి మధ్య ఇదే విషయంలో గొడవ జరిగిందట. ఈ గొడవలోనే కంట్రోల్‌ కోల్పోయిన అర్పిత్‌ ఆకాంక్షను గొంతు నులిమి చంపేశాడట. ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు అక్కడే ఉన్న ఓ తాడు తీసుకుని ఆకాంక్ష ఉరి వేసుకుని చనిపోయినట్టు సీన్‌ క్రియేట్‌ చేశాడు. అతడు వెళ్లిపోయిన తరువాత ఫ్లాట్‌కు వచ్చిన ఆకాంక్ష స్నేహితురాళ్లు.. ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ ఉండటం చూసి షాకయ్యారు. పోలీసులకు ఇన్ఫర్మేషన్‌ ఇవ్వడంతో వాళ్లు ఆకాంక్ష బాడీకి పోస్ట్‌ మార్టం నిర్వహించి బాడీని గోదావరిఖనికి తరలించారు.

పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ ఆధారంగా.. జరిగింది ఆత్మహత్య కాదని హత్య అని పోలీసులు అనుమానించారు. ఆకాంక్ష ప్రియుడు అర్పిత్‌ను అదుపులోకి తీసుకుని ఇంటరాగేట్‌ చేయడంతో తానే ఆకాంక్షను హత్య చేసినట్టు అర్పిత్‌ ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్‌లో జాబ్‌ చేస్తున్న టైంలోనే అర్పిత్‌, ఆకాంక్ష ఫ్రెండ్స్‌. కొద్ది రోజులకే వీళ్ల స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరూ ఒకే దగ్గర ఉండాలనుకునే బెంగళూరులో ఉద్యోగంలో చేరారు. కానీ అనుకోకుండా వీళ్ల మధ్య జరిగిన గొడవ ఆకాంక్ష ప్రాణం తీసింది. ప్రస్తుతం అర్పిత్‌ పోలీసులు కస్టడీలో ఉన్నాడు. పూర్తి ఆధారాలు సేకరించిన తరువాత అర్పిత్‌ మీద చార్జ్‌ షీట్‌ ఫైల్‌ చేసి కోర్టులో ప్రొడ్యూస్‌ చేస్తామంటున్నారు పోలీసులు.