Hyderabad: హైదరాబాద్‌లో ఉగ్ర కదలికలు.. భారీ విధ్వంసానికి ప్లాన్.. కుట్ర భగ్నం!
హిజ్బ్ ఉత్ తహ్రీర్ సంస్థతో సంబంధం ఉన్న ఐదుగురు వ్యక్తులను హైదరాబాద్ పోలీసుల సాయంతో మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్ట్ చేసింది. వీళ్లంతా హిందువుల పేర్లతో ఉద్యోగాలు చేస్తున్నట్లు ఏటీఎస్ గుర్తించింది.
Hyderabad: ఎంతో ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ ఉగ్ర కదలికలతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హైదరాబాద్‌లో ఉంటూ, మారు పేర్లతో హై ప్రొఫైల్ ఉద్యోగాలు చేస్తూ, దేశంలో దాడులకు ప్లాన్ చేశారు హిజ్బ్ ఉత్ తహ్రీర్ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రరిస్టులు. ఉగ్ర దాడులకు కాలేజీ విద్యార్థులు, కూలి పని చేసుకునే కార్మికులే లక్ష్యంగా చేసుకున్నారు. ముందుగా వారిని ఇస్లాం వైపు ఆకర్షిస్తారు. ఇండియా మీద ద్వేషం పెరిగేలా చేస్తారు. తర్వాత దేశంలో దాడులకు ప్లాన్ చేస్తారు.
ఈ తతంగం మొత్తం ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగానే నడుస్తోంది. హిజ్బ్ ఉత్ తహ్రీర్ సంస్థతో సంబంధం ఉన్న ఐదుగురు వ్యక్తులను హైదరాబాద్ పోలీసుల సాయంతో మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్ట్ చేసింది. వీళ్లంతా హిందువుల పేర్లతో ఉద్యోగాలు చేస్తున్నట్లు ఏటీఎస్ గుర్తించింది. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకర ఉగ్రవాద సంస్థ ‘హిజ్బ్ ఉత్ తహ్రీర్’ దేశవ్యాప్తంగా విధ్వంసాలకు ప్లాన్ చేసింది. ఈ కుట్రను గుర్తించిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కేంద్రంగా టెర్రరిస్టు సానుభూతిపరులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఆధారాలు సేకరించాయి. దీంతో భోపాల్‌లో హిజ్బ్ ఉత్ తహ్రీర్ కార్యకలాపాలపై నిఘా పెట్టిన ఆ రాష్ట్ర ఏటీఎస్.. స్థానిక ఎన్‌జీఓకు చెందిన మహ్మద్ వసీంను అదుపులోకి తీసుకుని విచారించింది. 20 మంది హిజ్బ్ ఉత్ తహ్రీర్ సానుభూతిపరులను గుర్తించి, వారిలో 11 మందిని అదుపులోకి తీసుకుని విచారించింది. ఈ విచారణలోనే వాళ్లకు హైదరాబాద్‌తో లింకులు ఉన్నట్లు గుర్తించింది. వెంటనే ఈ విషయాన్ని తెలంగాణ పోలీసులకు చేరవేశారు.
హిందువుల పేర్లతో కొంతమంది హైదరాబాద్‌లో పనిచేస్తున్నట్లు ఆధారాలు కూడా ఉన్నట్టు చెప్పారు. దీంతో తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ పోలీసులతో కలిసి 3 రోజుల పాటు హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించింది. ఓల్డ్ సిటీ, గోల్కొండ, హబీబ్ నగర్, జగద్గిరిగుట్ట, షామీర్‌పేట్, నాంపల్లి, సికింద్రాబాద్, మల్లేపల్లిలో సోదాలు చేసింది. ఈ సోదాల్లో ఒళ్ళు గగుర్పొడిచే నిజాలు బయటికి వచ్చాయి. ఒడిశాకు చెందిన అబ్దుల్ రహమాన్ అనే వ్యక్తి దేవీ ప్రసాద్ పాండ్య పేరుతో చెలామణి అవుతున్నాడు. హైదరాబాద్‌లోని గోల్కొండలో నివాసం ఉంటున్న అతను ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో క్లౌడ్ సర్వీస్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. కొంత కాలంగా మహ్మద్ సలీంతో కలిసి మధ్యప్రదేశ్‌కు వెళ్లి వచ్చాడు. సలీం కూడా సౌరభ్ పేరుతో ఓ మెడికల్ కాలేజీలో జాబ్ చేస్తున్నాడు. వీరిద్దరు కలిసి హైదరాబాద్‌లోని కాలేజీ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, రోజువారి కూలీలను టార్గెట్ చేసుకుని వారిని ఉగ్రవాదం వైపు ప్రేరేపించారు.
దేశంలో షరియా చట్టాలను తీసుకురావడానికి అల్లర్లు సృష్టించేందుకు ప్లాన్ చేశారు. గోల్కొండలోని బడాబజార్‌కు చెందిన డెంటిస్ట్ షేక్ జునైద్‌ను కూడా టెర్రరిజం వైపు మళ్లించారు. సలీం, అబ్దుల్, జునైద్ కలిసి హైదరాబాద్‌లోని ముస్లిం యువతను ట్రాప్ చేసేందుకు ప్లాన్ చేశారు. అందులో భాగంగా హబీబ్ నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ మహ్మద్ అబ్బాస్ అలియాస్ బస్క వేణుకుమార్, రంగారెడ్డి జిల్లా జగద్గిరిగుట్ట మఖ్దూం నగర్‌కు చెందిన రోజువారి కూలీలు మహ్మద్ హమీద్, మేడ్చల్ జిల్లా జవహర్ నగర్‌లోని శివాజీ నగర్‌కు చెందిన మహ్మద్ సల్మాన్‌తో కలిసి హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ ఏటీఎస్ అధికారులు మహ్మద్ సలీం, అబ్దుల్ రహమాన్, షేక్ జునైద్, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ హమీద్‌లను అరెస్టు చేశారు. మహ్మద్ సల్మాన్ పరారీలో ఉన్నాడు. ఐదుగురిని భోపాల్‌కు తరలించారు. హిజ్బ్ ఉత్ తహ్రీర్ ఐసిస్ కన్నా భయంకరమైంది. ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించేందుకు ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంది.
రసాయనాలతో దాడులు చేయడం, ప్రమాదకరమైన బ్యాక్టీరియాతో విధ్వంసాలకు పాల్పడడంపై ఈ టెర్రర్ సంస్థ శిక్షణ ఇస్తుంటుంది. గ్లోబల్ సెక్యూరిటీ ఏజెన్సీలు ఆ సంస్థ మూలాలను గుర్తించి సంబంధిత దేశాలను అప్రమత్తం చేస్తుంటాయి. ఇదే చీడ ఇప్పుడు భారత్‌కు పట్టుకుంది. చూడాలి మన ఇంటలిజెన్స్ డిపార్ట్మెంట్, పోలీస్‌లు ఈ సవాలును ఎలా హ్యాండిల్ చేస్తారో. కానీ అప్పటివరకు సిటీలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బెటర్.