The Kerala Story: గాడ్స్ ఓన్ కంట్రీ.. ఇస్లామిక్ రాజ్యంగా మారిపోయిందా? కేరళ స్టోరీ చుట్టూ ఎందుకింత వివాదం?
కేరళ అనగానే గుర్తుకొచ్చేది ప్రకృతి అందాలు... బ్యాక్ వాటర్...మనసు దోచే సముద్రతీరం...కానీ భవిష్యత్తులో కేరళ ఉగ్రవాదుల రాజ్యంగా మారిపోబోతోందా ? ఇస్లామిక్ టెర్రరిస్టులకు అడ్డాగా చూడాల్సి వస్తుందా ? మత సామరస్యానికి నిలయంగా ఉండే గాడ్స్ ఓన్ కంట్రీ ఐసిస్ తీవ్రవాదానికి హెడ్ క్వార్టర్స్‌గా మారుతుందా ? ఈ ప్రశ్నలనే కథా వస్తువుగా తీసుకుని తెరకెక్కించిన THE KERALA STORY మూవీ విడుదలకు ముందే ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఈ నెల 5న విడుదలవుతున్నTHE KERALA STORY చిత్రంపై కేరళతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయ రచ్చ నడుస్తోంది. ట్రైలర్‌లోనే ఎన్నో వివాదాస్పద అంశాలను చూపించిన దర్శకుడు ఇక సినిమాలో కేరళను ఎలా ఎస్టాబ్లిష్ చేశారన్న ప్రశ్న అటు రాజకీయంగా ఇటు సామాజికంగా చర్చనీయాంశంగా మారింది.
THE KERALA STORYలో ఏముంది ?
కేరళకు చెందిన చదువుకున్న అమ్మాయిలు ఇస్లామిక్ ఉగ్రవాదంపై ఆకర్షితులై భర్తలతో సహా ఆఫ్ఘనిస్తాన్ వెళ్లి ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరడం..ఇదీ క్లుప్తంగా THE KERALA STORY కథ. హిందూ, క్రిస్టియన్ మతాలకు చెందిన నలుగురు అమ్మాయిలు.. ఇస్లాం మతాన్ని స్వీకరించి ఆ తర్వాత ఐసిస్ ఉగ్రవాదులుగా మారిపోతారు. సినిమాలో కేవలం నలుగురు మహిళలను మాత్రమే చూపించినా.. కొన్ని సంవత్సరాలుగా కేరళలో కనిపించకుండా పోయిన 32వేల మంది యువతులు ఐసిస్ ఉగ్రవాదులుగా మారినట్టు ఈ సినిమాలో ప్రస్తావించారు. 2016 నుంచి 2018 మధ్య జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్టు డైరెక్టర్ సుదీప్తో సేన్ చెబుతున్నారు. హిందూ మలయాళీ నర్సు మతం మార్చుకుని మహిళా ఉగ్రవాదిగా మారిన పాత్రలో ఆదా శర్మ నటించారు.
మత చిచ్చు రేపుతున్న డైలాగ్స్
ఈ చిత్రంలోని పాత్రల ద్వారా దర్శకుడు చెప్పించిన కొన్ని సంభాషణలు మత సామరస్యానికి విఘాతం కల్గించేలా ఉన్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. హిందూ దేవుళ్లను కించపరిచేలా ముస్లిం పాత్రలతో చెప్పించడం, మహిళలను ట్రాప్ చేయండి..అవసరమైతే వాళ్లకు కడుపు చేయండి… ఆ తర్వాత వాళ్లను ఉగ్రవాదులుగా మార్చండి అంటూ ఓ ముస్లిం మతపెద్దతో చెప్పిచ్చిన డైలాగ్స్ కేరళను కుదిపేస్తున్నాయి.
రాజకీయంగా ఎందుకింత వివాదం ?
THE KERALA STORY చిత్రాన్ని కేరళలోని వామపక్ష ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ చిత్రం విడుదల కాకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేస్తోంది. అది మా కేరళ స్టోరీ కాదు.. మీ కేరళ స్టోరీ అంటూ బీజేపీ, ఆర్ఎస్సెస్‌పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఫైర్ అయ్యారు. కేరళలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు సంఘ్ పరివార్ శక్తులు పన్నిన కుట్రలో భాగమే ఈ చిత్రమని ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శిస్తున్నారు.
చిత్ర యూనిట్ ఏం చెబుతోంది ?
మతం, ఉగ్రవాదం అన్నవి చాలా సున్నితమైన అంశాలు. వాటిని కథా వస్తువుగా తీసుకుని ఏ చిత్రాన్ని తెరకెక్కించినా కచ్చితంగా వివాదాలు చుట్టుముడతాయి. THE KERALA STORY చిత్రం కూడా అంతే. వాస్తవానికి భిన్నంగా ఇందులో ఒక్క సన్నివేశం కూడా లేదని సినిమా నిర్మాత, దర్శకుడు చెబుతున్నారు. ఈ సినిమా కోసం ఎంతో రీసెర్చ్ చేశామని ఐసిస్ ఉగ్రవాదులు కేరళ మహిళలను ఎలా ట్రాపా్ చేస్తున్నారో చూపించామంటున్నారు. అయితే కేరళ నుంచి 32 వేల మంది ఐసిస్ లో చేరినట్టు ఈ చిత్రంలో చేసిన ప్రస్తావన తీవ్ర దుమారం రేపుతోంది. కేరళపై ఇస్లామిక్ స్టేట్ అని ముద్ర వేసే కుట్రగా ప్రభుత్వ ప్రతిపక్షాలు చూస్తున్నాయి.
నిజంగానే 32వేల మంది ఐసిస్‌లో చేరారా ?
కేరళకు చెందిన 32వేల మంది యువతులు ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరినట్టు ఈ సినిమాలో ప్రస్తావించారు. అయితే దీనికి దర్శకుడు చెబుతున్న ఆధారాలు అనుమానాస్పదంగా ఉన్నాయి. 2012లో అప్పటి కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ఐసిస్ ఉగ్రవాదం- కేరళ సంబంధాలపై రాష్ట్ర అసెంబ్లీలో ఓ ప్రకటన చేశారు. 2006 నుంచి 2667 మంది కేరళ యువత ఐసిస్‌లో జాయిన్ అయినట్టు ప్రకటించారు. అయితే ఆయన ఎక్కడా సంవత్సరానికి ఎంత మంది జాయిన్ అవుతున్నారన్న విషయాన్ని ప్రస్తావించలేదు. అయితే దర్శకుడు మాత్రం ఉమెన్ చాందీ చెప్పిన లెక్కల ప్రకారం పదేళ్లలో కనీసం పదేళ్లలో 32వేల మంది ఐసిస్‌లో చేరినట్టు ఓ అంచనాకు వచ్చేశారు. దాన్నే సినిమాల్లో ప్రస్తావించారు.
కేరళకు ఐసిస్‌కు నిజంగా లింక్ ఉందా ?
మిగతా ఏ రాష్ట్రాల్లో లేని భిన్నమైన మతసామరస్యం కేరళ అస్థిత్వంలో ఉంది. హిందూ దేవాలయ ప్రాంగణాల్లో ఉండే ధ్వజస్తంభం కేరళ చర్చిల్లో దర్శనిమిస్తుంది. శరణుఘోషతో శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే స్వామి భక్తులు ముందుగా ఎరుమేలిలో వావర్ మసీదులో ప్రదక్షణలు చేస్తారు. ఇలా భిన్నమైన వాతావరణం కేరళలో కనిపిస్తుంది. కానీ కొన్నేళ్లు గా జరుగుతున్న పరిణామాలు , వెలుగులోకి వస్తున్న అంశాలు కేరళను ఇస్లామిక్ ఉగ్రవాదం ముప్పులోకి నెడుతున్నాయి.
గాడ్స్ ఓన్ కంట్రీ.. గాడ్స్ ఓన్ ఖిలాఫత్ ఎందుకవుతుంది ?
ఇస్లామిక్ ఉగ్రవాదంవైపు కేరళ యువత ఎందుకు ఆకర్షితులవుతున్నారో తెలుసుకోవాలంటే కేరళకు మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకోవాలి. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఉపాధి అవకాశాల కోసం లక్షలాదిగా కేరళ వాసులు విదేశాలకు వలసపోతూ ఉంటారు. అయితే కొంతమంది చట్ట ప్రకారం విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించుకుంటుంటే.. చాలా మంది అక్రమ మార్గాల్లో మిడిల్ ఈస్ట్ చేరుకుంటున్నారు. 1950 నుంచి ఇప్పటి వరకు దాదాపు 30 లక్షలమంది సముద్రమార్గంలో అక్రమంగా ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, సిరియా వంటి దేశాలకు వలస వెళ్లిపోయారు. అక్కడ ఉద్యోగాలు దొరక్క పేదరికంతో దేశంకాని దేశంలో అవస్థలు పడ్డవాళ్లు లక్షల్లో ఉన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించే కొన్ని మత సంస్థల కళ్లు వీళ్లపై పడ్డాయి. ముఖ్యంగా కేరళ ఉన్నత ప్రాంతంలో ముస్లిం జనాభా చాలా ఎక్కువ. ఈ ప్రాంతం నుంచి అనధికారికంగా మిడిల్ ఈస్ట్ వెళ్లిన వారిలో చాలామంది ఐసిస్‌తో చేతులు కలిపారు. ఉగ్రవాదం ముసుగులో కొందరి జీవితాలు దుర్భరంగా మారడంతో వాళ్లు తిరిగి కేరళ వచ్చి సాధారణ జీవితం గడుపుతున్నారు. 2014-16 మధ్యలో కేరళ కన్నూరు ప్రాంతంలో ఇస్లామిక్ ఉగ్రవాదం వైపు ఆకర్షితులైన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆప్ఘనిస్తాన్‌లో ISIS ప్రభావిత ప్రాంతమైన ఖోరాసన్‌వో అమెరికా బాంబుల దాడి చేస్తే… అక్కడ అమెరికా సైనికులకు చిక్కిన వాళ్లలో కేరళ వాళ్లు కూడా ఉన్నారు.
కేరళ ఐసిస్ రిక్రూట్‌మెంట్ హబ్‌గా మారిందా ?
ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించే పేరుతో వివిధ దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఐసిస్.. భారత్‌లో జమ్ముకశ్మీర్ తర్వాత కేరళ పై ఎక్కువగా ఫోకస్ చేసింది. అందుభాగంగానే కేరళ ఐసిస్ రిక్రూట్‌మెంట్స్‌కు అడ్డాగా మారింది. కేరళకు చెందిన కొంతమంది మతచాంధసవాదులు ఉగ్రవాదాన్ని నూరిపోసి ఆప్ఘనిస్తాన్‌కు తరలిస్తున్నట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. కేరళతో ఐసిస్ లింకులపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA కూడా దర్యాప్తు చేస్తోంది.
THE KERALA STORY విడుదలవుతుందా ?
కేరళ నుంచి వలస వెళ్లిన వారిలో కొంతమంది ఐసిస్‌లో చేరిన మాట వాస్తమే అయినా.. కేరళను ఇస్లామిక్ స్టేట్ గా మారిపోతుందంటూ సినిమాలో హీరోయిన్‌తో చెప్పించిన స్థాయిలో ఉగ్రవాదం చేరుకుందా అన్నది చెప్పలేం. కేరళ ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా THE KERALA STORY ఉందంటున్న ప్రభుత్వం ఈ సినిమాపై నిషేధం విధించే అవకాశాలు లేకపోలేదంటున్నారు ఆ రాష్ట్ర అధికార పార్టీ నేతలు.