మరణ శిక్ష పడ్డ నిందితుడిని నిర్దోషిగా విడుదల చేసిన సుప్రీం కోర్టు
మచిలీపట్నానికి చెందిన శింగవరపు ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో నిందితుడిగా ఉన్న చంద్రభాన్ సనప్‌ను నిర్దోషిగా విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మచిలీపట్నం వాసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాసిక్యూషన్ ఈ కేసులో నిందితుడిపై సరైన సాక్ష్యాధారాలు చూపలేదనే కారణంతో అతడిని నిర్దోషిగా తేల్చడం చర్చనీయాంశంగా మారింది.
మచిలీపట్నానికి చెందిన శింగవరపు ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో నిందితుడిగా ఉన్న చంద్రభాన్ సనప్‌ను నిర్దోషిగా విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మచిలీపట్నం వాసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాసిక్యూషన్ ఈ కేసులో నిందితుడిపై సరైన సాక్ష్యాధారాలు చూపలేదనే కారణంతో అతడిని నిర్దోషిగా తేల్చడం చర్చనీయాంశంగా మారింది. మచిలీపట్నం నోబుల్ కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎస్తేర్ అనూహ్య ముంబైలోని టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. 2014 డిసెంబరులో క్రిస్మస్ సందర్భంగా ఆమె మచిలీపట్నం వచ్చింది. 2015, జనవరి 4న అనూహ్య తండ్రి జోనాతాన్ ప్రసాద్ విజయవాడ రైల్వేస్టేషన్‌కు తీసుకువెళ్లి ముంబై వెళ్లే రైలు ఎక్కించాడు.
జనవరి 5వ తేదీన ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినల్ వద్ద ఆమె రైలు దిగింది. అక్కడి నుంచి ఆమె ఉండే ఇంటికి వెళ్లేందుకు కారు కోసం ఎదురుచూస్తుండగా.. టాక్సీ ఉందని చెప్పి చంద్రభాన్ సనప్ ఆమెను తన వెంట రైల్వేస్టేషన్ బయటకు తీసుకువెళ్లాడు. తన వద్ద కారులేదని.. తన మోటార్ బైక్‌పై తీసుకెళ్తానని చెప్పాడు. చంద్రభాన్ సనప్ వెనుక అనూహ్య నడిచి వెళ్తున్న దృశ్యాలు రైల్వేస్టేషన్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. బైక్‌పై అనూహ్యను తీసుకెళ్లిన చంద్రభాన్.. నిర్మానుష్య ప్రదేశంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడి, హత్య చేసినట్లుగా నిర్ధారణ చేసుకుని పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన ముంబై స్పెషల్ ఉమెన్స్ కోర్టు అప్పట్లో నిందితుడికి మరణశిక్ష విధించింది. దీంతో నిందితుడు చంద్రభాన్ ముంబై హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు అతని అప్పీలును తిరస్కరించింది.
ఈ నేపథ్యంలో నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ చూపిన సాక్ష్యాధారాలు సక్రమంగా లేవనే కారణంతో చంద్రభాన్‌ను నిర్దోషిగా చూపుతూ.. అతన్ని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఉద్యమాలు జరిగాయి. అప్పటి మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఎంపీ సుజనా చౌదరితో కలిసి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఈ కేసులో నిందితుడిని త్వరితగతిన గుర్తించేందుకు. శిక్షపడేందుకు తమవంతు ప్రయత్నాలు చేశారు. అనూహ్య తండ్రి జోనాతానప్రసాద్ను అప్పటి కేంద్ర హోంమంత్రి షిండే వద్దకు తీసుకెళ్లి విషయం వివరించారు.దీంతో ఈ కేసులో నిందితుడిని పట్టుకునేందుకు ముంబై పోలీసులు విచారణను వేగవంతంచేశారు. నిందితుడిని గుర్తించి కోర్టులో హాజరుపరిచారు. అయితే పదేళ్ల తర్వాత ఈ కేసులో మరణశిక్ష పడిన నిందితుడిపై ప్రాసిక్యూషన్ సరైన సాక్షాధారాలు చూపని కారణంగా అతనిని నిర్దోషిగా విడుదల చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.