ఛాంపియన్స్ ట్రోఫీ ఆ జట్టుతోనే మనకు డేంజర్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గర పడింది. ఫిబ్రవరి 19 నుంచి ఈ మెగా టోర్నీ ఆరంభం కానుండగా.. పాకిస్థాన్, దుబాయ్ ఆతిథ్యమిస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 17, 2025 | 02:35 PMLast Updated on: Feb 17, 2025 | 2:35 PM

The Time Is Almost Here For The Icc Champions Trophy

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గర పడింది. ఫిబ్రవరి 19 నుంచి ఈ మెగా టోర్నీ ఆరంభం కానుండగా.. పాకిస్థాన్, దుబాయ్ ఆతిథ్యమిస్తున్నాయి. పాక్ తో మన ద్వైపాక్షిక సంబంధాలు తెగిపోవడంతో భారత్ తన మ్యాచ్ లన్నీ దుబాయ్ లోనే ఆడనుంది. ఇటీవల స్వదేశంలో ఇంగ్లాండ్ పై వరుసగా టీ ట్వంటీ , వన్డే సిరీస్ లు గెలిచిన రోహిత్ సేన ఫుల్ జోష్ లో ఉంది. ఇప్పటికే దుబాయ్ చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్ లో బిజీబిజీగా గడుపుతోంది. తొలి మ్యాచ్ లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తో తలపడనున్న టీమిండియా తర్వాత ఫిబ్రవరి 23న పాకిస్థాన్ తోనూ, మార్చి 2 న్యూజిలాండ్ తోనూ ఆడుతుంది. జట్టులో ఆటగాళ్లంతా సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టచ్‌లోకి రావడం జట్టుకు అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు. దాదాపు ఏడాదికి పైగా వీరిద్దరూ పేలవ ఫామ్ తో విమర్శలు ఎదుర్కొంటూ ఒత్తిడిలో ఉన్నారు. పైగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ వీరిద్దరికీ తమ కెరీర్ లో చివరి ఐసీసీ టోర్నీగా భావిస్తున్నారు. దీంతో ఎట్టిపరిస్థితుల్లోనూ మెగాటోర్నీలో అదరగొట్టాలని రోహిత్ ,. కోహ్లీ పట్టుదలగా ఉన్నారు.

ఇదిలా ఉంటే టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న భారత్ విజయావకాశాలను చూస్తే మన గ్రూపులో ఉన్న ఏ జట్టును తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి. బంగ్లాదేశ్ ను కూడా చిత్తుగా ఓడించి టైటిల్ వేటను ఘనంగా మొదలుపెట్టాలని కోరుకుంటోంది. ఏ మాత్రం లైట్ తీసుకున్నా బంగ్లాదేశ్ సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. ఆ జట్టులో సౌమ్యా సర్కార్, తాన్సిమ్ హసన్ సాకిబ్, మెహ్‌ది హసన్ మిరాజ్‌లతో మంచి బ్యాటింగ్‌ లైనప్ ఉంది. కానీ షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్ వంటి అనుభవం కలిగిన ఆటగాళ్లు లేకపోవడం భారత్‌కు కలిసొచ్చే అంశం. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో బంగ్లాపై భారత్ రికార్డు మెరుగ్గా ఉంది.

ఇక భారత్-పాకిస్థాన్ హైఓల్టేజ్ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. మెగా టోర్నీల్లో మాత్రం పాక్‌పై భారత్‌దే పైచేయి. కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం ముఖాముఖి పోరు‌లో పాక్‌దే పైచేయిగా ఉంది. మొత్తం ఐదు సార్లు తలపడగా పాక్ మూడు సార్లు గెలిచింది. 2017ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను ఓడించే పాక్ విజేతగా నిలిచింది. గత ఏడాది టీ ట్వంటీ వరల్డ్ కప్ లో మాత్రం పాక్ ను భారత్ చిత్తు చేసింది.ఎప్పుడెలా ఆడుతుందో తెలియని పాక్ జట్టును కూడా తక్కువ అంచనా వేయలేం. మహమ్మద్ రిజ్వాన్, అఘా సల్మాన్, ఫకార్ జమాన్, బాబర్ ఆజామ్‌లతో పాక్ బ్యాటింగ్ లైనప్ బాగానే ఉంది. షాహిన్ షా అఫ్రిది, నసీమ్ షా, హ్యారీస్ రౌఫ్‌లతో పేస్ విభాగం పటిష్టంగా ఉన్నప్పటికీ.. మ్యాచ్ ను గెలిపించే స్పిన్నర్లు లేకపోవడం భారత్‌కు అడ్వాంటేజ్. భావోద్వేగాలతో కూడిన ఈ మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమించే జట్టునే విజయం వరిస్తుంది.

మరోవైపు మూడు లీగ్ మ్యాచ్ లలో భారత్ కు న్యూజిలాండ్ తోనే ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే ఆ జట్టు మంచి ఫామ్‌లో ఉంది. పాకిస్థాన్‌ గడ్డపై ట్రై సిరీస్ గెలిచిన కివీస్ జట్టులో డెవాన్ కాన్వే, విలియం యంగ్, టామ్ లాథమ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్‌ వంటి స్టార్ బ్యాటర్లున్నారు. .బౌలింగ్ లో మిచెల్ సాంట్నర్, గ్లేన్ ఫిలిప్స్ స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొవడం టీమిండియా బ్యాటర్లకు సవాలే. అంచనాలకు తగ్గట్టు రాణిస్తేనే న్యూజిలాండ్‌పై భారత్ గెలుస్తుంది. ఈ టోర్నీలో భారత్ సెమీఫైనల్ చేరాలంటే మూడు మ్యాచ్ లలోనూ గెలిస్తే సేఫ్ సైడ్ లో ఉంటాం. లేదంటే సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయి. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఇరు జట్లు ఒకే ఒక్కసారి తలపడగా న్యూజిలాండ్ విజయం సాధించింది. బంగ్లా, పాక్ జట్ల కంటే న్యూజిలాండ్ తో మ్యాచ్ టీమిండియా సెమీస్ అవకాశాలను నిర్ణయించే ఛాన్సుంది.