Titan submersible: తీరానికి టైటాన్.. మనిషి అవశేషాలు గుర్తింపు.. విచారణలో ముందడుగు అంటున్న నిపుణులు
టైటానిక్ నౌక శకలాల దగ్గరకు బయల్దేరిన టైటాన్ సబ్‌మెర్సిబుల్ ప్రయాణం మధ్యలోనే ఒత్తిడి పెరిగి పేలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురి ప్రాణాలు సముద్రంలో కలిసిపోయాయి. ఆ మినీ జలాంతర్గామి శకలాలు ఇప్పుడు తీరానికి చేరాయి. ఆ శకలాల్లో ఆసక్తికర విషయాలు గుర్తించారు అధికారులు.

Titan submersible: టైటాన్ సబ్‌మెర్సిబుల్.. వారం రోజులుగా ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్న అంశమిది. అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక శకలాల దగ్గరకు బయల్దేరిన టైటాన్ సబ్‌మెర్సిబుల్ ప్రయాణం మధ్యలోనే ఒత్తిడి పెరిగి పేలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురి ప్రాణాలు సముద్రంలో కలిసిపోయాయి. ఆ మినీ జలాంతర్గామి శకలాలు ఇప్పుడు తీరానికి చేరాయి. ఆ శకలాల్లో ఆసక్తికర విషయాలు గుర్తించారు అధికారులు.
మనిషి అవశేషాలుగా అనుమానిస్తున్న భాగాలను సేకరించారు. ఈ అవశేషాలను అమెరికాకు చెందిన నిపుణులు ఎనలైజ్ చేయబోతున్నారు. టైటానిక్ శకలాలను వీక్షించేందుకు వెళ్లిన టైటాన్ సబ్‌మెర్సిబుల్‌లో.. ఈ యాత్రను నిర్వహించిన ఓషన్ గేట్ సంస్థ సీఈఓ స్టాక్టన్ రష్, పాకిస్థానీ బిలియనీర్ షాజాదా దావూద్‌తో పాటు ఆయన కుమారుడు సులేమాన్, యూఏఈలో ఉంటున్న బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ఫ్రెంచ్ మాజీ నౌకాదళ అధికారి పాల్ హెన్రీ ఉన్నారు. ఈ మినీ జలాంతర్గామి అదృశ్యమైన కొద్ది గంటలకే పేలిపోయిందనే అంచనాలు ఉన్నాయి.
ప్రమాదానికి కారణాలను గుర్తించడానికి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడటానికి.. తీరానికి వచ్చిన అవశేషాలు ఉపయోగపడే అవకాశం ఉంది. కెనడాలోని న్యూఫౌండ్‌లాండ్ అండ్ లాబ్రడార్ ప్రావిన్సులో సెయింట్ జాన్స్ ఓడరేవుకు టైటాన్ శకలాలు చేరుకున్నాయి. ప్రమాదానికి కారణాలేంటో తెలుసుకునేందుకు జరుగుతున్న దర్యాప్తులో ఇది కీలక పరిణామం అని నిపుణులు చెప్తున్నారు నిపుణులు. టైటానిక్ ఘటనే విషాదం అనుకుంటే.. ఆ టైటానిక్ చూసేందుకు బయల్దేరిన సబ్‌మెర్సిబుల్ కూడా విషాదకర పరిస్థితుల్లో పేలిపోవడం, ఐదు ప్రాణాలు నీటిలో కలిసిపోవడం.. ఈ ఘటనలను ప్రపంచం ఇప్పటికీ మర్చిపోలేకపోతోంది.
అసలు ఓషన్ గేట్ సబ్‌మెరైన్.. సముద్రంలోపలికి వెళ్లాక ఏం జరిగింది..? ఆ జలాంతర్గామి మీద ఎంత ఒత్తిడి పడింది..? ఒత్తిడిని ఎంతసేపు అది తట్టుకుంది..? బయల్దేరిన తర్వాత, నీటిలో మునిగిన తర్వాత ఎంతసేపటికి సబ్‌మెరైన్ పేలిపోయింది..? ఇలాంటి విషయాలన్నింటినీ ఆరా తీసే పనిలో అధికారులు ఉన్నారు. ఐతే తీరానికి కొట్టుకు వచ్చిన ఆ శకలాలు కీలక ఆధారాలుగా మారే అవకాశం ఉంది.