Train Accident: విజయనగరం జిల్లాలో రెండు రైళ్లు ఢీ.. ఒకరు మృతి..

ఓవర్ హెడ్ కేబుల్ తెగిపోవటంతో, సిగ్నల్ లేకపోవడంతో రైలును పట్టాలపై నిలిపి ఉంచారు. పట్టాలపై ఆగి ఉన్న రైలును.. ఇదే సమయంలో వెనుక నుంచి వచ్చిన విశాఖపట్నం-రాయగడ ప్యాసింజర్ రైలు ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మరణించినట్లు తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 29, 2023 | 08:53 PMLast Updated on: Oct 29, 2023 | 8:53 PM

Train Accident In Visakhapatnam Several Feared Dead As Rayagada Bound Train Hits Passenger Train

Train Accident: విజయనగరం జిల్లాలో ఆదివారం సాయంత్రం రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డట్లు తెలుస్తోంది. విశాఖపట్నం నుంచి పలాస వెళ్తున్న ప్యాసింజర్ రైలు కొత్త వలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద ఆగి ఉంది. ఓవర్ హెడ్ కేబుల్ తెగిపోవటంతో, సిగ్నల్ లేకపోవడంతో రైలును పట్టాలపై నిలిపి ఉంచారు. పట్టాలపై ఆగి ఉన్న రైలును.. ఇదే సమయంలో వెనుక నుంచి వచ్చిన విశాఖపట్నం-రాయగడ ప్యాసింజర్ రైలు ఢీకొంది.

ఈ ఘటనలో ఒకరు మరణించినట్లు తెలుస్తోంది. మరికొందరు గాయపడ్డారు. ఘటన సమచారం అందుకున్న సహాయక బృందాలు హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకుని, సహాయక చర్యలు ప్రారంభించాయి. ప్రమాదం గురించి రైల్వే బోర్డు గ్రూపులో డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్ సమాచారం అందించారు. అధికారులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. ఈ ప్రమాదంలో 3 బోగీలు పట్టాలు తప్పాయి. విద్యుత్ వైర్లు కూడా తెగిపోయాయి. దీంతో ఈ ప్రాంతమంతా పూర్తి చీకటిమయంగా ఉంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. అయితే, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాద స్థలంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.

క్షతగాత్రులను విజయనగరం ప్రభుత్వ హాస్పిటల్‌కు.. విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తున్నారు. అయితే.. సెల్‌ఫోన్ల వెలుగుల్లోనే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద స్థలంలోని దృశ్యాలు భీతావహంగా ఉన్నాయి. ఘటన గురించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. కోరమాండల్ ప్రమాదం కళ్ల ముందు కదులుతున్న వేళ.. ఏపీలో మరో రైలు ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది.