Uttar Pradesh: ఏసీ వేసుకుని పడుకున్న డాక్టర్.. చలికి ప్రాణాలు కోల్పోయిన శిశువులు..
హాయిగా నిద్రపోయేందుకు ఏసీ వేసుకోవడంతో, ఆ చలికి తట్టుకోలేక ఇద్దరు నవజాత శిశువుల ప్రాణాలు తీసింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్, శామలి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కైరాణా ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం ఇద్దరు పిల్లలు జన్మించారు.
Uttar Pradesh: తమను నమ్మి వచ్చే రోగుల ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. వైద్య సేవల్లో చిన్న నిర్లక్ష్యం కూడా ఒక్కోసారి భారీ మూల్యానికి కారణమవుతుంది. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో అలాంటి ఘటనే జరిగింది. నవజాత శిశువుల ప్రాణాలు కాపాడాల్సిన డాక్టరే.. ఆ పసి ప్రాణాలు పోయేందుకు కారణమయ్యాడు. హాయిగా నిద్రపోయేందుకు ఏసీ వేసుకోవడంతో, ఆ చలికి తట్టుకోలేక ఇద్దరు నవజాత శిశువుల ప్రాణాలు తీసింది.
ఈ ఘటన ఉత్తర ప్రదేశ్, శామలి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కైరాణా ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే, ఆ శిశువులు అనారోగ్యంతో ఉండటంతో శనివారం సాయంత్రం వారిని మెరుగైన చికిత్స కోసం దగ్గర్లోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆ శిశువులను ఫొటో థెరపీ యూనిట్‌లో ఉంచి, చికిత్స అందించారు. ఈ క్రమంలో రాత్రిపూట వారిని సంరక్షించాల్సిన డాక్టర్ నీతు.. రాత్రంతా హాయిగా నిద్రపోయే ఉద్దేశంతో పిల్లలు ఉన్న గదిలో ఏసీ వేసుకుని పడుకుంది. అంతే.. ఏసీ చల్లదనానికి శిశువులు మరణించారు.
పిల్లల కుటుంబ సభ్యులు ఉదయాన్నే వచ్చి చూసే సరికి విగత జీవులుగా కనిపించారు. తమ చిన్నారుల్ని అలా చూసి ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, వారి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి, శిశువుల మరణాలకు కారణమైన డాక్టర్‌పై, ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. వైద్య శాఖాధికారులు కూడా స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.