US Man: ప్రేయసిని పొడిచి చంపిన ప్రియుడు.. 60 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు..!

అమెరికాలోని టెక్సాస్‌లో డంట్రవియాస్ జమాల్ మెక్ నీల్ (35).. కేటీ హోక్ అనే (47) ఏళ్ల మహిళతో సహజీవనం చేసేవాడు. ఇద్దరి మధ్యా కొంతకాలం తర్వాత విబేధాలు తలెత్తాయి. ఈ క్రమంలో మెక్ నీల్.. తరచూ కేటీని వేధించేవాడు. ఆమెపై దాడికి పాల్పడేవాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 27, 2023 | 05:33 PMLast Updated on: Aug 27, 2023 | 5:33 PM

Us Man Sent To 60 Years In Prison For Stabbing His Living Partner 27 Times

US Man: నేరాలు జరిగినప్పుడు శిక్షలు కఠినంగా ఉంటేనే.. సమాజంలో భయం ఉంటుంది. అలాంటి కఠిన శిక్షలు వేసే దేశాల్లో అమెరికా ఒకటి. తన ప్రేయసిని పొడిచి చంపిన వ్యక్తికి అమెరికా కోర్టు ఏకంగా 60 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. అక్కడ శిక్షలు ఏ స్థాయిలో ఉంటాయో.
అమెరికాలోని టెక్సాస్‌లో డంట్రవియాస్ జమాల్ మెక్ నీల్ (35).. కేటీ హోక్ అనే (47) ఏళ్ల మహిళతో సహజీవనం చేసేవాడు. ఇద్దరి మధ్యా కొంతకాలం తర్వాత విబేధాలు తలెత్తాయి. ఈ క్రమంలో మెక్ నీల్.. తరచూ కేటీని వేధించేవాడు. ఆమెపై దాడికి పాల్పడేవాడు. దీనిపై గతంలోనూ కేసులు నమోదయ్యాయి. ఇదే క్రమంలో ఆగష్టు 17, 2020న మెక్ నీల్.. కేటీని హత్య చేశాడు. ఆమెను కత్తితో పొడిచాడు. ఏకంగా 27 సార్లు కత్తితో పొడవడంతో ప్రాణాలు విడిచింది. పోలీసులు వచ్చి చూసే సరికి కేటీ రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కేటీ మరణించిందని వైద్యులు తెలిపారు. దీంతో నిందితుడు మెక్ నీల్‌పై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. మూడేళ్లుగా ఈ కేసు విచారణ జరిగింది. దీనిపై విచారణ జరిపిన హ్యారిస్ కౌంటీ డిస్ట్రిక్ అటార్నీ జనరల్.. మెక్ నీల్‌ను నిందితుడిగా తేల్చారు.

కేటీని వేధింపులకు గురి చేయడం, దాడి చేయడం, హత్య చేయడం వంటి నేరాలకుగాను నీల్‌కు శిక్ష విధించారు. నేర తీవ్రత దృష్ట్యా ఏకంగా 60 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారు. నేరాన్ని అంగీకరించిన మెక్ నీల్.. తాను ఆత్మ రక్షణ కోసమే హత్య చేశానని చెప్పాడు. అందువల్ల తనకు తక్కువ కాలం శిక్ష విధించాలని చెప్పాడు. దీనికి కోర్టు అంగీకరించలేదు. అతడు ఉద్దేశపూర్వకంగానే హత్య చేసినట్లు కోర్టు అభిప్రాయపడింది. మృతురాలి శరీరంలోని గుండెపైనే రెండుసార్లకు పైగా పొడిచినట్లు వైద్య నివేదిక తేల్చింది. అందువల్ల అతడి నేరాన్ని దృష్టిలో ఉంచుకుని, 60 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.