Vivekananda Reddy: వివేకా కేసులో రహస్య సాక్షి ఎవరు ?

వివేకా కేసు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. సినిమాను మించిన ట్విస్టులు కనిపిస్తున్నాయ్ ఈ ఎపిసోడ్‌లో! సీబీఐ దర్యాప్తులో మైండ్‌ బ్లాంక్ అయ్యే సంచలన నిజాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయ్. వివేకా హత్య ఘటన గురించి ప్రపంచానికి తెలియడానికి ముందే.. జగన్‌కు సమాచారం అందిందని.. హైకోర్టులు అఫిడవిట్ దాఖలు చేసింది సీబీఐ. దీంతో వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 28, 2023 | 03:44 PMLast Updated on: May 28, 2023 | 3:44 PM

Vivekananda Reddy Murder Case 2

ఇక అటు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు ఇప్పటికే కీలక ఆదేశాలు ఇచ్చింది. తుది తీర్పు ఇచ్చే వరకూ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొద్దని సూచించింది. ఐతే హైకోర్టు మధ్యంతర తీర్పునకు ముందు సీబీఐ సుదీర్ఘంగా వాదనలు వినిపించింది. ఈ వాదనల్లో ఓ రహస్య సాక్షి ఉన్నారని సీబీఐ తెలిపింది. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. ఇంతకీ ఆ రహస్య సాక్షి ఎవరనే చర్చ జరుగుతోంది.

రహస్య సాక్షి ఎవరు.. జగన్‌కు తెలిసిన వాళ్లు.. వైఎస్ కుటుంబానికి ఆప్తులా.. వివేకా బంధువులా.. లేదంటే వివేకా కలిసి పనిచేసిన వాళ్లు.. ఎవరు వాళ్లు.. ఏం చెప్పారు.. ఆ సాక్షి చెప్పిన విషయాలను సీబీఐ ఎప్పుడు బయటపెట్టబోతోందనే ఉత్కంఠ ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది. వివేకా హత్య కేసులో ఊహించని పరిణామాలు వెలుగుచూస్తన్నాయ్. అవినాష్ రెడ్డి విచారణకు తప్పించుకోడానికి ప్రయత్నిస్తున్నారని సీబీఐ వాదిస్తోంది.

కర్నూలులో దాదాపు అరెస్టు వరకూ వెళ్లినా.. పోలీసులు సహకరించకపోవడంతో సీబీఐ అధికారులు వెనక్కి వచ్చేసిన పరిస్థితి. ఇప్పుడు సీబీఐ బయట పెడుతున్న విషయాలు సంచలనం అవుతున్నాయ్. హైకోర్టుకు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్‌లో జగన్ పేరు ప్రస్తావించిన సీబీఐ.. శనివారం జరిగిన వాదనల్లో ఓ రహస్య సాక్షి గురించి చెప్పింది. ఈ వ్యవహారంలో పక్కా సాక్ష్యాలతో రహస్య సాక్షి సీబీఐకి సహకరిస్తున్నారని తెలుస్తోంది. సీబీఐ ఈ కేసును వ్యూహాత్మకంగా ముందుకు నడిపిస్తున్నట్లుగా సమాచారం.

అవినాష్ రెడ్డికి లభిస్తున్న ఊరటలపై కూడా సీబీఐ ఆరా తీస్తుంది. ఈ కేసు విచారణలో సీబీఐ చాలా ఒత్తిళ్లు ఎదుర్కొంటోందని తెలుస్తోంది. అయినా ఎక్కడా తగ్గకుండా దర్యాప్తును ముందుకు తీసుకెళ్తోంది. ఇంతకాలం రహస్య సాక్షి విషయాన్ని సీక్రెట్‌గా ఉంచిన సీబీఐ… ఇప్పుడీ విషయాన్ని ప్రస్తావించింది. కేసు విచారణ తుదిదశకు వచ్చిందని, అందుకే సీబీఐ కీలక విషయాలు ప్రస్తావిస్తోందని తెలుస్తోంది. అవినాష్‌ రెడ్డికి కడప ఎంపీ సీటు ఇవ్వడం వివేకాకు ఇష్టం లేదని… జమ్మలమడుగు ఎమ్మెల్యే సీటు ఇవ్వడానికి అభ్యంతరం లేదన్నారని రహస్య సాక్షి వాంగ్మూలం ఇచ్చారని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఏప్రిల్‌ 26న నమోదు చేసిన ఈ వాంగ్మూలాన్ని వచ్చే కౌంటర్ దాఖలు చేస్తామని స్పష్టం చేసింది.

ఈ వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తిని సాక్షిగా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. ప్రస్తుతం ఆ వ్యక్తి పేరును, వాంగ్మూలాన్ని బయటపెట్టలేమని చెప్పింది. బయటపెడితే ఏమవుతుందో గత సంఘటనలు చూస్తే తెలుస్తుందని తెలిపింది. వాంగ్మూలం ఇచ్చిన గంగాధర్‌రెడ్డి సూసైడ్ చేసుకోవడం.. ముందు వాంగ్మూలం ఇచ్చిన సీఐ శంకరయ్య తర్వాత నిరాకరించడం సంఘటనలు ఇందుకు రుజువు అంటూ కోర్టుకు వివరించింది. సీబీఐ వాదనలతో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఎవరా రహస్య సాక్షి అనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తోంది. ఒక్కసారి అతని పేరు బయటపెడితే.. ఈ కేసు మరో సంచలన మలుపు తీసుకోవడం ఖాయం. రహస్య సాక్షి వాదన ఎలా ఉన్నా.. ఇదంతా ఎల్లో మీడియా ఆడుతున్న డ్రామా అని వైసీపీ కొట్టిపారేస్తోంది.