Manipur violence: వీడియో బయటకు వచ్చే వరకు ఏం చేస్తున్నారు..? మణిపూర్ ఘటనలో కేంద్రానికి సుప్రీం ప్రశ్న
మణిపూర్‌లో జరుగుతున్న హింసపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగిన సంగతి తెలిసిందే. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని బెంచ్ దీనిపై విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించగా, బాధిత మహిళల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు.
Manipur violence: మణిపూర్‌లో జరిగిన హింస మే 4న వెలుగులోకి వస్తే.. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి 14 రోజుల సమయం ఎందుకు పట్టిందని కేంద్రాన్ని ప్రశ్నించింది భారత సుప్రీంకోర్టు. ఈ అంశంలో కేంద్ర వైఫల్యంపై సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది. మణిపూర్‌లో జరుగుతున్న హింసపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగిన సంగతి తెలిసిందే. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని బెంచ్ దీనిపై విచారణ జరిపింది.
కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించగా, బాధిత మహిళల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, అత్యాచారానికి పాల్పడ్డ ఘటన మే 4న జరిగింది. అయితే, ఇటీవల ఆ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చే వరకు ప్రభుత్వం దీనిపై స్పందించలేదు. ఈ వ్యవహారంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. మేలో ఘటన జరిగిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఎన్ని ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించిన అరెస్టులు, ఎఫ్ఐఆర్ వివరాల్ని కోర్టుకు సమర్పించాలని సూచించింది. మణిపూర్‌లో జరిగిన హింసను అదుపు చేయాలంటే విస్తృతమైన కార్యాచరణ ప్రణాళిక అవసరమని కోర్టు అభిప్రాయపడింది. మణిపూర్ అత్యాచార ఘటన విచారణను అసోంకు బదిలీ చేయడాన్ని బాధిత మహిళలు వ్యతిరేకిస్తున్నారని వారి తరఫు న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు.
దీనికి ప్రభుత్వం బదులిస్తూ.. కేసును బదిలీ చేయాలని తాము కూడా కోరలేదన్నారు. అత్యాచారానికి గురైన ఒక మహిళరి తండ్రి, సోదరుడు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను ఇంకా గుర్తించలేదని కపిల్ సిబల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేసు విచారణ కోసం అత్యున్నత మహిళా కమిటీని ఏర్పాటు చేయాలని మరో న్యాయవాది ఇందిరా జైసింగ్ కోరారు. దీనికి స్పందించిన న్యాయస్థానం.. ఈ ఘటనపై వివిధ రంగాలకు చెందిన నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ కమిటీలో మహిళా న్యాయవాదులు కూడా ఉంటారని తెలిపింది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తానంటే కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. మరోవైపు మణిపూర్ ఘటనపై సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని కోరుతూ మైతేయిలు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఒక వర్గాన్ని దోషిగా చూపించేలా పిటిషన్‌లను విచారించడం కుదరదని వెల్లడించింది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.