IIT-Hyderabad: ఐఐటీల్లో ఏం జరుగుతోంది..? కలకలం రేపుతున్న వరుస ఆత్మహత్యలు..? బాధ్యులెవరు..?

ఐఐటీల్లో ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా.. అందులో 2022-23లోనే నలుగురు ఐఐటీ హైదరాబాద్ విద్యార్థుల ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా సోమవారం ఒక విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. అసలింతకీ ఈ ఆత్మహత్యలకు బాధ్యులెవరు..? పిల్లల ప్రాణాలు బలిగొంటున్న కారణాలేంటి..?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 8, 2023 | 01:21 PMLast Updated on: Aug 08, 2023 | 1:21 PM

What Is The Reason Behind Students Suicide In Iit Hyderabad Campus

IIT-Hyderabad: ఐఐటీ క్యాంపస్‌లలో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అక్కడ చదువుకుంటున్న పిల్లల తల్లిదండ్రులు ఆందోళనతో తల్లడిల్లుతున్నారు. ఏ క్షణాన తమ పిల్లల గురించి ఏ విషయం వినాల్సి వస్తుందో అని ఆవేదనకు గురవుతున్నారు. ఐఐటీల్లో ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా.. అందులో 2022-23లోనే నలుగురు ఐఐటీ హైదరాబాద్ విద్యార్థుల ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా సోమవారం ఒక విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. అసలింతకీ ఈ ఆత్మహత్యలకు బాధ్యులెవరు..? పిల్లల ప్రాణాలు బలిగొంటున్న కారణాలేంటి..?
గతేడాది ఆగస్టు 31న క్యాంపస్‌లో ఏపీలోని నంద్యాల జిల్లా విద్యార్థి రాహుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గతేడాది సెప్టెంబర్ 6న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కి చెందిన ఐఐటీ పూర్వ విద్యార్థి మేగ్‌కపూర్ సూసైడ్ చేసుకున్నాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కార్తీక్ గత నెల 17న క్యాంపస్ నుంచి బయటికి వెళ్లి, వైజాగ్‌లో సముద్రంలో శవమై తేలాడు. తాజాగా ఆగస్టు 7న ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఒడిషాకు చెందిన విద్యార్థిని మమైతా నాయక్ ఆత్మహత్యకు పాల్పడింది. మమైతా ఎంటెక్ చదువుతోంది. చదువులో ఒత్తిడి తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసింది. అంతకుముందు కూడా పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా వరుస ఆత్మహత్యలతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.
చదువులో ఒత్తిడే కారణమా..?
విద్యార్థుల ఆత్మహత్యల వెనుక వినిపిస్తున్న ప్రధాన కారణం.. చదువులో ఒత్తిడి. వారి సూసైడ్ లెటర్స్ ద్వారా కూడా ఇదే విషయం వెల్లడైంది. చదువులో ఒత్తిడి తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ లెటర్స్ చెబుతున్నాయి. పాఠాలు అర్థం కాకపోవడం.. పరీక్షల్లో ఫెయిల్ కావడం, అధ్యాపకులు, పేరెంట్స్ ఒత్తిడి, వీటివల్ల డిప్రెషన్.. ఈ డిప్రెషన్ కారణంగా ఆత్మహత్యలు. ఇవీ విద్యార్థులు బలవ్వడానికి కారణాలు. పరీక్షల్లో ఒక్కసారి ఫెయిల్ అయితేనే.. ఇంక మళ్లీ పాసవ్వలేమేమోనని, పేరెంట్స్ తమ మీద పెట్టుకున్న ఆశల్ని నిజం చేయలేమేమో అన్న భయంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు.
బాధ్యులెవరు..?
పిల్లల ఆత్మహత్యకు నిజంగా బాధ్యలెవరు..? అటు తల్లిదండ్రులు, ఇటు అధ్యాపకుల్ని కూడా బాధ్యులుగా చూడాలి. పిల్లలపై వాళ్లంతా అనవసర ఒత్తిడి పెంచుతున్నారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక పిల్లలు తనువు చాలిస్తున్నారు. ఆత్మహత్యల్ని నివారించే అవకాశాలు ఉన్నా వాటిపై అటు తల్లిదండ్రులు, ఇటు అధ్యాపకులు దృష్టి సారించడం లేదు. పిల్లలు మానసిక ఒత్తిడికి గురికాకుండా చూడాలి. పిల్లల్లో అలాంటి లక్షణాలు కనిపిస్తే సైకాలజిస్టులతో తగిన కౌన్సెలింగ్ ఇప్పించాలి. నిజానికి ఐఐటీల్లో చదువుకునే విద్యార్థులు అంతా తెలివైన వాళ్లే. మంచి మార్కులు సాధించిన వారికే ఇక్కడ సీట్లొస్తాయి. అలాంటిది ఐఐటీల్లోకి వచ్చాక కొందరు సరిగ్గా చదవలేకపోతున్నారు. ఈ విషయంలో లోపం ఎక్కడుందో అధ్యాపకులు గుర్తించాలి. అవసరమైన విద్యార్థుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వారిపై కోప్పడటం, చిరాకుపడటం లాంటివి చేయకూడదు. మార్కులే జీవిత లక్ష్యం కాదని చెప్పాలి. అలాగే క్యాంపస్‌లో మంచి వాతావరణం ఉండేలా చూడాలి. ర్యాగింగ్ వంటి వేధింపులకు తావు లేకుండా బాధ్యతవహించాలి. ఐఐటీల్లో చదివేది టీనేజ్ విద్యార్థులే. వీళ్లకు ఒత్తిడిని, ఓటమిని తట్టుకునే మానసిక శక్తి లేకపోవచ్చు. అలాంటప్పుడు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి చైతన్యపర్చాలి.
ఐఐటీ సిబ్బంది ఏం చేస్తున్నట్లు..
విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతోంది క్యాంపస్‌ల్లోనే. అంటే అక్కడి సిబ్బందినే దీనికి బాధ్యుల్ని చేయాలి. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే వీళ్లంతా ఏం చేస్తున్నట్లు..? విద్యార్థుల ఆత్మహత్యల్ని నివారించడానికి ఏం చేస్తున్నట్లు..? గతంలో ఆత్మహత్య చేసుకున్న వారి విషయంలో నివేదికలేమయ్యాయి..? వీటికి సమాధానం అక్కడి సిబ్బందే చెప్పాలి.