WhatsApp Scam: వాట్సాప్ యూజర్లూ.. జర జాగ్రత్త! ఈ నెంబర్ల నుంచి కాల్స్ వస్తే ఏం చేయాలంటే..

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వాడే సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ ఇప్పుడు సైబర్ నేరాలకు అడ్డాగా మారింది. వాట్సాప్‌ ద్వారా వీడియో కాల్స్, మెసేజెస్ పంపి యూజర్లను మోసం చేస్తున్నారు. తాజాగా ఈ స్కాం ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తోంది. అందుకే +91 కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చే కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 8, 2023 | 01:02 PMLast Updated on: May 08, 2023 | 1:03 PM

Whatsapp Users Beware Messages And Calls You Are Receiving From International Numbers Are A Scam

WhatsApp Scam: వాట్సాప్‌లో మరో సైబర్ స్కాం ఇప్పుడు యూజర్లను బెంబేలిత్తిస్తోంది. అంతర్జాతీయ నెంబర్ల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్‌లకు స్పందించారో.. మీరు సైబర్ వలలో చిక్కుకున్నట్లే. మీకు న్యూడ్ కాల్స్ చేసి, మిమ్మల్ని ట్రాప్‌లోకి దించుతారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆ వీడియోలు, ఫొటోలు మీవాళ్ల కాంటాక్ట్స్‌కు వెళ్లిపోతాయి. దీంతో బాధితులు అటు పోలీసులకు ఫిర్యాదు చేయలేక.. సైబర్ నేరగాళ్లు అడిగినంత ఇవ్వలేక సతమతమవుతున్నారు. అందుకే ఇలాంటి కాల్స్, మెసేజెస్‌కు స్పందించవద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వాడే సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ ఇప్పుడు సైబర్ నేరాలకు అడ్డాగా మారింది. వాట్సాప్‌ ద్వారా వీడియో కాల్స్, మెసేజెస్ పంపి యూజర్లను మోసం చేస్తున్నారు. తాజాగా ఈ స్కాం ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తోంది. అందుకే +91 కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చే కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. విదేశీ నెంబర్లైనా సరే.. మీకు తెలిసిన వాళ్లైతే సరే. కానీ, కొత్త నెంబర్ల నుంచి అనుమానాస్పదంగా కాల్స్ లేదా మెసెజేస్ వచ్చినా వాటికి స్పందించకూడదు. సైబర్ నేరగాళ్లు విదేశీ నెంబర్ల నుంచే మోసాలకు పాల్పడుతున్నారు. ప్రధనాంగా ఇథియోపియా (+251), మలేసియా (+60), ఇండోనేసియా (+62), కెన్యా (+254), వియత్నాం (+84) వంటి దేశాల నుంచి వచ్చే కాల్స్‌కు స్పందించకూడదు.
ఎలా మోసం చేస్తారు?
ఈ నెంబర్ల నుంచి కాల్స్ లేదా మెసేజెస్ రావొచ్చు. కాల్ రాగానే లిఫ్ట్ చేయొద్దు. ముఖ్యంగా వీడియో కాల్స్. మీరు కాల్ లిఫ్ట్ చేయగానే.. అవతలి వైపు ఒక మహిళ న్యూడ్ కాల్ చేస్తుంది. అది గమనించి మీరు కాల్ కట్ చేసినా సరే.. ఆ లోపు ఆ వీడియోను వాళ్లు స్క్రీన్ రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత దీనికి సంబంధించిన వీడియోను మీకు పంపుతారు. అడిగినంత డబ్బు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తారు. డబ్బు ఇవ్వకపోతే మీ కాంటాక్ట్ లిస్టులోని వాళ్లందరికీ ఆ వీడియో పంపిస్తామని బెదిరిస్తారు. దీంతో యూజర్లు డబ్బు ఇచ్చి తీరాల్సిన పరిస్థితి. పైగా ఇది ఒక్కసారికే ఆగిపోతుందని చెప్పలేం. ఆ వీడియో అడ్డం పెట్టుకుని అనేకసార్లు ఇలా బెదిరించవచ్చు. యూజర్లు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. వీడియో కాల్స్ మాత్రమే కాదు.. మెసేజెస్, లింక్స్ మొబైల్ ఫోన్లకు పంపుతారు. యూజర్లు వాటిపై క్లిక్ చేస్తే ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలోకి వైరస్ చొప్పిస్తారు. దీంతో బ్యాంక్ అకౌంట్లలోని డబ్బును కాజేయొచ్చు. మీ ఫొటోలు, వీడియోలను దొంగిలించి మిమ్మల్ని బెదిరించవచ్చు. మొత్తంగా మీ డివైజ్‌లోని వ్యక్తిగత సమాచారం అంతా వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. జాబ్స్ పేరిట కూడా కొందరు మోసానికి పాల్పడుతున్నారు. జాబ్స్ ఇప్పిస్తామని, ఇంటర్వ్యూలు అరేంజ్ చేస్తామని చెప్పి యూజర్ల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. ఇలా అవకాశం ఉన్న ప్రతిదాన్ని సైబర్ నేరగాళ్లు వాడుకుంటున్నారు.

WhatsApp Scam
యూజర్లు ఏం చేయాలి?
ఇలాంటి మోసాలపై ఫిర్యాదు చేసినా సైబర్ పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే అవి విదేశీ నెంబర్లు. పైగా అవి ఆ దేశం నుంచే చేస్తున్నారని చెప్పలేం. ఒక దేశం నెంబర్ తీసుకుని, మరో దేశం నుంచి కాల్స్ చేసి ఉండొచ్చు. అందువల్ల మోసాలు, వేధింపులకు గురైనా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం ఉండదు. కాబట్టి ముందుగానే ఇలాంటివాటిపై అవగాహన కలిగి ఉండాలి. సైబర్ మోసాలకు గురి కాకూడదనుకుంటే యూజర్లు చేయాల్సింది ఒకటే.. ఇలాంటి కాల్స్, మెసేజెస్‌కు స్పందించకుండా ఉండటం. విదేశీ నెంబర్ల నుంచి వచ్చే వాటికి రెస్పాండ్ అవ్వకూడదు. వెంటనే ఆ నెంబర్‌ను బ్లాక్ చేయాలి. అప్రమత్తంగా వ్యవహరించడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం.