ఎవరీ రాఘవ రెడ్డి ? చిలుకూరు బాలాజీ అర్చకుడిపై దాడి ఎందుకు చేసాడు?
చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై దాడి రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు 20 మందికి పైగా రంగరాజన్ పై అటాక్ చేశారు.

చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై దాడి రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు 20 మందికి పైగా రంగరాజన్ పై అటాక్ చేశారు. రంగరాజన్ అతని కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ల కోసం గాలిస్తున్నారు. అసలు రంగరాజన్ దాడి చేసిన వీర రాఘవ రెడ్డి ఎవరు ? అతను ఏం చేస్తాడు ? ఎందుకు రామరాజ్యం పేరుతో సైన్యాన్ని ఏర్పాటు చేస్తున్నాడు.. రంగరాజన్ మీద దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ఇప్పుడు ఇదే ప్రతీ ఒక్కరిలో ఉన్న డౌట్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన వ్యక్తి ఈ కొవ్వూరి వీర రాఘవరెడ్డి. హిందూ రాజ్య స్థాపన కోసం రామరాజ్యం పేరుతో ప్రైవేట్ సైన్యం నడిపిస్తున్నాడు. దేశంలో రామరాజ్యం ఏర్పాటు కావాలని.. ప్రచారం చేస్తుంటాడు. పదో తరగతి పాసైన లేదా ఫెయిల్ అయిన యువకులను తన సైన్యంలో రిక్రూట్ చేస్తూ వస్తున్నాడు. 5 కిలో మీటర్లు నడిచే సామర్థ్యం, రెండు కిలో మీటర్లు పరిగెత్తే సామర్థ్యం ఉండాలి.
వయసు 20 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఒక్కొక్కరికి 20వేల జీతం. యువతను తన సైన్యం చేర్చుకుంటూ వాళ్లతో ఇలాంటి దౌర్జన్యాలు చేయిస్తున్నట్లు వీర రాఘవరెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయి. చిలుకూరు బాలాజీ అర్చకుడిని తన రామరాజ్యం సైన్యంలో చేరాలంటూ ఒత్తిడి చేశాడు.. చేరను అన్నందుకు ఇంటిపై దాడి చేశాడు వీర రాఘవ రెడ్డి. అతని కుమారుడిని తన ప్రైవేట్ సైన్యంతో కొట్టించాడు. గతంలో హైదరాబాద్ అబిడ్స్‌లో కూడా వీర రాఘవరెడ్డిపై దాడి కేసు నమోదు అయ్యింది. ‘రామరాజ్యం’ పేరుతో వెబ్‌సైట్ ప్రారంభించి, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. గత కొంత కాలంగా వీర రాఘవరెడ్డి హైదరాబాద్‌లోని మణికొండలో నివాసం ఉంటున్నాడు. 2022లో ‘రామరాజ్యం’ పేరుతో వెబ్ సైట్ ప్రారంభించాడు. యూట్యూబ్, ఫేస్‌బుక్ ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ప్రచారం చేశాడు. అందులో భగవద్గీత శ్లోకాలను అప్‌లోడ్ చేసేవాడు. యువతను ప్రేరేపించే విధంగా హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ఆర్మీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రచారం చేశాడు. ఈ క్రమంలోనే ‘రామరాజ్యం ఆర్మీ’ పేరుతో రిక్రూట్‌మెంట్ ప్రారంభించాడు. గతేడాది సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు రిక్రూట్‌మెంట్ చేశాడు.
నెలకు 20 వేల చొప్పున జీతం ఇస్తానని చెప్పి, 25 మందిని తన ఆర్మీలో జాయిన్ చేసుకున్నాడు. వీళ్లను గత నెల 24న ఏపీలోని పశ్చిమ గోదావరి తణుకుకు తీసుకెళ్లి మీటింగ్ నిర్వహించాడు. అక్కడ నాలుగు రోజులు ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత కోటప్పకొండకు తీసుకెళ్లాడు. ఒక్కొక్కరి దగ్గర 2 వేల చొప్పున తీసుకుని, వాళ్లకు బ్లాక్ యూనిఫామ్ కుట్టించాడు. ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్ తీసుకొచ్చాడు. తన సైన్యానికి ఫండింగ్ ఇవ్వాలని, చిలుకూరు గుడికి వచ్చే భక్తులను తన సైన్యంలో చేరేలా ప్రేరేపించాలని రంగరాజన్‌ను అడిగాడు. దానికి రంగరాజన్ నిరాకరించడంతో తమ మనుషులతో రంగరాజన్ మీద దాడి చేయించాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని అరెస్ట్ చేయగా.. ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఇద్దరు మహిళలు సహా ఐదుగురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ దాడిలో మొత్తం 22 మంది పాల్గొన్నట్టు గుర్తించారు. వీరిలో తెలంగాణకు చెందిన ఏడుగురు, ఏపీకి చెందిన 10 మందిని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఐడెంటిఫై చేశారు. ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేయగా, పరారీలో ఉన్న మరో 16 మంది కోసం గాలిస్తున్నారు.