Who killed Satwik?: సాత్విక్ అసలు హంతకులు ఎవరు?

ఆత్మహత్య లకు కారకులైన చైతన్య, నారాయణతో పాటు మిగిలిన కార్పొరేట్ విద్య సంస్థలు మాత్రం వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూనే ఉన్నాయి. పిల్లల శవాలపై ఏరుకున్న డబ్బు లోంచి కొంత పొలిటికల్ ఫండింగ్ చేస్తాయి. అన్ని పార్టీలు కార్పొరేట్ విద్యాసంస్థల నుంచి డబ్బు సంచులు అందుకుంటాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 7, 2023 | 07:02 PMLast Updated on: Mar 07, 2023 | 7:05 PM

Who Killed Satwik College Or Government

సాత్విక్ (Satwik) అనే ఇంటర్ కుర్రాడి ఆత్మ హత్య రెండు రాష్ట్రాల్లో (Telugu States) ఎన్నో ప్రశ్నలు లెవనెత్తింది. ఈ కేస్ లో చివరికి నార్సింగి (Narsingi) శ్రీచైతన్య కాలేజ్ (Sri Chaitanya College) గుర్తింపు రద్దు చేస్తున్నట్లు ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. చిత్రమేమిటంటే అసలు నార్సింగి శ్రీ చైతన్యకు గుర్తింపే లేదు. లేని గుర్తింపును ఎలా రద్దు చేస్తారో మరి? ఇంత కంటే జోక్ ఉంటుందా?

20 ఏళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 1000 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ ఈ ఆత్మహత్య లకు కారకులైన చైతన్య (Chaitanya), నారాయణతో (Narayana) పాటు మిగిలిన కార్పొరేట్ విద్య సంస్థలు మాత్రం వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూనే ఉన్నాయి. పిల్లల శవాలపై ఏరుకున్న డబ్బు లోంచి కొంత పొలిటికల్ ఫండింగ్ చేస్తాయి. అన్ని పార్టీలు కార్పొరేట్ విద్యాసంస్థల నుంచి డబ్బు సంచులు అందుకుంటాయి. అందుకే వాళ్లకు వ్యతిరేకంగా ఏమీ చేయలేవు.

సాత్విక్ ఆత్మహత్య కేసులో ఒక ప్రిన్సిపాల్ని, వార్డెన్ ని, మరో క్లర్క్ ని అరెస్ట్ చేసి మమ అనిపించారు. గుర్తింపు లేని బ్రాంచ్ కి గుర్తింపు రద్దు చేశారు. కానీ మూలాల్లోకి వెళ్లి సమస్యని పరిష్కరించాలనే చిత్తశుద్ధి మాత్రం లేదు. ఇన్ని చావులకి కారణమైన చైతన్య డైరెక్టర్స్, చైర్మన్ పై కేస్ ఎందుకు పెట్టరు? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు? చైతన్య సంస్థల గుర్తింపు మొత్తం ఎందుకు రద్దు చేయరు. కనీసం ఒక మూడేళ్లయినా ఎందుకు నిషేధం పెట్టరు.?

ఇవేమీ చేయరు. నిజానికి ఇలాంటి సంఘటనలు జరిగితే అందరికి మరింత దండుకోడానికి అవకాశం దొరుకుతుంది. మీరు రాసి పెట్టుకోండి. కార్పొరేట్ కాలేజీలో మరి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇకపై ఒక్క సూసైడ్ జరగదని సర్కారు కానీ… కార్పొరేట్ కాలేజ్ యాజమాన్యాలు కానీ హామీ ఇవ్వగలవా? చచ్చినా ఇవ్వలేరు. ఎందుకంటే ఎవరికి రావాల్సిన మూటలు వాళ్ళకి అందుతాయి. పిల్లల ఆత్మహత్యల నివారణకి తీసుకోవాల్సిన చర్యలపై మీటింగ్ పెడితే విద్యాశాఖ మంత్రే రాలేదు. అవసరం లేదని అనుకుని ఉంటారు.

ఉద్యమాల్లో చనిపోయిన వాళ్ల పేర్లు చెప్పుకుని ఓట్లు దండుకునే లీడర్లు… కార్పొరేట్ ర్యాంకుల దాహానికి బలైపోయిన వాళ్ళ గురించి మాత్రం ఆలోచించరు. చేతికి అంది వస్తాడనుకున్న కొడుకు ఉరి తాడుకు వెళ్లాడుతుంటే … చూసి గుండెలు పగిలేలా ఏడ్చిన ఆ తల్లి కడుపు శోకం ఎవరికి అర్థం కాదు. ర్యాంకులు.. ఐఐటీ సీట్లు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగాల యావలో డబ్బు కట్టల మధ్య పుస్తకాలు పెట్టి బతికేస్తున్న వాళ్లకు ఆ వెయ్యి మంది ఆత్మహత్యల వెనుక కన్నీటి గాథ ఎప్పటికి గుర్తుకు రాదు.