Jaipur: ఆత్మహత్యకు అనుమతివ్వాలని గవర్నర్‌కు వినతి పత్రం..!

దేశం అంటే భక్తి. ఆ భక్తిని రక్షణ రంగంలో చూపించేందుకు చాలా మంది ఆసక్తికనబరుస్తారు. వారే సరిహద్దులో ఉండే భారత జవాన్లు. వారి ఎంపిక ఎంతటి కఠినతరంగా ఉంటాయో అప్పుడప్పుడూ నియామకాల సమయంలో చూస్తూ ఉంటాం. అలాంటి వారికే అన్యాయం జరిగితే ఎలా ఉంటుంది. మీరే ఒక్కసారి ఆలోచించండి. 2019 పూల్వామా దాడిలో చాలా మంది జవాన్లు దేశానికి తమ ప్రాణాలను అర్పించారు. అలా అమరులైన వారి కుటుంబసభ్యులకు ఇంతవరకూ నష్టపరిహారం చెల్లించలేదు. వారి పరిస్థితేంటో తెలుసుకుందాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 5, 2023 | 06:18 PMLast Updated on: Mar 05, 2023 | 6:18 PM

Wifes Of Jawans Who Died In Pulwama Attack Have Asked For Permission To Commit Suicide

గతంలో జరిగిన ఈ పుల్వామా ఘటన దేశ చరిత్రలోనే చీకటి అధ్యాయం. అలా ప్రాణత్యాగాలు చేసిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ కోరుకుంటారు. ఇంతటితో చేతులు దులుపుకుంటారు. కానీ వారి వెనుక ఉండే కుటుంబపరిస్థితుల గురించి ఏ ఒక్క పాలకుడు, అధికారి ఆలోచించడు. పైగా తమకు సాయం చేయండి అని అభ్యర్థించినప్పటికీ తోసిపుచ్చుతారు. అలాంటి ఘటనే రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ సాక్షిగా చోటు చేసుకుంది. సజీవంగా ఉన్నప్పుడు భారత సైనికులకు ఇచ్చిన మర్యాద.. వారు కాలగర్భంలో కలిసిపోయాక ఉండదా.? వారికి కుటుంబాలకు కనీస సౌకర్యాల కల్పనలో దృష్టి పెట్టరా.? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులే ఒక్క అనుమతి లేఖ. గత 5 సంవత్సరాల క్రితం విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల భార్యలు ఆత్మహత్యలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గవర్నర్ కల్రామ్ మిశ్రాను కలిశారు. దీనికంటే దారుణం వేరొకటి ఉంటుందా.

ఇలా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం తమని ప్రభుత్వాలు, పాలకులు పట్టించుకోవడంలేదు. తమ భర్తలు అమరులైన తరువాత వారి కుటుంబసభ్యులకు రావల్సిన నష్టపరిహారాలను, హామీలను నెరవేర్చడంలో తీవ్ర జాప్యం చేస్తుండటం ప్రదాన సమస్యగా చెప్పుకొచ్చారు. తమ జీవనం గడవడం చాలా కష్టంగా మారిందని వాపోయారు. తమ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామన్న ప్రభుత్వాలు ఇప్పుడు అస్సలు పట్టించుకోవడం లేదని అన్నారు. అలాగే తమ భర్తల పేరుతో రావల్సిన స్మారకాలు కూడా ఇప్పటి వరకూ అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా గవర్నర్ కి ఆత్మహత్య అనుమతి పత్రం ఇచ్చి వస్తున్న సమయంలో ము‎ఖ్యమంత్రి నివాసానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అలా వెళ్లే క్రమంలో వారిని నిలువరించిన పోలీసులు ఒకరిని పక్కకు తోసివేశారు. ఇలా నెట్టే క్రమంలో మంజూ అనే వీరసైనికుడి భార్యకు గాయమైందని మరొక వీరజవాన్ భార్య తెలిపారు.

ప్రాణాలతో ఉంటే ఒక రకం, ప్రాణాలు కోల్పోయాక మరో రకంగా ఉంది ప్రభుత్వాల తీరు. రక్షణ రంగానికి ఎనలేని సేవలు చేస్తున్నామని చెప్పుకునే ప్రధాని దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి. అలాగే రక్షణ శాఖ మంత్రి దీనిపై వివరణ ఇవ్వాలి. అమరులై దాదాపు 5 సంవత్సరాలు అవుతున్నా ఇంకా వీరికి రావల్సిన లబ్థి చేకూర్చలేదంటే దీనిని ఏమంటారో చెప్పాలి. గతంలో అగ్నిపథ్ పేరుతో ఆదిలోనే వీరికి మొండి చెయ్యి చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉండడంలో మరింత విఫలం అయ్యారు అని చెప్పక తప్పదు.

 

 

T.V.SRIKAR