Prakasam: స్నేహం కాదు.. ద్రోహం..! స్నేహితురాలిని నమ్మించి, హత్య చేసిన మృగాడు!
తనను నమ్మిన స్నేహితురాలిని అతి కిరాతకంగా హత్య చేశాడో వ్యక్తి. చేసిన సాయాన్ని, జరిగిన మేలును మరిచి స్నేహితురాలి ప్రాణం తీసేశాడు. తన స్నేహితుడు బాగు పడతాడని నమ్మి, అప్పుగా ఇచ్చిన డబ్బే ఆమె పాలిట మృత్యపాశమైంది.
Prakasam: అమానుషం.. కిరాతకం.. నమ్మక ద్రోహం.. రాక్షసత్వం.. ఇలాంటి మాటలేవీ సరిపోవు ఈ దారుణ ఘటనకు. స్నేహానికీ, మానవత్వానికీ మాయని మచ్చలాంటి ఘటన ఇది. తనను నమ్మిన స్నేహితురాలిని అతి కిరాతకంగా హత్య చేశాడో వ్యక్తి. చేసిన సాయాన్ని, జరిగిన మేలును మరిచి స్నేహితురాలి ప్రాణం తీసేశాడు. తన స్నేహితుడు బాగు పడతాడని నమ్మి, అప్పుగా ఇచ్చిన డబ్బే ఆమె పాలిట మృత్యపాశమైంది. ఇదంతా ఏపీలోని ప్రకాశం జిల్లాలో జరిగిన రాధ హత్య గురించే. వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు గ్రామ సమీపంలో జరిగిన హత్యోదంతం గురించి తెలిస్తే ఏ మనిషైనా ఇంత ద్రోహానికి పాల్పడతాడా అనిపించకమానదు.
జిల్లెళ్లపాడు సమీపంలో బుధవారం అర్ధరాత్రి రాధ అనే మహిళ మృతదేహం కనిపించింది. ప్రమాదవశాత్తు మరణించిందేమో అనుకున్నా ఇది హత్యే అని తేల్చారు పోలీసులు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వివరాలు ఆరాతీయగా సంచలన విషయాలు వెల్లడయ్యాయి. హత్య ఎలా జరిగింది? ఎవరు.. ఎందుకు చేశారు.. వంటి వివరాలు ఆరాతీయగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. పోలీసులే కాదు.. ప్రతి ఒక్కరినీ ఈ దారుణ ఘటన కలచివేస్తోంది.
జిల్లెళ్లపాడు గ్రామానికి చెందిన రాధకు, తెలంగాణలోని కోదాడకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మోహన్ రెడ్డితో వివాహమైంది. ఈ దంపతులు ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. రాధకు తన పక్క గ్రామానికి చెందిన కాశిరెడ్డి అలియాస్ చిన కాశయ్యతో చిన్నప్పట్నుంచి మంచి స్నేహం ఉంది. కాశిరెడ్డి కూడా హైదరాబాద్‌లోనే ఉద్యోగం చేసేవాడు. రాధకు ఎప్పట్నుంచో స్నేహితుడు కాబట్టి.. రాధ-మోహన్ రెడ్డి దంపతులతో కూడా సన్నిహితంగా ఉండేవాడు. వాళ్లకు కాశిరెడ్డి ఫ్యామిలీ ఫ్రెండులా మెలిగేవాడు. ఈ క్రమంలో కాశిరెడ్డి జాబ్ పోయింది. దీంతో తనకు ఒక మంచి బిజినెస్ ఐడియా ఉందని, పెట్టుబడికి సాయం కావాలని రాధ, మోహన్ రెడ్డి దంపతులకు చెప్పాడు. వాళ్లు కాశిరెడ్డిని నమ్మి, స్నేహానికి విలువిచ్చి రూ.80 లక్షలు అప్పుగా ఇచ్చారు.
అనంతరం కొంతకాలానికి తమ డబ్బు తిరిగి ఇవ్వాల్సిందిగా కాశిరెడ్డిని రాధ-మోహన్ దంపతులు అడగడం ప్రారంభించారు. ఎన్నిసార్లు అడిగినా మాట దాటవేస్తూ, తప్పించుకుంటూ ఉండేవాడు. బంధువులతో అడిగించినా సరైన ఉపయోగం లేకుండా పోయింది. ఇదే సమయంలో ఈ నెల 11న రాధ తన చిన్న కుమారుడితో కలిసి స్వగ్రామమైన జిల్లెళ్లపాడు వెళ్లింది. అక్కడికి వెళ్లి కాశిరెడ్డిని డబ్బు గురించి అడిగింది రాధ. దీంతో తను చెప్పినట్లు కనిగిరి వస్తే తన అనుచరులు కొంత డబ్బు తిరిగిస్తారని నమ్మించాడు. దీంతో వారు చెప్పినట్లే ఈ నెల 17న కనిగిరి వెళ్లింది. అక్కడ సాయంత్రం 06.47 గంటల సమయంలో ఒక కారులో రాధను ఎక్కించుకెళ్లారు. ఆ తర్వాత ఆమెను దూరంగా తీసుకెళ్లి దారుణంగా హత్య చేశారు.
హింసించి చంపారు..
రాధను కారులో ఎక్కించుకెళ్లిన కాశిరెడ్డి అనుచరులు ఆమెను అత్యంత దారుణంగా హత్య చేసినట్లు తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమెను కారుతో ఢీకొట్టించారు. తర్వాత ఆమెపై నుంచి కారును ఎక్కించారు. దీంతో ఆమె పక్కటెముకలు విరిగిపోయాయి. సిగరెట్లతో కాల్చిన గుర్తులు కూడా ఆమె ఒంటిపై ఉన్నాయి. మరోవైపు ఆమెకు మత్తు మందు ఇచ్చి ఉండొచ్చని, ఆ తర్వాత సామూహిక హత్యాచారానికి పాల్పడి ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలోని పరిస్థితులు చూస్తే ఈ అనుమానాలు బలపడుతున్నట్లు అర్థమవుతోందని పోలీసులు తెలిపారు. రాధ బతికుండగానే రోడ్డుపై ఈడ్చకుంటూ వెళ్లి ఉండొచ్చని, కాలు మెలితిప్పి విరిచేసి ఉంటారని, బతికుండగానే తీవ్రంగా హింసించారని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఆమె మరణించిందని నిర్ధరించుకున్న తర్వాత మృతదేహాన్ని రోడ్డుపై పడేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు.
రాధను ఎందుకు టార్గెట్ చేశాడు?
అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగివ్వమని దంపతులిద్దరూ అడిగినా కాశిరెడ్డి.. రాధనే ఎందుకు హత్య చేశాడు అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజానికి ఈ డబ్బు ఇప్పించింది రాధ. డబ్బు తనకు తిరిగి ఇవ్వమని ఎక్కువగా అడిగింది కూడా ఆమే. అందుకే రాధను హత్య చేస్తే ఈ సమస్య తీరిపోతుందని కాశిరెడ్డి భావించినట్లున్నాడు. రోజూ డబ్బులడుతున్న ఆమెపై తీవ్రంగా కక్ష పెంచుకున్న అతడు రాధను కిరాతకంగా హత్య చేశాడు. ఈ హత్య జరిగిన తీరు చూస్తుంటే, కాశిరెడ్డి ఆమెపై పగ పెంచుకున్నట్లు అర్థమవుతోంది. కాగా, నిందితుడు కాశిరెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ హత్యలో ఎవరెవరు పాల్గొన్నారు అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. ఈ హత్యకు ఉపయోగించిన కారు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిదిగా పోలీసులు గుర్తించారు. కేసు విచారణ సాగుతోంది.