Women safety: మహిళా చట్టాలపై అవగాహన పెంచుకోండి – ఒక్క ఫోన్ కొట్టి ఆకతాయిల పనిపట్టండి..!

మహిళా మేలుకో.. మీకోసం ఎన్ని అవకాశాలు ఉన్నాయో తెలుసుకో. స్వీయఅఘాయిత్యాలు మానుకో. ఇవన్నీ మేము చెబుతున్న కల్పిత మాటలు కాదు. చట్టం స్త్రీకి చెబుతున్న ధైర్యపు బాటలు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 28, 2023 | 03:13 PMLast Updated on: Feb 28, 2023 | 3:13 PM

Women Safety Laws

సాధారణంగా అమ్మాయికి ఏదైనా ఆపద వస్తే.. నా అనే వారు ఎవ్వరూ ముందుకు రారు. అది కన్న వాళ్లైనా.. కట్టుకున్న వాడైనా. నూటికో కోటికో ఒక్కరుంటారు. వీరిని ఆదరించేందుకు సంకల్పించిన మహానుభావులు. ఇప్పుడు చెప్పే అంశం మహిళా మణులందరికీ వర్తిస్తుంది. కేవలం అవగాహనా రాహిత్యం వల్లే ఇప్పటి వరకూ జనిగిన ఘాతుకాలు చాలు. ఇకపై ఇలాంటివి జరగొద్దు. అందుకే ఈ అవగాహనా సారాంశం.

ఆడవారిని లైంగికంగా వేధించినా.. అల్లరి పట్టించినా.. బెదిరిపులకు పాల్పడినా.. స్త్రీ మాన ప్రాణాలకు భంగం కలిగించినా.. వ్యక్తిగత గౌరవానికి విఘాతం సృష్టించినా ఊరుకునే ప్రసక్తే లేదంటూంది ఇండియన్ పీనల్ కోడ్. అందులోని సెక్షన్లు అతి భయంకరంగా ఉన్నాయి. వాటి గురించి తెలియక అమాయపు అమ్మాయిలు ప్రాణాలు కోల్పోతున్నారు. మీకు ఏదైనా సమస్య తలెత్తిన వెంటనే తక్షణ సాయం అందించేందుకు పోలీస్ స్టేషన్లలో ఉమెన్ డెస్కులు ఉన్నాయి. అలాగే ప్రతి జిల్లా కేంద్రాల్లో షీ టీమ్స్ పేరుతో మీకోసం అనుక్షణం గస్తీ కాస్తూ ఉంటాయి. మీరు చేయవలసిందల్లా ఫిర్యాదు చేయడమే. ఫిర్యాదు చేయడం వల్ల మీ పేరు బయటకు వచ్చే ప్రమాదం ఉందని భావించకండి. పూర్తి గోప్యతతో మీ సమస్యను నివారించేలా పరిస్థితులు మారిపోయాయని గుర్తించండి.

మీరు ప్రత్యక్షంగా పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లలేమనుకుంటే సామాజిక మాధ్యమాల ద్వారా అయినా స్పందించ వచ్చు. 9441669988 అనే స్టేట్ షీ టీమ్ వాట్సప్ నంబర్ కు మీ ఇబ్బందులను తెలుపవచ్చు. లేకపోతే 100, 102 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి కూడా మీ సమస్యలను వివరించవచ్చు. ఇంకా రైల్వేస్టేషన్, బస్ స్టేషన్స్ తో పాటూ కొన్ని బహిరంగ ప్రదేశాల్లో షీ టీమ్ క్యూఆర్ కోడ్ లనే ఏర్పాటు చేశారు. వీటిని స్కాన్ చేసి కూడా కంప్లైంట్ ఇవ్వవచ్చు. అలాగే womensafetyts@gmail.com కు నేరుగా మెయిల్ చేసి కూడా స్పందించవచ్చు. వీటన్నింటికీ మించి ఏవేవో పిచ్చి యాప్స్ ఇన్ స్టాల్ చేసుకునే బదులు హక్ ఐ అనే మహిళా రక్షణ యూప్ ను డౌన్లోడ్ చేసుకొని కూడా మీ పరిస్థితులను తెలియజేయవచ్చు.

WOMEN SAFETY

WOMEN SAFETY

ఇండియన్ పీనల్ కోడ్ లో ఉన్న చట్టాలు ఇవే:
306 IPC – ఆత్మహత్య చేసుకోవడానికి ఎవరైనా ప్రేరేపించినట్లయితే అలాంటి వారికి 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

326(ఏ) IPC – యాసిడ్, మారణాయుధాలు, ప్రాణానికి హాని కలిగించే వస్తువులు ఏవైనా ఉపయోగించి దాడిచే చేసిన వారికి యావజ్జీవ శిక్ష లేదా 10సంవత్సరాల జైలు శిక్షతో పాటూ జరిమానా విధిస్తారు.
326(బీ) IPC – దాడికి ప్రయత్నించినా కూడా ఈ శిక్ష అమలు అవుతుంది.

354 IPC – ఉద్దేశ్యపూర్వకంగా, లేదా ఏదైనా కారణాల వల్ల సమాజంలో ఆమె గౌరవానికి భంగం కలిగించినట్లయితే కనిష్టంగా 1సంవత్సరం, గరిష్టంగా 5 సంవత్సరాల జైలుశిక్ష అనుభవించాల్సి వస్తుంది.

354(ఏ‎) IPC – స్త్రీ శరీరాన్ని తన ప్రమేయం లేకుండా భౌతికంగా తాకడం వల్ల ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు.
354(బీ) IPC – లైంగిక వాంఛ తీర్చమని బలవంత పెట్టడం. స్త్రీని పదే పదే వేధించడం వల్ల ఈ సెక్షన్ అమలు అవుతుంది.
354(సీ) IPC – మహిళకు నీలి చిత్రాలు, అసభ్యకరమైన చిత్రాలను చూపించడం వల్ల కూడా ఈ సెక్షన్ క్రింద శిక్ష పడే అవకాశం ఉంటుంది.
354(డీ) IPC – మహిళను అసభ్య పదజాలంతో దూషించడం, లైంగికపరమైన వ్యాఖ్యలతో వేధించడం వల్ల ఈ సెక్షన్ క్రింద చర్యలు తీసుకుంటారు. వీటన్నింటికీ మూడు సంవత్సరాలు జైలు శిక్షతోపాటూ జరిమానా విధించడం జరుగుతుంది.

376 IPC – మహిళను ఆమె అనుమతి లేకుండా మానభంగం చేయడం, శీతల పానీయాల్లో మత్తు మందు కలిపి ఈ చర్యలకు పాల్పడటం ద్వారా కనిష్టంగా 7 సంవత్సరాలు, గరిష‌్టంగా యావజ్జీవ కారాగార శిక్షతో పాటూ పాల్పడిన విధానం బట్టి జరిమానా కూడా విధిస్తారు.

504 IPC – ఉద్దేశపూర్వకంగా అవమానించి రెచ్చగొడితే వారికి కనీసం 2సంవత్సరాల జైలు శిక్షతో పాటూ వారి రెచ్చగొట్టే వ్యాఖ్యల తీవ్రతను బట్టి జరిమానా కూడా విధిస్తారు.

506 IPC – చంపేస్తా, కిడ్నాప్ చేస్తా అనే విధంగా బెదిరింపులకు పాల్పడితే 2సంవత్సరాల జైలు శిక్ష, చట్టాన్ని చేతిలో తీసుకుంటే.. మహిళ క్యారెక్టర్ పై దుష్ప్రచారం చేస్తానని భయాందోళనలకు పాల్పడి వారి మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తే అలాంటి వారిపై కఠినమైన కారాగార శిక్ష విధిస్తారు. కనీసం 7 సంవత్సరాలకు పైగా జైలు శిక్షతోపాటూ జరిమానా విధించే ప్రమాదం ఉంది.

509 IPC – ఆడవాళ్లని ఆటపట్టించడం, వెంటపడి వేధించడం, అసభ్యకరమైన పదజాలం ఉపయోగించడం, మహిళ ఏకాంతాన్ని భంగపరచడం, దుస్తులు మార్చుకుంటున్నా, స్నానం చేస్తున్న దృశ్యాలు చూడటం వంటివి చేస్తే 3 సంవత్సరాల జైలు శిక్షతోపాటూ నేర తీవ్రతను బట్టీ జరిమానా కూడా విధించే ప్రమాదం ఉంది.

ఇవన్నీ 18 సంవత్సరాలు పైబడిన మహిళలకు వర్తించే చట్టాలు. అలాగే మైనర్ బాలికలకు ఎదురయ్యే వేధింపులకు కొన్ని ప్రత్యేకమైన చట్టాలను పొందుపరిచారు. ఇలాంటి వాటికి ఫోక్సో చట్టం ప్రకారం కఠినమైన శిక్షలు అమలయ్యేలా చట్టాన్ని రూపొందించారు.

2012లో తీసుకొచ్చిన ఫోక్సో చట్టం (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) ప్రకారం మైనర్ యువతులను, చిన్న పిల్లలపై లైంగిక చర్యలకు పాల్పడితే ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకుంటుంది.

ర్యాగింగ్ నిషేధ చట్టం – 1997 ప్రకారం కాలేజీల్లో, పాఠశాలల్లో ఎక్కడైనా అమ్మాయిలకు ఆకతాయి చేష్టలతో మానసికంగా, ఎమోషనల్ గా, ఫిజికల్ గా, ముంపు కలిగించే భావన తీసుకొస్తే వారికి ఐపీసీ లో పేర్కొన్న విధంగా చర్యలు తీసుకుంటారు.

పోష్ యాక్ట్ – 2013 – మహిళ పనిచేసే ప్రదేశాల్లో ఆమెను లైంగిక వేధింపులకు గురిచేస్తే అలాంటి వాటిని నిరోధించేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ యాక్ట్ ప్రకారం కఠినచర్యలు ఉంటాయి.

ఇన్ని చట్టాలు కేవలం మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకొనే చేసినవి. కాబట్టీ పిరికి చర్యలకు పాల్పడకుండా ధైర్యంగా నిలబడి పోరాడండి. న్యాయం తప్పకుండా జరుగుతుంది. ఇప్పటి నుంచైనా స్త్రీలు ఇలాంటి చట్టాల పై అవగాహన కల్పించుకుంటారని ఆశిద్దాం.

 

 

 

T.V.SRIKAR