Yevgeny Prigozhin: ప్రిగోజిన్ మరణం వెనక పుతిన్..! ఎవరితను..? కుట్ర చేయాల్సిన పనేంటి..?
ప్రైవేటు ఆర్మీ వాగ్నర్ గ్రూపు అధినేత ప్రిగోజిన్ మరణంపై రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రమాదం వెనక పుతిన్ హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పుతిన్ కనుసన్నల్లో పనిచేసే రష్యా సైన్యం.. ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న ఫ్లైట్‌ను కూల్చివేసిందనే వార్త ప్రచారంలోకి వచ్చింది.

Yevgeny Prigozhin: రష్యా అధ్యక్షుడు పుతిన్ మీద తిరుగుబాటు చేసి.. ఆ తర్వాత వెనక్కి తగ్గిన ప్రైవేటు ఆర్మీ వాగ్నర్ గ్రూపు అధినేత ప్రిగోజిన్ మరణంపై రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రిగోజిన్ ప్రయాణించిన ఎంబ్రేర్ లిగసీ 600 ఎగ్జిక్యూటివ్ జెట్ కుప్పకూపింది. ఐతే ఈ ప్రమాదానికి 30 సెకన్ల ముందు వరకూ ఈ విమానంలో ఎలాంటి సాంకేతిక సమస్య తలెత్తలేదని ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ప్రిగోజిన్‌తో పాటు మొత్తం 10మంది చనిపోయినట్లు తెలుస్తోంది.
ఇందులో ఏడుగురు ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ప్రిగోజిన్‌తో పాటు.. వాగ్నర్ గ్రూప్ సెకండ్ ఇన్ కమాండ్ దిమిత్రి ఉత్కిన్ కూడా చనిపోయాడు. ఈ ప్రైవేటు జెట్ విమానం మాస్కో నుంచి సెయింట్ పీటర్స్‌బర్గ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఇప్పటివరకు 8 డెడ్‌బాడీలను గుర్తించారు. ఈ ప్రమాదం వెనక పుతిన్ హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పుతిన్ కనుసన్నల్లో పనిచేసే రష్యా సైన్యం.. ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న ఫ్లైట్‌ను కూల్చివేసిందనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఐతే ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న విమానం కూలడానికి ముందు రెండు పెద్ద పేలుడు శబ్దాలు వినిపించాయి. రష్యా సైన్యమే ఈ విమానాన్ని కూల్చేసిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఐతే ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న విమానానికి ప్రమాదం జరిగిన సమయంలో.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కుర్స్క్ ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రిగోజిన్ తిరుగుబాటు జెండా ఎగురవేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అతన్ని క్షమించకూడదని పుతిన్ భావించాడు.
ఈ తిరుగుబాటు కొద్దిరోజులే అయినా.. అది పుతిన్ అహం మీద దెబ్బకొట్టడంతోపాటు, భవిష్యత్తులో ప్రమాదం అని భావించిన రష్యా అధ్యక్షుడు ప్రిగోజిన్ బతకకూడదని భావించాడని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు. అతని మరణం ఊహించిందే అంటున్నారు. వాళ్ల మాటలకు అనుగుణంగానే.. తిరుగుబాటు చేసి సరిగ్గా రెండు నెలల్లో ప్రిగోజిన్ మరణవార్త వినాల్సి వచ్చింది. రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ఉన్న సమయంలో ఆయన ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 14మంది రకరకాల కారణాలతో అనుమానాస్పదంగా చనిపోయారు. ఇప్పుడు ప్రిగోజిన్ మరణం కూడా అలానే ఉండడంతో.. దీని వెనక పుతిన్ హస్తం ఉందనే చర్చ మొదలైంది.