YS Viveka case: మరోసారి సీబీఐ ముందుకు అవినాష్ రెడ్డి.. ఈసారి అరెస్ట్ తప్పదా ?
మొన్నటి వరకూ ఎంపీ అవినాష్ రెడ్డిని సాక్షిగానే పరిగణించిన సీబీఐ.. ఇప్పుడు మాత్రం రిమాండ్ రిపోర్ట్‌లో నిందితుడిగా చేర్చింది. వివేకా హత్య అనంతరం ఆధారాలు మాయం చేయడంలో అవినాష్ రెడ్డి పాత్ర కూడా ఉందని ఆరోపించింది.
YS Viveka case: వైఎస్ వివేకా మర్డర్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకూ ఎంపీ అవినాష్ రెడ్డిని సాక్షిగానే పరిగణించిన సీబీఐ.. ఇప్పుడు మాత్రం రిమాండ్ రిపోర్ట్‌లో నిందితుడిగా చేర్చింది. వివేకా హత్య అనంతరం ఆధారాలు మాయం చేయడంలో అవినాష్ రెడ్డి పాత్ర కూడా ఉందని ఆరోపించింది.
అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని నిన్న విచారించిన సీబీఐ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లిలోని జడ్జి ఇంట్లో భాస్కర్ రెడ్డిని హాజరు పర్చారు. జడ్జి భాస్కర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన వెంటనే అవినాష్ రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేశారు సీబీఐ అధికారులు. ఈసారి సాక్షిగా కాకుండా కేసులో నిందితుడిగా అవినాష్ రెడ్డిని విచారించబోతున్నారు. సీబీఐ ఆదేశాలతో ఇవాళ తెల్లవారుజామునే అవినాష్ రెడ్డి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో ఇప్పటికే అవినాష్ రెడ్డిని నాలుగు సార్లు సీబీఐ అధికారులు విచారించారు. నిజానికి మూడోసారి విచారణ ముగియగానే అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తుందని అంతా అనుకున్నారు.
కానీ అప్పుడు అరెస్ట్ చేయలేదు. ఆ తరువాత గూగుల్ టేకౌట్ దొరికినప్పటికీ విచారించి వదిలేశారు. ఇప్పుడు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్‌లో మాత్రం అవినాష్ రెడ్డిని నిందితుల లిస్ట్‌లో చేర్చారు. శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి, ఉదయ్ రెడ్డితో పాటు అవినాష్ రెడ్డి కూడా హత్యలో ఇన్వాల్వ్ అయ్యారనేది సీబీఐ అభియోగం. భాస్కర్ రెడ్డితో కలిసి హత్య అనంతరం సాక్షాలు మాయం చేసేందుకు ప్రయత్నించారనే కోణంలో నిన్న అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఇదే విషయంలో ఆయనను విచారించబోతున్నారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి సీబీఐ విచారణనను ఎలా ఎదుర్కోబోతున్నారనేది ఉత్కంఠగా మారింది. ఈ విచారణ తరువాత అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసే చాన్స్ ఉంది.