కేదార్ మరణంతో అయోమయంలో టాలీవుడ్ వందల కోట్లు ఎక్కడ పెట్టాడు.?

ఏళ్ల తరబడి కష్టపడ్డారు....రూపాయి రూపాయి పోగేసుకున్నారు...నమ్మకస్తుడి దగ్గర పెట్టుబడి పెట్టారు. కోటి రెండు కోట్లు కాదు...వందల కోట్లు ఇన్వెస్ట్ చేశారు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 28, 2025 | 12:50 PMLast Updated on: Feb 28, 2025 | 12:50 PM

కేదార్ మరణంతో అయోమయంలో ట

ఏళ్ల తరబడి కష్టపడ్డారు….రూపాయి రూపాయి పోగేసుకున్నారు…నమ్మకస్తుడి దగ్గర పెట్టుబడి పెట్టారు. కోటి రెండు కోట్లు కాదు…వందల కోట్లు ఇన్వెస్ట్ చేశారు. కొంతకాలంగా బాగానే సాగింది. ఇంతలోనే పిడుగులాంటి వార్త. ఎవర్ని నమ్మి పెట్టుబడి పెట్టారో…అతడి లేకపోతే. పెట్టుబడులు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారో తెలియకపోతే…ఆ టాలీవుడ్ ప్రముఖుల సంగతేంటి ? నిర్మాత కేదార్ మరణంతో…టాలీవుడ్ కు చెందిన హీరోలు, నిర్మాతలు, దర్శకులు లబోదిబోమంటున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక…లోలోపలే అంతులేని ఆవేదనలో మునిగిపోయారు.

ఒక మరణం…వందల మంది టెన్షన్ లో పడేసింది. ఒక మరణం…వందల కోట్ల రూపాయల అడ్రస్ గల్లంతు చేసింది….ఒక మరణం దశాబ్దాలు పాటు సంపాదించుకున్న సొమ్మును…బూడిదలో పోసిన పన్నీరయ్యేలా చేసింది. ఒకే ఒక్క మరణం…టాలీవుడ్ చెందిన ప్రముఖ హీరోలు, నిర్మాతలు, దర్శకులను కాళ రాత్రిని మిగిల్చేలా చేసింది. దుబాయ్ లో నిర్మాత కేదార్ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. టాలీవుడ్ కు చెందిన పలువురు హీరోలు, దర్శకులు, నిర్మాతలకు…కేదార్ బీనామీగా వ్యవహరిస్తున్నారు. వారికి చెందిన వందల కోట్ల రూపాయలతో దుబాయ్ లో వ్యాపారాలు చేస్తున్నారు. ఇప్పుడు కేదార్ మరణించడంతో…తమ డబ్బు సంగతేంటని సన్నిహితుల వద్ద ఆరా తీస్తున్నారు.

హైదరాబాద్ ర్యాడిసన్ హోటల్ లో డ్రగ్స్ కేసులో కేదార్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఈ కేసులో ఆయన నిందితుడిగానూ ఉన్నారు. దీంతో ఆయన వ్యాపార కార్యకలాపాలను దుబాయ్ కు షిప్ట్ చేస్తున్నారు. అక్కడే ఖరీదైన జుమేరా లేక్ టవర్స్ అపార్ట్ మెంట్ లో ఓ ఫ్లాట్ లో నివాసం ఉంటున్నారు. దుబాయ్ లో రియల్ ఎస్టేట్, కన్ స్ట్రక్షన్ వ్యాపారాలు చేస్తున్నారు. అంతేకాకుండా పలు లేక్ వ్యూ ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలుస్తోంది. వందల కోట్లు విలువ చేసే ల్యాండ్ డెవలపింగ్ కంపెనీలో..కేదార్ మెజార్టీ వాటాదారుడిగా ఉన్నాడు. ఒకటి రెండు కాదు..9 కంపెనీల్లో డైరెక్టర్, ఛైర్మన్ వంటి హోదాల్లో ఉన్నాడు. ఈ సంస్థలన్నీ కన్ స్ట్రక్షన్, ఎంటర్ టైన్ మెంట్ రంగాలకు సంబంధించినవే.

కేదార్ అనుమానాస్పద స్థితిలో మరణించడంతో టాలీవుడ్ చెందిన ప్రముఖులు టెన్షన్ లో పడిపోయారు. కేదార్ ను నమ్మి…భారీగా పెట్టుబడులు పెడితే…ఇలా జరిగిందేంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతన్ని నమ్మి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టామని..ఇప్పుడు ఆ డబ్బు ఎవర్ని అడగాలని సన్నిహితులు వద్ద వాపోతున్నారు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖలు ఒకరిద్దరు మాత్రమే పెట్టుబడులు పెట్టలేదు. ప్రముఖ హీరోలతో పాటు నిర్మాతలు, దర్శకులు కూడా కేదార్ పై నమ్మకంతో గుడ్డిగా ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ డబ్బును ఏ యే వ్యాపారాల్లో పెట్టారు. ఎలా రాబట్టుకోవాలి ? డబ్బు కోసం ఇప్పుడేం చేయాలి ? అన్న ఆలోచనలో పడిపోయారు. మరికొందరు ఇప్పుడేం చేయాలని సన్నిహితులను సలహాలు అడుగుతున్నట్లు తెలుస్తోంది.

కేదార్ పై నమ్మకంతో పెట్టుబడులు పెట్టిన వారంతా…తరచు దుబాయ్ కి వెళ్లి వచ్చేవారని తెలుస్తోంది. ఇప్పుడు కేదార్ మరణంతో…తమ డబ్బు ఏ ప్రాజెక్టులో పెట్టాడు ? ఎక్కడెక్కడ ఎంతెంత పెట్టాడు ? అని ఆరా తీస్తున్నారు. పలువురు టాలీవుడ్ ప్రముఖులకు బీనామీగా ఉండటంతో…కొందరు తమ పెట్టుబడి గురించి ఇతరులతో పంచుకోలేక…కక్కలేక మింగలేకపోతున్నట్లు సమాచారం. కేదార్ మరణించక ముందు నుంచి నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే…దుబాయ్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనొక్కరే పలువురు కొన్ని రోజులుగా దుబాయ్ లోనే ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.