సైఫ్ అలీఖాన్ దాడి కేసులో రోజుకో ట్విస్ట్
సైఫ్ అలీఖాన్ దాడి కేసులో రోజుకో ట్విస్ట్.. క్రైం థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఈ హైప్రొఫైల్ కేసు ముంబై పోలీసులకు చెమటలు పట్టిస్తోంది.
సైఫ్ అలీఖాన్ దాడి కేసులో రోజుకో ట్విస్ట్.. క్రైం థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఈ హైప్రొఫైల్ కేసు ముంబై పోలీసులకు చెమటలు పట్టిస్తోంది. అసలు దొరికిన వ్యక్తి నిందితుడేనా? అసలు నిందితుడు వేరే ఉన్నాడా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రస్తుతం ముంబై పోలీసులు చేస్తున్న దర్యాప్తులో ఇలాంటి అనుమానాలే రేకెత్తిస్తున్నాయి. అసలు సైఫ్ అలీఖాన్ దాడి కేసులో ఏం జరుగుతోంది? ఇప్పటి వరకు పోలీసులు తేల్చిందేంటి?
జనవరి 16న అర్థరాత్రి సైఫ్ అలీ ఖాన్‌పై గుర్తు తెలియని దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఆ తరువాత సైఫ్ ఆటోలో ఆస్పత్రికి వెళ్లడం.. లీలావతి ఆస్పత్రిలో చేరడం.. డాక్టర్లు సర్జరీ చేయడం.. నాలుగైదు రోజుల్లోనే సైఫ్ డిశ్చార్జ్ కావడం జరిగిపోయాయి. కానీ దాడి నుంచి ఇప్పటి వరకు పోలీసులు చేపట్టిన దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది. ముందుగా ఈ కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు.. ఆ తరువాత అతడు నిందితుడు కాదని వదిలేశారు. ఆ తరువాత షరీఫుల్ ఇస్లాం అనే వ్యక్తి ఈ దాడి చేశాడని గుర్తించిన పోలీసులు.. అతన్ని అరెస్ట్ చేశారు. అతడు బంగ్లాదేశీగా తేల్చారు. అక్రమంగా దేశంలో చొరబడి.. ముంబైకి చేరుకుని సైఫ్ ఇంట్లో దోపిడీకి పాల్పడేందుకు యత్నించాడని.. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో కత్తితో సైఫ్‌పై దాడి చేశాడని పోలీసులు నిర్ధారించారు. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా.. దర్యాప్తులో మరో విస్తుపోయే నిజం వెలుగులోకి వచ్చింది. నిందితుడు షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలు.. దాడి జరిగిన ప్రదేశంలో లభించిన ఫింగర్ ప్రింట్స్ నిందితుడితో సరిపోలడం లేదని తెలుస్తోంది. నిందితుడిని సైఫ్ అలీ ఖాన్ ముందుకు తీసుకురానున్నారు. సైఫ్ అతడ్ని గుర్తించాల్సి ఉంటుంది.
జనవరి 16 తెల్లవారుజామున నిందితుడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించి దాడి చేశాడు. విచారణలో భాగంగా సైఫ్ ఇంటిని పరిశీలించిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బృందం…. అక్కడ ఉన్న దాదాపు 19 ఫింగర్ ప్రింట్స్‌ను సేకరించింది. వాటిల్లో ఏవీ నిందితుడి ఫింగర్ ప్రింట్స్‌తో మ్యాచ్ కావడం లేదని పోలీసులకు ఫోరెన్సిక్ బృందం వెల్లడించినట్లు సమాచారం. తదుపరి పరీక్షల కోసం మరోసారి ఘటనా స్థలం నుంచి మరిన్ని వేలిముద్రల నమూనాల్ని సేకరించాలని భావిస్తున్నారు పోలీసులు. మరోవైపు కేసు దర్యాప్తు కోసం ముంబై పోలీసులు సైఫ్ రక్త నమూనాలను, దాడి జరిగిన రోజు ఆయన ధరించిన దుస్తులను సేకరించారు. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఈ కేసులో నిందితుడైన షరీఫుల్ ఇస్లాం దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే ఆ ఇంట్లోకి ప్రవేశించాడని.. అయితే.. పరిస్థితి తీవ్ర ఘర్షణకు దారితీసిందని ప్రాథమిక విచారణలో తేలింది. అందుకే దాడి సమయంలో సైఫ్ ధరించిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి దుస్తులపై రక్తపు మరకలు కనిపించడంతో అవి సైఫ్ అలీఖాన్‌వేనా.. కాదా అని నిర్ధారించడం కోసం శాంపిల్స్ సేకరించారు.
ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కాకపోవడంతో అసలు కథ మొదటి వచ్చిందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు నేరస్థుడిని వదిలేసి, ముంబై పోలీసులు మరొకరిని పట్టుకున్నారా? అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సైఫ్‌పై దాడి కేసులో జనవరి 19న మహారాష్ట్రలోని థానేలో మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. షెహజాద్ కంటే ముందు ముంబై పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఈ కేసుతో అతనికి ఎలాంటి సంబంధం లేదని పోలీసుల విచారణలో తేలింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మరో అనుమానితుడు ఆకాశ్ కనోజియాను కూడా ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తుండగా ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో రాయ్‌పూర్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు పట్టుకుని ముంబై పోలీసులకు అప్పగించారు. చివరకు అతడు కూడా కాదని తేల్చారు. అసలు దాడి చేసింది ఎవరూ అనేది పూర్తిగా తేల్చలేకపోతున్నారు ముంబై పోలీసులు.
ప్రస్తుతం నిందితుడు షరీఫుల్లా రిమాండ్‌లో ఉన్నాడు. షరీఫుల్లా బంగ్లాదేశీ అని, ఇండియాలో అక్రమంగా నివాసముంటున్నాడని.. దేశంలో అక్రమంగా ప్రవేశించిన తర్వాత విజయ్ దాస్ అనే పేరును నిందితుడు వాడుకుంటున్నాడని పోలీసులు చెబుతున్నారు. షరీఫుల్లా దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ప్రవేశించాడని పోలీసులు చెబుతున్నా.. సైఫ్ అలీ ఖాన్ నివాసంలోని సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన వ్యక్తికి, అరెస్టయిన నిందితుడికి మధ్య వ్యత్యాసాలు ఉన్నాయంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
తన కుమారుడ్ని అన్యాయంగా ఇరికించారని.. వీడియోలో ఉన్నది తన కుమారుడు కాదని వాపోతున్నాడు షరీఫుల్లా తండ్రి. తన కుమారుడు షరీఫుల్ కు జుట్టును పొట్టిగా కత్తిరించుకోవడం అలవాటని, కానీ వీడియోలో ఉన్న వ్యక్తికి పొడుగు జుట్టు ఉందని తెలిపాడు. మరి తన కుమారుడికి ఉన్నట్టుండి పొడుగు జుట్టు ఎలా వచ్చిందని షరీఫుల్లా తండ్రి మహ్మద్ అమీన్ ఫకీర్ ప్రశ్నించాడు. పైగా ఎంతో కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉండే సైఫ్ అలీ ఖాన్ వంటి హీరోపై దాడి చేయడం సామాన్యులకు సాధ్యమయ్యే పనేనా అని సందేహం వ్యక్తం చేశాడు. అసలు, సైఫ్ ఇంట్లోకి వెళ్లడం సులభమైన పనా? అని వ్యాఖ్యానించాడు. ఈ కేసు విషయమై భారత్‌లో తమకు సాయం చేసేందుకు ఎవరూ లేరని విచారం వ్యక్తం చేశాడు. అందుకే బంగ్లాదేశ్ లో న్యాయపోరాటం చేస్తామని చెప్పాడు నిందితుడు తండ్రి. తన కుమారుడు గతేడాది మార్చిలో భారత్ కు అక్రమంగా వలసవచ్చిన మాట నిజమేనని ఒప్పుకున్న అతడు.. ముంబైలోని ఓ హోటల్‌లో పని చేస్తున్నాడని వెల్లడించాడు.
మరోవైపు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో అనుమానితుడిగా పేర్కొంటూ అదుపులోకి తీసుకున్న తర్వాత.. తన జీవితం దుర్భరంగా మారిందని వాపోయాడు ఆటో డ్రైవర్ ఆకాశ్ కనోజియా. ఉద్యోగం కోల్పోవడం, పెళ్లి సంబంధం చెడిపోవడంతో పాటు తన కుటుంబం ఎన్నో అవమానాలు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కాబోయే భార్యను కలిసేందుకు వెళ్తున్న క్రమంలో దుర్గ్‌లో తనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తనపై చేయి కూడా చేసుకున్నారని వాపోయాడు. పోలీసులు వదిలిపెట్టిన తర్వాత ఉద్యోగం కూడా పోయిందని, తనతో వివాహం వద్దని అమ్మాయి తరఫు కుటుంబీకులు తేల్చి చెప్పినట్లు వివరించాడు. అసలు నిందితుడు తేల్చడం ఇప్పుడు ముంబై పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసి.. వారు కాదని వదిలేసినా.. అరెస్టైన మూడో వ్యక్తి షరీఫుల్లానే అసలు నిందితుడు అని ఇన్ని రోజులు ముంబై పోలీసులు చెబుతున్నా.. తాజాగా ఫింగర్ ప్రింట్స్‌తో సరిపోలకపోవడంతో కథ మొదటికి వచ్చినట్లైంది. మరోసారి నిందితుడి వేలిముద్రలు సేకరించాక.. అవి కూడా సరిపోలకపోతే.. ముంబై పోలీసుల నెక్ట్స్ స్టెప్ ఏంటి? అన్నది చర్చనీయాంశంగా మారింది.