The Kerala Story: చూస్తుంటే వీళ్లే సినిమా తీయించినట్లుంది! ఈ రేంజ్‌ ప్రమోషన్లు అవసరమా సార్లు..!

 ఇటివల విడుదలైన 'ది కేరళ స్టోరీ' సినిమాకు ఆ చిత్ర యూనిట్ కంటే బీజేపీ నాయకులే ఎక్కువగా ప్రమోషన్లు ఇస్తున్నట్లు అనిపిస్తోందా? బీజేపీ పెద్దలకు ఈ సినిమా అంత బాగా నచ్చిందా? మోదీ, అమిత్ షా, నడ్డా ఇంతకీ సినిమా చూశారా?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 8, 2023 | 06:00 PMLast Updated on: May 08, 2023 | 6:00 PM

After Narendra Modi Jp Nadda Now Amit Shah Praises The Kerala Story Movie Seems Like Bjp Is Endorsing The Movie With Free Publicity

సినిమావాళ్లు రాజకీయాలు గురించి మాట్లాడడం వింతేమీ కాదులే కానీ.. ఇటివల కాస్త ట్రేండ్‌ మారినట్లుగా ఉంది. రాజకీయ పెద్దలే సినిమాల గురించి తెగ మాట్లాడేస్తున్నారు.! కాదు..కాదు సినిమాలకు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు. గతేడాది రిలిజైన ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రానికి దేశంలోని బీజేపీ సీఎంలు, మంత్రులు ఎండోర్స్ చేశారు. దేశవ్యాప్తంగా ఈ సినిమాకు ఆరు బీజేపీ పాలత రాష్ట్రాల్లో పన్ను మినహాయింపును కూడా ఇచ్చారు. కశ్మీరీ పండిట్ల బ్యాక్‌గ్రౌండ్‌లో తీసిన సినిమా ఇది. ఉగ్రవాదుల హెచ్చరికలు, దాడులకు భయపడి, ప్రాణాలు అరచేత పెట్టుకొని 1990 జనవరి 19న వేలమంది పండిట్లు కశ్మీర్‌ లోయలో నుంచి వెళ్లిపోయారు. ఈ విషయాలను చూపిస్తూ డైరెక్టర్ వివేక్ అగ్ని ఈ సినిమాను తెరక్కించారు. అప్పట్లోనే అనేక వివాదాలకు కేంద్రబిందువుగా మారిన సినిమా అది. ఇటు ఈ నెల 5న రిలీజైన ‘ది కేరళ స్టోరీ’ సినిమా విడుదలకు ముందే ప్రకంపనలు సృష్టించింది. ఇక ఈ చిత్రానికి కేంద్ర ప్రభుత్వ పెద్దలు నేరుగా ఎండోర్స్ చేస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మతాల టార్గెట్‌గా సినిమాలు:
భిన్న జాతుల దేశం మనది.. అందరూ కలిసికట్టుగా ఉంటేనా అభివృద్ధి..! మత అల్లర్ల, కుల కొట్లాటలు జరిగితే బ్రిటిష్‌ పాలన రోజుల గతి పట్టాల్సిందే. ఈ మధ్య కాలంలో సామాజిక కోణం పేరిట..తమ రాజకీయ లబ్ధి కోసం కొందరు పార్టీ నేతలే సినిమాలకు రూపకల్పన చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదో ఒక వర్గాన్ని టార్గెట్‌ చేసుకొని సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. ఇందులో నిజానిజాలు సంగతి పక్కన పెడితే..దేశంలో ప్రస్తుతమున్న అసలు సమస్యలను సైడ్ ట్రాక్‌ చేసి.. దేశమంతా సినిమా గురించే మాట్లాడుకునేలా ఓ హైప్‌ క్రియేట్ అవుతోంది. తాజాగా రిలీజైన ‘ది కేరళ స్టోరీ’ సినిమా విడుదలకు ముందే చేయాల్సిన రచ్చ చేసేసింది. 32వేల మంది కేరళ మహిళాలు అక్కడ నుంచి అదృశ్యమయ్యారని ట్రైలర్‌లో చూపించడంతో వివాదం మొదలైంది. ఫ్రూఫ్ చూపించమంటూ దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెల‌రేగ‌డంతో ముగ్గురు మహిళలు మాత్రమే అదృశ్యమ‌య్యారంటూ నంబర్‌ని ఎడిట్ చేశారు మూవీ మేకర్స్‌. కానీ ఇదేం ఎడిటింగో ఏమో.. ఒకటి, రెండు నంబర్లు తక్కువా..ఎక్కువా కాదు.. ఫీగర్‌లోని నాలుగు డిజిట్లను తీసిపడేశారు.

బీజేపీ అగ్రనేతల ప్రచారం:
మెజారిటి వర్గాల ఓట్లతో అధికారం దక్కించుకోవాలనే పార్టీల్లో అందరికంటే ముందుండే బీజేపీ.. ‘ది కేరళ స్టోరీ’ సినిమాను కర్ణాటక ఎన్నికల ప్రచారంలో వాడుకుంది. సాక్ష్యాత్తు ప్రధాని మోదీనే ఈ సినిమా పేరును ఎన్నికల ర్యాలీలో లేవనెత్తారు. ఉగ్రవాద కుట్ర కోణాన్ని తెలిపే ‘ది కేరళ స్టోరీ’ సినిమాను కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని మోదీ బళ్లారి బహిరంగసభలో ఆరోపించారు. కాంగ్రెస్‌ ముస్లిం పక్షపాతి అనే చెప్పే ప్రయత్నం ఇది. దీని ద్వారా మెజర్టీ వర్గం ఓట్లు దండుకోవచ్చు..

ఇక మోదీ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నిడ్డా సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మోదీ సినిమా చూడకుండా మాట్లాడుతున్నారంటూ కొంతమంది గుసగుసలాడుకుంటుండగా.. నడ్డా ఒక అడుగు ముందుకేసి సినిమా చూసి మాట్లాడారు. విషం చిమ్మె ఉగ్రవాదాన్ని ఈ చిత్రం క్లియర్‌ కట్‌గా చూపించిందంటూ పొగిడారు. ఇక ఆ తర్వాత హోం మంత్రి అమిత్‌షా సైతం రంగంలోకి దిగారు. ఈ సినిమా కథాంశాన్ని దేశంలోని కీలకమైన సామాజిక సమస్యగా ఆయన అభివర్ణించారు.

అవును నిజమే కావొచ్చు.. ఈ లవ్‌ జీహాద్‌లు, మత మార్పిడిలు ఉన్నామాట వాస్తవామే కావొచ్చు. గణాంకాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తుండవచ్చు.. అయితే ఇక్కడ సమస్య నిజానిజాలది కాదు. ఎంతో సున్నితమైన కథాంశంలో తెరకెక్కిన ఈ సినిమా గురించి రిలీజ్‌కి ముందే నానా రచ్చ జరిగింది. కాస్త అటు ఇటు అయితే మత విద్వేషాల మంటలు అంటుకోవడం అంత కష్టంకాదు. అలాంటి పరిస్థితి రాకుండా ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన కేంద్రంలోని పెద్దలు..ఓ వర్గాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో సినిమాకు ఎండోర్స్ చేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.