అకీరా నందన్ బర్త్ డే స్పెషల్.. జూనియర్ పవర్ స్టార్ అరంగేట్రం అప్పుడేనా..!
సినిమాల్లోకి రాకముందే అకీరా నందన్ సోషల్ మీడియాతో ఫుట్ బాల్ ఆడుకుంటున్నాడు. మనోడు కనిపిస్తే చాలు ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ అని తేడా లేకుండా అన్నీ తగలబడి పోతున్నాయి.

సినిమాల్లోకి రాకముందే అకీరా నందన్ సోషల్ మీడియాతో ఫుట్ బాల్ ఆడుకుంటున్నాడు. మనోడు కనిపిస్తే చాలు ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ అని తేడా లేకుండా అన్నీ తగలబడి పోతున్నాయి. ఇండస్ట్రీకి రాకుండానే పరిస్థితి ఇలా ఉంటే వచ్చాక ఎలా ఉంటుందో అని ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు మెగా అభిమానులు. ఏప్రిల్ 8న ఈయన పుట్టినరోజు. 20 ఏళ్లు పూర్తిచేసుకుని 21 లోకి అడుగు పెడుతున్నాడు అకీరా నందన్. దాంతో త్వరలోనే సినిమాల్లోకి వస్తాడనే ఆశతో ఎదురు చూస్తున్నారు పవన్ అభిమానులు. మరోవైపు రాజకీయంగా పవన్ చాలా బిజీ. పైగా ఆయనిప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం కూడా..! అందుకే ఇదివరకట్లా సినిమాలు చేయడం కుదరట్లేదు.. కుదరదు కూడా.. చేయాలని ఆశించడం కూడా అత్యాశే అవుతుంది. అందుకే తన స్థానంలో తనయుడిని ఫ్యాన్స్‌కి చేరువ చేస్తున్నారేమో అనిపిస్తుంది. కొన్ని రోజులుగా అకీరా పబ్లిక్‌లో ఎక్కువగా కనిపించడానికి కారణం కూడా ఇదే అని అర్థమవుతుంది.
అల వైకుంఠపురంలో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది.. మీ నాన్న నిన్ను పెళ్ళికొడుకుని దాచినట్టు దాచాడురా అని..! అకీరాను కూడా ఒకప్పుడు ఇలాగే దాచారు. కానీ ఇప్పుడు టైం వచ్చింది. అందుకే అడక్కుండానే అందరి ముందుకు వస్తున్నాడు అకీరా నందన్. సాధారణంగా తండ్రి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నపుడు.. ఆ లెగసీ వారసుడికి ఇస్తుంటారు. పవన్ కూడా ఇదే చేస్తున్నారిప్పుడు. రాజకీయంగా తను బిజీ అవుతానని తెలిసే.. అకీరాను ఆడియన్స్‌కు చేరువ చేస్తున్నట్లు కనిపిస్తుంది. గతేడాది ఎన్నికల్లో విజయం సాధించాక.. వారసుడిని ఇటు ఏపీ సీఎం చంద్రబాబు.. అటు ప్రధాని మోదీ దగ్గరికి తీసుకెళ్ళి నేషనల్ వైడ్‌గా అకీరాను ఫేమస్ అయ్యేలా చేసారు పవన్. అలా సినిమా చేయకుండానే ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు అకీరా. రేపటి రోజు మొదటి సినిమా విడుదలైతే సీఎం టు పీఎం వరకు అందరూ అకిరా సినిమాను ప్రమోట్ చేస్తారేమో..!
అకీరా నందన్‌కు ఇప్పుడు 21 ఏళ్ళు. నిన్న మొన్నటి వరకు చిన్న పిల్లాడిలా కనిపించినా.. ఇప్పుడు మాత్రం హీరో మెటీరియల్‌లా మేకోవర్ అయ్యారు. ఒప్పుకున్న ఓజి, హరిహర వీరమల్లు, ఉస్తాద్ పూర్తి చేసాక.. పవన్ పూర్తిగా పాలిటిక్స్‌పై ఫోకస్ చేయడం ఖాయం. ఆ తర్వాత పవన్ స్థానాన్ని జూనియర్ పవర్ స్టార్ భర్తీ చేయాలని చూస్తున్నారు. ఆ మధ్య రాజమండ్రిలో జరిగిన గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు కూడా అన్నయ్య రామ్ చరణ్‌తో కలిసొచ్చారు అకీరా. ఇప్పుడు పవన్ చేస్తున్న సనాతన ధర్మ దీక్షలోనూ నాన్నతోనే ఉన్నాడు. ఇవన్నీ చూస్తుంటే త్వరలోనే అకీరాను వెండితెరపై చూడటం ఖాయమే అనిపిస్తుంది. మరోవైపు వారసుడిని పరిచయం చేసే బాధ్యత తీసుకోవాలని పెద్ద పెద్ద నిర్మాతలు పవన్ చుట్టూ తిరుగుతున్నారు. మరో రెండేళ్లలో వారసవి పరిచయం చేయాలని చూస్తున్నాడు పవన్ కళ్యాణ్. చూద్దామిక.. జూనియర్ పవర్ స్టార్ అరంగేట్రం ఎప్పుడో..?