AP Tourism: విహారం మరింత ఆహ్లాదం..!

విహారం అనగానే ప్రతి ఒక్కరిలో ఒక వింత అనుభూతి చోటు చేసుకుంటుంది. అక్కడి ప్రదేశం ఎలా ఉంటుందో.. సౌకర్యాలు ఉంటాయో లేదో.. ఉండేందుకు వసతులు ఏమేరకు దొరుకుతాయో.. ఆప్రాంతంలో ఫుడ్ ఏమి దొరుకుతుందో.. అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో.. అని అక్కడకి వెళ్లి చూసేకంటే ముందే ఇన్ని ప్రశ్నలతో చిన్నపాటి ప్రశ్నాపత్రాన్ని మన మైండ్లో సేవ్ చేసుకుంటాం. వాటికి సమాధానాలు దొరికే వరకూ అన్వేషిస్తూనే ఉంటాం. అలా కాకుండా సెలబ్రిటీ స్థాయి సౌకర్యాలతో విహారయాత్ర పూర్తి చేసుకుంటే.. అబ్బ ఆ అనుభూతి ఊహకు అందడం లేదు. వర్ణించేందుకు పోలికలు తూగడంలేదు కదూ. అందుకే ఇలాంటి వింతైన భావనను మనకు కలిగించాలనే ఉద్దేశ్యంతో ఏపీ ప్రభుత్వం లోని టూరిజం శాఖ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 27, 2023 | 12:08 PMLast Updated on: Apr 27, 2023 | 12:09 PM

Ap Tourism Corporation Caravan Tourism

కార్వాన్ లో పర్యటన..

సాధారణంగా సినిమావాళ్లు షూటింగ్ స్పాట్లో.. లొకేషన్లలో సేదతీరేందుకు ఒక ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసుకుంటారు. దానినే కార్వాన్ అంటారు. ఇందులో తమకు కావల్సిన విధంగా వివిధ రకాల అత్యంత అధునాతనమైన సౌకర్యాలతో.. హంగు ఆర్భాటాలతో ఇంటీరియర్ డిజైన్ ను తయారు చేసుకుంటారు. దీని నిర్వహణకు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని కేటాయిస్తారు. అలాంటివి మనం అప్పుడప్పుడు సినిమా షూటింగ్ లలోని మేకింగ్ వీడియోల్లో లేదా హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఉంటే ఏదో ఒక సమయంలో రోడ్లమీద వెళ్తూ ఉంటాయి. దీని ఆకారం పరిమాణం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. అలాంటి వాటిలో మనం ఒక్కరోజైనా గడపాలని అనుకుంటాం. అలాంటివారి కోసం ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు విన్నూత్నమైన టూరిజం ప్యారేజీని తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అరకు కేంద్రంగా ప్రయోగం..

ఏపీ టూరిజం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది అరకు. ఇది ఎంత ప్రసిద్ద పర్యాటకమో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. అక్కడి టన్నల్స్, పచ్చని చెట్లు, లోయలు, చల్లని వాతావరణం ఊహించుకుంటేనే వింతానుభూతి కలుగుతుంది కదూ. అలాంటి ప్రదేశాల్లో ప్రత్యేకమైన కార్వాన్ లో పర్యటించి అక్కడి ప్రకృతి అందాలను వీక్షిస్తే.. ఆహా.! ఈజన్మకు ఇది చాలు అనక తప్పదు. అందుకే ట్రెండింగ్ టూరిజం వైపుకు ఏపీ సర్కార్ చకచకా పావులు కదుపుతుంది.

Tent Caravan Tourism

Tent Caravan Tourism

దేశవిదేశాల్లో అమలు.. ఏపీలో ఆచరణ..

ఈ రకమైన టూరిజం విదేశాల్లో ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. మన దేశంలో ఊటీ, డార్జిలింగ్ వంటి సుందర ప్రదేశాల్లో గత కొన్ని సంవత్సరాల నుంచి ఆచరణలోకి తీసుకొచ్చారు. ఆ ప్రయోగాన్ని మన రాష్ట్రంలోకూడా ప్రవేశపెట్టేందుకు టూరిజం శాఖ అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. ఈ ప్రయోగాన్ని ముందుగా అరకు, లంబసింగి, పాడేరు, చింతపల్లి తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు పర్యాటకశాఖ ఉన్నతాధికారలు నివేదికలు కూడా సిద్దం చేశారు. పూర్తిస్థాయి అటవీ ప్రాంతంగా ఉండే చోట టెంట్లు కూడా ఏర్పాటుచేసి అద్భుతమైన అనుభూతిని పర్యాటకులకు అందించేందుకు పనుల్లో వేగం పెంచారు.

caravan Interior

Caravan Interior

కార్వాన్ ప్రత్యేకతలు..

ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్న కార్వాన్లలో చాలా రాయల్ లగ్జరీ సౌకర్యలను ఉండేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. మినీ లగ్జరీ హోం లాగా ఇంద్రభవనం లాంటి నిర్మాణాన్ని కార్వాన్లో ఉండేలా చూస్తున్నారు. ఈ మినీ కార్వాన్ తీసుకున్న వారికి అందులో వంటగది, ఇండక్షన్ స్టౌ, కెటిల్, టోస్టర్, మైక్రో ఒవెన్, ఎగ్జాస్ట్ ఫ్యాన్, మినీ బెడ్ రూం, కింగ్ సైజ్ బెడ్, డైనింగ్ హాల్, ఫ్రిజ్, బయో టాయిలెట్స్, షవర్, హ్యాండ్ వాష్ షింక్ తోపాటూ చిన్నసైజ్ సోఫా, టీవీ, బ్లూటూత్ మ్యూజిక్ సిస్టంని ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా బస్సు లోపల మొత్తం పూర్తి స్థాయి ఏసీ ఉండేలా చూస్తున్నారు. లోపలి నుంచే ప్రకృతిని ఆస్వాదించేందుకు విండోస్ కూడా ఏర్పాటుచేస్తారు. పర్యాటకానికి వచ్చే సంఖ్యను బట్టి కర్వాన్ ఏది సూట్ అవుతుందో దానికి తగ్గట్టుగా ప్యాకేజి ఉంటుంది.

 

T.V.SRIKAR