Movie Functions: సినిమా ఫంక్షన్లు అంటే… చిడతల భజన… బిస్కెట్‌లు వేయడమేనా?

తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటేనే భజన గ్యాంగుల కూటమిగా మారిపోయింది. భజన చేయడానికి డైరెక్టర్లు, నిర్మాతలు, చిన్నాచితకా యాక్టర్లు ఉండొచ్చేమో.. వినడానికి హీరోలకు సమ్మగా అనిపించచ్చేమో... కానీ...!!

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 8, 2023 | 06:01 PMLast Updated on: Aug 08, 2023 | 6:01 PM

Are Movie Functions Meant For Bhajans When Will Our Heroes Learn Lessons

ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లు… సినిమా ప్రెస్ మీట్ లు.. చూస్తుంటే ఒక రకంగా రోత పుడుతుంది. అసహ్యం కూడా వేస్తోంది. సినిమా ఇండస్ట్రీలో భజన శృతి మించిపోతోంది. ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ అంటే చాలు.. కేవలం హీరోల్ని పొగడ్డానికి మాత్రమే అన్నట్లుగా సాగుతున్నాయి. ముందుగా తయారు చేసుకున్న ప్రోగ్రాం ప్లాన్ ప్రకారం చిన్న చితకా యాక్టర్లు, కమెడియన్లు, ప్రోగ్రాం నిర్వహించే సుమ, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ మొత్తం హీరోని పొగుడుతూనే ఉంటారు. నాలుగు గంటల పాటు జరిగే ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో భజనే భజన. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటోడైతే కొత్త కొత్త పద ప్రయోగాలు, సామాన్యులకు కూడా అందని ఉపమానాలతో హీరోని ఎక్కడికో ఎత్తేస్తుంటాడు. ఒక ఫంక్షన్ లో అయితే చిరంజీవిని ఏకంగా వినాయకుడితో పోల్చాడు. పూజ చేసినప్పుడు మొదట వినాయక పూజ ఎలా చేస్తామో ఏ సినిమా ఫంక్షన్ చేసినా ఎప్పుడైనా ముందుగా చిరంజీవి గురించి మాట్లాడుకోవాల్సిందేనని త్రివిక్రమ్ చిరుని ఆకాశానికి ఎత్తేసాడు. ఆ సినిమా ఏ రేంజ్ సినిమా అయినా సరే హీరోని మాత్రం పొగడాల్సిందే. నిన్న గాక మొన్న జరిగిన.. బోలా శంకర్ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో ఆకాశానికి ఎత్తేయడానికి ఒకరికొకరు పోటీపడ్డారు. బాబోయ్.. మామూలు పులిహోర కాదు. సినిమా వాళ్లంటేనే అసహ్యం కలిగేటంత పులిహోర. సినిమా ఇండస్ట్రీలో ఒకరినొకరు పొగుడుకోవడం ప్రశంసించుకోవడం కొత్తేమీ కాదు. కానీ ఈమధ్య అది మరీ ఎక్కువైపోయింది. అట్టర్ ప్లాప్ సినిమాకు కూడా నాలుగు గంటల ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టి.. సినిమాలో విషయం కన్నా హీరో భజన చేయడమే ప్రధానంగా నడుస్తోంది. మొన్నటికి మొన్న బ్రో ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో చూడాలి. అంత సీనియర్ నటుడు బ్రహ్మానందం కూడా పవన్ కళ్యాణ్ ని దైవాంశ సంభూతుడు అని ఆకాశానికి ఎత్తేశాడు.

ఇక బండ్ల గణేష్ లాంటి పకోడీ ప్రొడ్యూసర్లు స్టేజ్ ఎక్కి చేసే చిడతల భజన మామూలుగా ఉండదు. ఈశ్వరా.. పరమేశ్వరా.. పవనేశ్వరా… లాంటి అరుపులతో జనానికి రోత పుట్టిస్తుంటారు. మరి ఆ అరుపులు మన హీరోలకి అంత సమ్మగా ఎలా ఉంటాయో అర్థం కాదు. బోలా శంకర్ ఫంక్షన్ లో కూడా జబర్దస్త్ ఆది దగ్గర నుంచి.. చిన్నా చితక నటులంతా చిరంజీవికి మామూలుగా బిస్కెట్లు వేయలేదు. అవి బిస్కెట్లని తెలిసి కూడా చిరంజీవి అమాయకంగా నవ్వేస్తూ ఎంజాయ్ చేసేస్తుంటారు. ఇక ఫ్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో బాలయ్య బాబు చుట్టూ జరిగే భజన అల్టిమేట్ అనుకోవాలి. ఆ పొగడ్తలు ఆ చిడతలు వింటూ బాలయ్య పులకరించి పోతూ ఉంటాడు. ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ అంటే సినిమాలో టెక్నికల్ వాల్యూస్ గురించి చెప్పండి… సస్పెన్స్ ఎలా ఉంటుందో చెప్పండి.. మేకింగ్ గురించి చెప్పండి.. హీరోల గొప్పదనం గురించి భజన ఏంటిరా నాయనా?

హీరోని పొగిడితే సినిమాలు హిట్ అవుతాయా? బ్రో ప్రీవియస్ ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ ని అందరూ ఆకాశానికి ఎత్తేశారు. తీరా తెరమీదకి వచ్చాక డమాల్ అంది. రియాల్టీకి దూరంగా బతికే హీరోలు ఈ పొగడ్తల్లో మునిగిపోతూ ఏ చిన్న ఒత్తిడి వచ్చినా తట్టుకోలేక.. చుట్టూ ఉన్న వాళ్ళపై రగిలిపోతుంటారు. బాలకృష్ణను చూస్తున్నాంగా దగ్గరకు వస్తే ఎలా చావు కొడతాడో.? తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటేనే భజన గ్యాంగుల కూటమిగా మారిపోయింది. భజన చేయడానికి డైరెక్టర్లు, నిర్మాతలు, చిన్నాచితకా యాక్టర్లు ఉండొచ్చేమో.. వినడానికి హీరోలకు సమ్మగా అనిపించచ్చేమో… కానీ జనానికి మాత్రం పరమ రోతగా ఉంటుంది. హీరోలూ.. దయచేసి దీని గమనించండి.