రివ్యూస్ నిజమా అబద్ధమా..? నిజంగా సినిమాలను చంపేస్తున్నాయా..?
సినిమా రివ్యూల మీద ఎప్పటికప్పుడు నెవర్ ఎండింగ్ డిబేట్ నడుస్తూనే ఉంటుంది. ప్రేక్షకులేమో ఓ సినిమా విడుదలైన తర్వాత అదెలా ఉందో తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు.

సినిమా రివ్యూల మీద ఎప్పటికప్పుడు నెవర్ ఎండింగ్ డిబేట్ నడుస్తూనే ఉంటుంది. ప్రేక్షకులేమో ఓ సినిమా విడుదలైన తర్వాత అదెలా ఉందో తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు. దాన్నే కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో సినిమాలకు జెన్యూన్ రివ్యూస్ రావడం అనేది అరుదుగా జరుగుతుంది. నిజంగా సినిమాలకు యునానిమస్ టాక్ వచ్చినపుడు మాత్రమే అంతా కలిసి ఒకే రివ్యూ ఇస్తున్నారు. చాలా వరకు ఫేక్ రివ్యూలే రాజ్యమేలుతున్నాయిప్పుడు. ముఖ్యంగా రివ్యూస్ సిస్టమ్ అనేది పూర్తిగా పెయిడ్ బ్యాచ్ కిందకి వెళ్లిపోయిందిప్పుడు. రివ్యూవర్లకు డబ్బులిచ్చి ఎవరికి నచ్చినట్లు వాళ్లు రాయించుకుంటున్నారిప్పుడు. అంతేకాదు.. ఇక్కడ మరో విచిత్రం కూడా ఉంది. తమకు వ్యతిరేకంగా ఉన్న హీరో సినిమా రిలీజైతే.. అది బాగున్నా కూడా ఒక్కోసారి డబ్బులిచ్చి ఫేక్ ప్రచారం చేయిస్తుంటారు. ఇది ఇండస్ట్రీలో కామన్ అయిపోయిందిప్పుడు. అక్కడ సినిమా కూడా షో కూడా పడకముందే మైకులు పెట్టేసి ఫ్లాప్, డిజాస్టర్ అంటూ ఊదరగొట్టే బ్యాచ్ మన దగ్గర చాలానే ఉంది.
అలాగే ఓ సినిమా బాగోలేనపుడు.. దాన్ని బాగుందని రుద్దడానికి కూడా చాలా ప్రయత్నాలు జరుగుతుంటాయి. వాటికి కూడా ఆయుధం రివ్యూలే. పెయిడ్ రివ్యూస్ ఇప్పించి సినిమాను జనానికి అంటగట్టాలని చూస్తుంటారు. ఓ పెద్ద సినిమా విడుదలైనపుడు అదెలా ఉందో అడగడం చాలా కామన్. సినిమా చూడడానికి అడుగుతున్నారా.. లేదంటే నార్మల్‌గా ఎలా ఉందో జనరల్ నాలెడ్జ్ కోసం అడుగుతున్నారా అనేది పక్కన పెడితే.. ఒక సినిమా రివ్యూ గురించి కామన్ ఆడియన్ బాగానే వెయిట్ చేస్తుంటాడు. దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఎంతో మంది ట్రై చేస్తూ ఉంటారు. ఇది రెగ్యులర్ గా జరిగే సైకిల్. దాని కోసం ప్రత్యేకంగా ఆలోచించాల్సిన పనిలేదు. ఎందుకంటే రివ్యూస్‌కు జనం కూడా బాగానే అలవాటు పడిపోయారు. అందులో కొన్ని ఫేక్ అని వాళ్లకు కూడా తెలుసు.. కానీ ఏం అనరు.. చెప్పాం కదా అలవాటు పడిపోయారు అని..! అయితే ఇండస్ట్రీ వాళ్ళు మాత్రం చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఓ సినిమా రివ్యూ, దానికి ఇచ్చే రేటింగ్ చూసి తమ సినిమా ఫ్యూచర్ డిసైడ్ అవుతుందని వాళ్ళు భ్రమలో ఉంటున్నారు.
నిజానికి ఒక సినిమా ఫలితాన్ని డిసైడ్ చేసే స్థాయి సినిమా రివ్యూలకు ఉంటుందా అంటే.. కచ్చితంగా ఉండదని చెప్పాలి. ఎందుకంటే ఒక 100 మంది ప్రేక్షకులను తీసుకుంటే అందులో రివ్యూ చూసి సినిమాలకు వెళ్లే వాళ్ళు ఒక 30 మంది కూడా ఉండరు.. అంటే మిగిలిన 70 మంది సినిమా ఎలా ఉందో నేరుగా వెళ్లి ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆలోచిస్తుంటారు. అయితే ఆ 30 మంది సినిమా ఫ్యూచర్ డిసైడ్ చేస్తారని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. అందుకే రివ్యూల గురించి ఇంతగా డిస్కషన్ పెడుతున్నారనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలకు కనీసం 2-2.5 రేటింగ్ వచ్చిన సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్ అయ్యాయి. అలాగే నిర్మాతలు కోరుకుంటున్న 4-4.5 రేటింగ్ వచ్చిన సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. వాటికి పైసలు కాదు పేరు వచ్చిందంతే. మరి ఇదేంటి అంటే దానికి వాళ్ల దగ్గర ఆన్సర్ లేదు. ఒక సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందని చెప్పడం రివ్యూవర్ వల్ల కాదు కదా.. ఆ సినిమా తీసిన దర్శకుడు వల్ల కూడా కాదు.
అలాంటప్పుడు సినిమా చూసి రివ్యూ రాసే వాళ్ల మీద దర్శక నిర్మాతలు ఎందుకు అంత కోపం చూపిస్తున్నారు అనేది అర్థం కాని విషయం. కాకపోతే రేటింగ్స్ అనేది బిజినెస్ ఇప్పుడు. జర్నలిస్టులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, బోట్స్.. ఇలా ఎవరికి వాళ్లు ఈ రేటింగ్ మాఫియాలోకి ఎంటర్ అయిపోయారు. ప్రత్యర్థి నిర్మాణ సంస్థలు, ఫ్యాన్ గ్రూపులు నెగెటివ్ రేటింగ్స్ ఇచ్చి సినిమాను చంపేస్తున్నారు. ఈ మొత్తం సినారియోలో బకరాలు అయ్యేది ఆడియన్స్.. నష్టపోయేది నిర్మాతలు. కొన్ని సినిమాలనైతే మార్నింగ్ షో కూడా దాటనివ్వకుండానే రివ్యూల పేరుతో చంపేస్తున్నారు కొందరు. ఒకప్పుడు తెలుగులో రివ్యూ సిస్టమ్ చాలా బాగుండేది.. విడుదలైన మూడు రోజుల తర్వాత రేటింగ్స్ ఇచ్చేవాళ్లు రివ్యూవర్లు. కానీ ఇప్పుడులా కాదు.. పోటీ ప్రపంచం కాబట్టి సినిమా చూస్తూనే రివ్యూలు ఇస్తున్నారు. అందులో ఓ జెన్యూనిటి అనేది కనిపించట్లేదు. ఏదో ఇస్తున్నారంటే ఇస్తున్నారంతే. దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే ఫేక్ రివ్యూలకు ఫుల్ స్టాప్ పడాలి. కానీ అది జరుగుతుందా అంటే అనుమానమే.