Balagam Movie Review: బలగం మూవీ రివ్యూ

కమర్షియల్‌ సినిమాలు మాత్రమే మంచి ఆధరణ పొందుతున్న ఈ రోజుల్లో.. భావోద్వేగాలే బేస్‌గా నడిచే ఇలాంటి ఓ కథను నమ్మి సినిమా ప్రొడ్యూస్‌ చేయడం నిజంగా గొప్ప విషయం. అది కూడా దిల్‌ రాజు కుటుంబం నుంచి ఇలాంటి సినిమా రావాడం ఆహ్వానించదగ్గ విషయం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 3, 2023 | 01:26 PMLast Updated on: Mar 03, 2023 | 1:30 PM

Balagam Movie Review

జబర్ధస్త్‌ ఫేమ్‌ వేణు డైరెక్షన్‌లో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌ రామ్‌ లీడ్‌ లోర్స్‌లో తెరకెక్కిన సినిమా బలగం. తెలంగాణలో ఓ మూరుమూల పల్లెటూరులోని ఓ నిరుద్యోగి జీవిత కథే ఈ సినిమా. అప్పులు కట్టేందుకు వ్యాపారం పెట్టిన సాయిలు అనే యువకుడికి ఆ వ్యాపారం మరింత నష్టాన్ని తెచ్చిపెడుతుంది. పెళ్లి చేసుకుని వచ్చే కట్నంతో అప్పులు కట్టేదామనుకుంటే.. అనుకోకుండా వాళ్ల తాత చనిపోతాడు. చావు ఇంటికి వచ్చిన చుట్టాల్లో మాటామాటా పెరగడంతో కుదిరిన పెళ్లి కూడా చెడిపోతుంది. దానికి తోడు తాతకు పెట్టిన పిండం ముట్టేందుకు ఒక్క కాకి కూడా రాదు. దీంతో ఇంట్లో గొడ‌వ‌లు మ‌రింత‌గా ముదిరిపోతాయి. తాత మ‌న‌సులో బాధ ఉండ‌టంతోనే కాకులు రావ‌డం లేద‌ని, ఇది ఊరికే అరిష్టం అని పంచాయ‌తీలో పెద్దలు తేలుస్తారు. అయితే పెద్ద క‌ర్మ అయిన ప‌ద‌కొండో రోజున ఏం జ‌రిగింది? ఆ రోజైనా కాకులొచ్చి పిండాన్ని తిన్నాయా? కుటుంబ స‌భ్యుల మ‌ధ్య గొడ‌వ‌లు స‌ద్దుమ‌ణిగాయా? సాయిలు క‌ష్టాలు తీరాయా ? అనేది మిగ‌తా క‌థ‌.

ముఖ్యంగా ఈ కథ మొత్తం ఇంటి పెద్ద చావు చుట్టే తిరుగుతుంది. ప్రతీ కుటుంబంలో వ్యక్తుల మధ్య ఉండే భావోద్వేగాలే ఈ సినిమా కథా వస్తువు. కుటుంబంలో ఉండే ఐకమత్యాన్ని, సమస్యల్ని, ఆచారాల్ని చాలా సహజంగా చూపించాడు డైరెక్టర్‌ వేణు. గ్రామీణ ప్రాంతాల్లో చావు చుట్టూ జరిగే తతంగాన్ని చూపిస్తూనే.. కుటుంబంలో జరిగే సంఘర్షణను కళ్లకు కట్టినట్టు ఆవిష్కరించాడు. ఈ సినిమా చూస్తున్నంతసేపు సినిమా చూసినట్టు లేదు. మన గ్రామాల్లో, మన చుట్టూ జరిగే ఓ సన్నివేశాన్ని చూసినట్టే ఉంది. ఈ విషయంలో డైరెక్టర్‌ విజయాన్ని సాధించాడనే చెప్పవచ్చు. సినిమాలో పాత్రల్లో స్వచ్ఛత, అమాయకత్వం, యాస, భాష తెలంగాణ గ్రామీణ ప్రాంతాలను కళ్లకు కట్టినట్టు చూపించింది. చిన్న చిన్న విషయాలు కూడా కుటుంబాన్ని ఏళ్ల వరకు ఎలాంటి సంఘర్షణలకు గురి చేస్తాయో చెప్పడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. సినిమాలోని పాత్రల మధ్య సంయమణం సరిగ్గా కుదిరింది. స్క్రీన్‌ మీద ఎమోషన్స్‌ పండించడంతో ప్రతీ ఒక్కరూ సక్సెస్‌ అయ్యారు. ఇది మొత్తం టీం విజయం. సినిమాలో ప్రతీ సీన్‌కు బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ ప్రాణం పోసింది.

కథ మొత్తం ఒక వ్యక్తి చావు చుట్టే తిరగడం కాస్త సాగదీతలా అనిపించింది. భావోద్వేగాలు, ఏడుపు సీన్లు ఎక్కువగా ఉంటూ.. కాస్త ల్యాగ్‌ అయ్యాయి. ఇది సినిమాకు మైనస్‌. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, మ్యూజిక్‌ సినిమాకు మంచి బలంగా నిలిచాయి. కమర్షియల్‌ సినిమాలు మాత్రమే మంచి ఆధరణ పొందుతున్న ఈ రోజుల్లో.. భావోద్వేగాలే బేస్‌గా నడిచే ఇలాంటి ఓ కథను నమ్మి సినిమా ప్రొడ్యూస్‌ చేయడం నిజంగా గొప్ప విషయం. అది కూడా దిల్‌ రాజు కుటుంబం నుంచి ఇలాంటి సినిమా రావాడం ఆహ్వానించదగ్గ విషయం. సినిమా ప్రమోషన్స్‌లో దిల్‌ రాజ్‌ కీలక పాత్ర పోషించారు. ప్రతీ ప్రాంతానికి మూవీ టీమ్‌తో కలసి వెళ్లి తన సహకారాన్ని అందించారు. ప్రొడ్యూసర్స్‌ పెట్టుకున్న నమ్మకాన్ని డైరెక్టర్‌ వేణుతో సహా.. ప్రతీ ఒక్క యాక్టర్‌ నిలబెట్టుకున్నాడు.