Chiru Pawan: మెగా ఫ్యామిలి సినిమాల కొంపముంచుతున్నదేంటో తెలుసా? వరుస ఫ్లాపులకు కారణం ఇదే !
చిరంజీవి సినిమా అయినా పవన్ సినిమా అయినా ఒకప్పుడు సినిమా బాగున్నా బాగోకున్నా కనీసం థియేటర్‌కి వెళ్లాలనిపించేది. వాళ్ల సినిమాల్లో ఏదో ఒక టచింగ్ ఎలిమెంట్ ఉండేది.. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోగా.. అనసవరమైన 'భజన'తో సినిమాలు అస్సాం ట్రైన్ ఎక్కుతున్నాయి.

bholashankar flop and mega fans realises the real reason behind pawan chiru failure is boasting
చిరంజీవి అభిమానుల్లో ప్రస్తుతం ఆగ్రహం, ఆవేశం కంటే బాధ,వ్యధే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చిరు సినిమా బాలేదంటే కొట్టాడాలు, తన్నాడాలు మానేసి.. ఇవేం సినిమాలు రా బాబు అని బహిరంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్న దుస్థితి. ఒకప్పుడు నంబర్ వన్ హీరోగా దశబ్దాల పాటు సినీ ఇండస్ట్రీని ఏలిన మెగాస్టార్‌ను ఇప్పుడు చిరు ఫ్యాన్సే ‘అన్న ఇలాంటి సినిమాలు వదన్నా, ఇక ఆపాయ్’ అనే పరిస్థితి వచ్చింది. ‘స్వయంకృషి’తో పైకి వచ్చిన చిరంజీవి..’విజేత’గా మారడమే కాకుండా ఇండస్ట్రీలో ‘ఇంద్రు’డి పొజిషన్‌కు వచ్చాడంటే అందుకు కారణం ఆయన నటనతో పాటు ఎంచుకున్న సబ్జెక్ట్. ఏ సినిమాకైనా కథే బలం. ఈ బెసిక్ సూత్రాన్ని చిరుతో పాటు పవన్‌కు మరిచిపోయాడంటున్నారు మెగా ఫ్యాన్స్. మెగా సినిమాల కొంపముంచుతుందని ఆ ‘భజనే’ అంటున్నారు.
ఫ్యాన్స్ కోసం సినిమా తీస్తే కేవలం ఫ్యాన్సే ఆరాధిస్తారు.. మిగతా వాళ్లు అసలు పట్టించుకోరు. అదే కథను నమ్ముకోని సినిమా చేస్తే ఫ్యాన్స్‌తో పాటు యావత్ సినీ లోకం బ్రహ్మరథం పడుతోంది. విమర్శకులే నోళ్లు మూసుకోని శభాష్ అంటారు. అంతేకానీ కథలో వేలు పెట్టి అది సరిపోదన్నట్టు కాళ్లు కూడా పెట్టి.. కథను కథనాన్ని మార్చేసి.. మొత్తం కెలికేస్తే సినిమా కంపు అవ్వకుండా, ఫ్లాప్ అవ్వకుండా బంపర్ హిట్ ఎలా అవుతుంది? కథలో సమయం, సందర్భం లేకుండా ఎవరో కామెడియన్లతో ‘భజన’ చేయించుకోవడం ఎందుకు? అసలు కథకు సంబంధం లేని ఆ ‘పొలిటికల్ డప్పు’ ఎందుకు? సినిమా రాజకీయ ప్రయోజనాల కోసమా? అలా అయితే నేరుగానే అలాంటి సినిమానే చేసుకోవచ్చు కదా.. బంగారం లాంటి సినిమాలను రీమేకులు చేసి చెడగొట్టడం దేనికి?
ప్రీ రిలీజ్ ఈవెంట్లలో హీరోపై భజన వర్షం కురిపించడం వరకు ఓకే. అందులో ఎంత నిజం ఉంది.. ఎంత అతి ఉంది అన్నది పక్కన పెడితే.. అదే అతిని.. అదే రోతని.. అదే భజనని సినిమా కథలోకి ఎందుకు తీసుకొస్తున్నాట్టు? రచయితలే అలా అడ్డగోలుగా సీన్లు సృష్టిస్తున్నారా? రైటర్లే పనిపాట లేకుండా డైలాగులు పెడుతున్నారా? అలా అని చెబితే నమ్మడానికి చెవిలో క్యాబేజీలు ఎవరూ పెట్టుకోని లేరు. హీరోగారి మెప్పు కోసం, మొదటి రోజు థియేటర్లలో ఫ్యాన్స్ నుంచి ఈలలు, గోలల కోసం, తమ ఈగోలు శాటిస్‌ఫై చేసుకోవడం కోసం ఈ అర్థంలేని డైలాగులు. అభిమానుల కోసం ఇలా చేస్తే చివరకు నిర్మాత, డిస్టిబ్యూటర్లు నష్టపోతున్నారు. చిరు, పవన్ సినిమాల పరంగా ఎక్కువగా జరుగుతున్నదిదే. ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో కూడా ఇలా అర్థంలేని ఫ్యామిలీ డప్పు డైలాగులు కనిపించేవి. మా వంశం.. మా తాతా లాంటి డైలాగులు ఎందుకొచ్చేవో అర్థం అయ్యేవి కావు. ఇప్పుడు జూనియర్.. సీనియర్ అయ్యాడు.. కథకే ప్రాధాన్యం ఇస్తున్నాడు. అనవసర విషయాలను సినిమాల్లో ఉండకుండా జాగ్రత్త పడుతున్నాడు. మరి మెగా ఫ్యామిలీ ఈ నిజాన్ని ఎప్పుడు తెలుసుకుంటుంది? ఇంకెంత కాలం ఇదే రోటిన్ రొట్ట భజన?