Salaar: సెప్టెంబర్‌లో హౌజ్‌ఫుల్స్ గ్యారెంటీ.. వరుస కడుతున్న భారీ సినిమాలు..!

ఆగష్టులో జైలర్, గదర్ 2, ఓఎంజీ2.. బాక్సాఫీసు వద్ద మోత మోగిస్తే.. ఈసారి అంతకుమించి అనేలా సినిమాలు రాబోతున్నాయి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలు రాబోతున్నాయి. వీటిలో కొన్ని పాన్ ఇండియా టార్గెట్‌గా విడుదలవుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 29, 2023 | 08:17 PMLast Updated on: Aug 29, 2023 | 8:17 PM

Big Movies Releasing In This September Like Salaar Jawan

Salaar: ఇండియన్ బాక్సాఫీసు వద్ద సెప్టెంబర్‌లో కలెక్షన్ల వర్షం కురిసే ఛాన్స్ ఉంది. వచ్చే నెలలో భారీ సినిమాలు క్యూ కడుతున్నాయి. ఆగష్టులో జైలర్, గదర్ 2, ఓఎంజీ2.. బాక్సాఫీసు వద్ద మోత మోగిస్తే.. ఈసారి అంతకుమించి అనేలా సినిమాలు రాబోతున్నాయి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలు రాబోతున్నాయి. వీటిలో కొన్ని పాన్ ఇండియా టార్గెట్‌గా విడుదలవుతున్నాయి.
సెప్టెంబర్ 1న విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన ఖుషి రిలీజ్ అవ్వబోతుంది. తెలుగుతోపాటు తమిళం, ఇతర భాషల్లోనూ సినిమా రిలీజవుతోంది. అయితే, తెలుగులో మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా.. భారీ కలెక్షన్లు నమోదు కావడం ఖాయం. చాలా కాలంగా విజయ్ దేవరకొండను ఊరిస్తున్న హి‌ట్ ఈ సినిమాతో దక్కుతుందని ట్రేడ్ వర్గాలు అంచనావేస్తున్నాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 7న రాబోతుంది పాన్ ఇండియా మూవీ జవాన్. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ నటించిన ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్‌లో ఎలాగూ రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ అందుకోవడం ఖాయం. అయితే, ఈ సినిమాను తమిళ దర్శకుడు అట్లీ రూపొందించడం, నయనతార హీరోయిన్ కావడం, అనిరుధ్ సంగీతం తోడవ్వడంతో తమిళం, తెలుగులోనూ అంచనాలు పెరిగాయి. ఇంకా ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే.. యూఎస్ సహా అనేక చోట్ల రికార్డ్ స్థాయి బుకింగ్స్ నమోదవుతున్నాయి. దీంతో ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి.

ఇదే రోజు తెలుగులో మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి మూవీ రిలీజవుతోంది. నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా నటించిన ఈ చిత్రంపై కూడా తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. పాజిటివ్ టాక్ వస్తే భారీ కలెక్షన్లు నమోదవుతాయి. తర్వాత సెప్టెంబర్ 15న రామ్, బోయపాటి కాంబోలో తెరకెక్కిన స్కంద మూవీ రానుంది. ఇప్పటికే పాటలు, ట్రైలర్ ఆకట్టుకునేలా ఉన్నాయి. బోయపాటి మార్క్ యాక్షన్, సెంటిమెంట్ వర్కవుటైతే బొమ్మ దద్దరిల్లడం ఖాయం. ఈ చిత్రంపై కూడా ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సెప్టెంబర్ 15న తమిళ డబ్బింగ్ మూవీస్ చంద్రముఖి-2, మార్క్ ఆంథోని కూడా విడుదలవుతున్నాయి. చంద్రముఖి చిత్రానికి సీక్వెల్‌గా, లారెన్స్, కంగనా రనౌత్ కాంబోలో చంద్రముఖి-2 రూపొందింది. సీక్వెల్ కాబట్టి, ఈ సినిమాపై ఒక వర్గం ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. విశాల్ హీరోగా రూపొందిన చిత్రం మార్క్ ఆంటోని. విశాల్ మార్క్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా కూడా మంచి హిట్ అందుకుంటుంది.
సెప్టెంబర్‌లో రానున్న మరో ఆసక్తికర చిత్రం సలార్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రంపై ఓ రేంజ్ అంచనాలున్నాయి. సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలవుతుంది. ఈ చిత్రానికి అమెరికా సహా విదేశాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. మిలియన్స్ డాలర్ల మార్కును అందుకుంది. విడుదలకు మరో నెల సమయం ఉన్నప్పటికీ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇండియాలోనూ ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ దక్కుతాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి తగ్గట్లే భారీ బిజినెస్ చేసింది ఈ చిత్రం. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. పాత సినిమాల రికార్డులు అన్నింటినీ బద్దలుకొట్టడం ఖాయం. ఇదే రోజు వ్యాక్సిన్ వార్ అనే సినిమా విడుదల కానుంది. ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని తెరకెక్కించిన వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాను రూపొందించాడు. ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఛాన్స్ ఉంది. అయితే, సలార్ పోటీని ఎలా తట్టుకుంటుందో చూడాలి.
మొత్తంగా చూస్తే సెప్టెంబర్‌లో బాక్సాఫీస్ దగ్గర భారీ పోటీ నెలకొంది. అన్నింట్లోకి జవాన్, సలార్.. పాన్ ఇండియా మూవీస్‌గా ప్రేక్షకులు ముందుకు రానున్నాయి. వీటికి బ్లాక్‌బస్టర్ టాక్ వచ్చిందంటే.. కలెక్షన్ల రికార్డులు చెరిగిపోవడం ఖాయం. మూవీ లవర్స్.. గెట్ రెడీ ఫర్ సెప్టెంబర్..!