క్షవరం అయితే గాని వివరం రాలేదా విశ్వక్ సేన్ గారూ..?
స్వీయ అనుభవానికి మించిన గుణపాఠం మరొకటి లేదు అని పెద్దలు ఊరికే చెప్పలేదు. ఏదైనా మనకు అనుభవంలోకి వస్తే తప్ప అసలు విషయం అర్థం కాదు. ఇప్పుడు హీరో విశ్వక్ సేన్ విషయంలో ఇదే జరుగుతుంది.

స్వీయ అనుభవానికి మించిన గుణపాఠం మరొకటి లేదు అని పెద్దలు ఊరికే చెప్పలేదు. ఏదైనా మనకు అనుభవంలోకి వస్తే తప్ప అసలు విషయం అర్థం కాదు. ఇప్పుడు హీరో విశ్వక్ సేన్ విషయంలో ఇదే జరుగుతుంది. మొన్న లైలా సినిమా విషయంలో జరిగిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలో విషయం లేకపోయినా అనవసరంగా వివాదం అయిపోయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో 30 ఇయర్స్ పృథ్వీ చేసిన కామెంట్స్ తో ఈ సినిమా అనవసరంగా ఒక రాజకీయ పార్టీని టార్గెట్ చేసినట్టు అయింది. దాంతో వాళ్లు మాత్రం ఊరికే ఉంటారా చెప్పండి.. బాయ్ కాట్ లైలా అంటూ బాగా ట్రెండ్ చేశారు. కానీ వాళ్లు బాయ్ కాట్ అనే లోపే ప్రేక్షకులు ఈ సినిమాకు గుడ్ బై చెప్పేసారు. కనీసం ఒక్కరోజు కూడా ఆడకుండానే థియేటర్ల నుంచి వెళ్ళిపోయింది లైలా.
విశ్వక్ ఇన్నేళ్ళ కెరీర్లో ఎప్పుడు లేనంత విమర్శలు ఈ సినిమాతో ఎదుర్కొన్నాడు. కథ దగ్గర నుంచి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఇలా ఒక్కటేమిటి లైలా విషయంలో అన్ని రివర్స్ అయ్యాయి. దాంతో అసలు విషయం ఇప్పుడు బోధపడింది హీరో గారికి. అందుకే అభిమానులకు, సాధారణ ప్రేక్షకులకు క్షమాపణలు చెబుతూ ఒక లెటర్ రిలీజ్ చేశాడు విశ్వక్. గత కొంతకాలంగా నా సినిమాలు బాగా ఆడటంలేదు అనే విషయం నాకు అర్థం అవుతుంది. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విశ్లేషణలు, అందులో దొర్లిన తప్పులు నేను విశ్లేషించుకుంటున్నాను. ఇక మీద నా నుంచి అలాంటి తప్పులు జరగవు.. త్వరలోనే ఒక మంచి కథతో సినిమా చేస్తాను.. మీ ముందుకు వచ్చి మళ్లీ విజయం అందుకుంటాను అంటూ లేఖ విడుదల చేశాడు విశ్వక్.
ఇది చూసిన తర్వాత పర్లేదే మనోడిలో బాగానే మార్పు వచ్చింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకు రాదు చెప్పండి.. ఇంత పెద్ద డిజాస్టర్ వచ్చిన తర్వాత కూడా తన తప్పులు తాను తెలుసుకోకపోతే ఇంక ఇండస్ట్రీలో ముందుకు ఎలా వెళ్తాడు.. మారాల్సిన టైం వచ్చింది మారాడు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మ్యాటర్ ఏదైనా విశ్వక్ సేన్ మారాడు. మరి ఈ మార్పు ఆయన నెక్స్ట్ సినిమాలకు యూస్ అవుతుందా లేదా అనేది చూడాలి.