సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై CBI ఫైనల్ రిపోర్ట్.. అందులోని సంచలన విషయాలివే..!
దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి కూడా ఐదేళ్లు కావొస్తుంది. ఆయనను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు అభిమానులు.

దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి కూడా ఐదేళ్లు కావొస్తుంది. ఆయనను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు అభిమానులు. బాలీవుడ్ లో ఏ నెపోకిడ్ సినిమా వచ్చినా కూడా సుశాంత్ పేరు చెప్పి దాన్ని తిప్పి కొడుతున్నారు. కేవలం బాలీవుడ్ లో ఉన్న రాజకీయాల కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు అని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఆయన మరణించిన తర్వాత హిందీ ఇండస్ట్రీలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రీకి రావాలి అనుకున్న నెపో కిడ్స్ ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ఇదిలా ఉంటే సుశాంత్ సూసైడ్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఆయన మరణానికి సంబంధించి నమోదైన రెండు కేసులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉట్ క్లోజ్ చేసింది. ఇకపై సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై ఎలాంటి దర్యాప్తులు ఉండవు.. ఎలాంటి కేసులు ఉండవు.. ఆయనది ఆత్మహత్య అని తేల్చేసింది సిబిఐ. ఈ మేరకు మార్చి 22న ముంబై కోర్టులో సీబీఐ క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంలో ఎలాంటి కుట్ర కోణం లేదని.. కేవలం ఆయన ఆత్మహత్య చేసుకోవడం వల్లే చనిపోయాడు అంటూ క్లోజర్ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. అంతేకాదు ఆయన మరణంతో నటి రియా చక్రవర్తికి ఎలాంటి సంబంధం లేదని సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది.
దాంతో ఐదేళ్లుగా ఈ కేసులో ఉన్న రియా చక్రవర్తి ఎట్టకేలకు బయటపడింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోవడానికి కుట్ర జరిగిందని చాలా వార్తలు వచ్చాయి. అయితే ఐదు సంవత్సరాలు ఈ కేస్ మీద కూర్చున్న తమకు.. ఆయన మరణం వెనుక కుట్ర ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు అని సిబిఐ తెలిపింది. సుశాంత్ కుటుంబ సభ్యులపై రియా చక్రవర్తి దాఖలు చేసిన కేసును కూడా సీబీఐ క్లోజ్ చేసింది. ఈ క్లీన్ చీట్ తో ఐదేళ్లుగా సుశాంత్ ఆత్మహత్య చుట్టూ ఉన్న హై డ్రామా తొలగిపోయింది. కేవలం మానసిక ఒత్తిడి ఇతర కారణాలవల్లే ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయాడు అంటూ క్లారిటీ ఇచ్చింది సిబిఐ. కానీ అభిమానులు మాత్రం ఇది బాలీవుడ్ స్టార్ హీరోలు, అక్కడి అగ్రదర్శక నిర్మాతలు కలిసి చేసిన హత్య అంటున్నారు. ఒక టాలెంటెడ్ హీరోకు అవకాశాలు రాకుండా తొక్కేయడమే కాకుండా.. ఆయనను ఇండస్ట్రీలో లేకుండా ఎన్నో కుట్రలు చేశారు అంటూ ఆయన ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ చూసి తట్టుకోలేక తమ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14, 2020న ముంబై బాంద్రాలో ఉరి వేసుకొని చనిపోయాడు అంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు అభిమానులు.
తన కెరీర్ మీద ఎన్నో కలలు కన్న ఒక యువ హీరోను బలవంతంగా తొక్కేసే ప్రయత్నం చేయడంతో.. ఏం చేయాలో తెలియక తనువు చాలించాడు అంటున్నారు ఆయన ఫ్యాన్స్. కానీ కోర్టు ఎమోషన్స్ నమ్మదు.. కేవలం సాక్ష్యాలు మాత్రమే నమ్ముతుంది. ఐదేళ్ల సిబిఐ విచారణలో సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదు.. కుట్రలో భాగంగా చనిపోయాడు అని నిరూపించేలా ఒక్క ఆధారం కూడా లేదు. దాంతో కేసు క్లోజ్ చేశారు సిబిఐ. కాయ్ పోచే సినిమాతో హీరోగా పరిచయమైన సుశాంత్.. శుద్ద్ దేశి రొమాన్స్, పీకే, ఎంఎస్ ధోని, చిచోరే లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. 300 కోట్లకు పైగా మార్కెట్ సంపాదించుకున్న ఈయన.. ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకోవడంతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ పై పెద్ద యుద్ధమే చేశారు అభిమానులు. ఇక సుశాంత్ మరణించిన తర్వాత.. అతని ప్రేయసి రియా చక్రవర్తి, ఇతరులు కలిసి తన కొడుకును ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఆర్థిక మోసం.. మానసిక వేధింపులకు గురి చేశారని హీరో తండ్రి కెకె సింగ్ పాట్నాలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆ తర్వాతే పోలీసులు రియా చక్రవర్తితో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు. దీనికి కౌంటర్ గా నటి రియా చక్రవర్తి కూడా సుశాంత్ కుటుంబ సభ్యులకు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాళ్లు నకిలీ మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం వల్లే సుశాంత్ మరణించాడని రియా ఫిర్యాదులో పేర్కొంది. సుశాంత్ సింగ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ఐదేళ్ల విచారణ తర్వాత ఈ కేసు ఆత్మహత్యగానే ముగిసింది.