Chiranjeevi: చిరంజీవిపై మెగా ట్రోలింగ్..! మరి మెగా కంబ్యాక్ ఎప్పుడు..?
ఆచార్యతో పోల్చుకుంటే భోళా శంకర్‌కే రివ్వ్యూ రేటింగ్స్ ఎక్కువ ఇచ్చారు. ఆచార్య ఎంత డిజాస్టర్ అయినా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ ఎందుకిలా తీశాడంటూ, డిజాస్టర్ నేరమంతా దర్శకుడికి వెళ్లిపోయింది. చిరంజీవి ట్రోలింగ్ బారిన పెద్దగా పడలేదు
Chiranjeevi: చిరంజీవికి మెగా హిట్స్ వున్నాయి. డిజాస్టర్స్ వున్నాయి. ఇవన్నీ కొత్త కాకపోయినా గతంలో ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు ట్రోలింగ్ బారిన పడ్డాడు. భోళా తీసిన మెహర్ రమేశ్ కంటే చిరంజీవిపైనే ట్రోలింగ్ ఎక్కువ నడుస్తోంది. ట్రోలర్స్‌కు దొరికిపోవడానికి మెగాస్టార్ స్వయంకృతాపరాధమే కారణమా..? ఆచార్యతో పోల్చుకుంటే భోళా శంకర్‌కే రివ్వ్యూ రేటింగ్స్ ఎక్కువ ఇచ్చారు. ఆచార్య ఎంత డిజాస్టర్ అయినా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ ఎందుకిలా తీశాడంటూ, డిజాస్టర్ నేరమంతా దర్శకుడికి వెళ్లిపోయింది. చిరంజీవి ట్రోలింగ్ బారిన పెద్దగా పడలేదు.
అయితే.. ఈసారి భోళా శంకర్ తీసిన మెహర్ రమేశ్ కంటే చిరంజీవినే టార్గెట్ చేశారు. సినిమా రిలీజ్‌కు ముందు రెండు ఈవెంట్స్‌లో ఆయన కామెంట్సే ట్రోలర్స్‌కు అవకాశం ఇచ్చినట్టయింది. భోళా శంకర్ తమిళ హిట్ వేదాళం రీమేక్‌గా అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్‌తో రూపొందింది. చిరంజీవి చెల్లిగా కీర్తిసురేశ్ నటించగా.. సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌లో చిరు మాట్లాడుతూ.. ఈ ఒక్క సినిమాకే నువ్వు చెల్లివి.. నెక్ట్స్ పిక్చర్లో హీరోయిన్‌గానే వుంటావు.. చెల్లి ఫీలింగ్ వస్తున్నా.. ఆపుకుంటున్నానని చిరంజీవి అనడం జనాలకు నచ్చలేదు. సినిమా చూస్తున్నంతసేపు.. స్టేజ్ మీద చిరంజీవి పెర్‌ఫార్మెన్స్ గుర్తుకొచ్చి.. అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ పండలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆడియన్స్. సినిమాలో ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్.. కొన్ని కామెడీ సీన్స్ ఆకట్టుకున్నా ఎందుకోగానీ సినిమాకు మైనస్ అయిన శ్రీముఖి నడుము సీన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సీన్ బాగా వచ్చిందని కట్ చేయకుండా వుంచామని చిరంజీవే ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఇది మీ డైరెక్షనేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరి మధ్యలో వున్న వయసు తేడాను గుర్తు చేస్తూ అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు.
ప్రి రిలీజ్ ఈవెంట్ అంటే హీరో, దర్శకులను పొగడడం కామనే. అయితే భోళా ప్రి రిలీజ్ ఈవెంట్‌లో ప్రమోషనల్ ఇంటర్వ్యూస్‌లో భజన కాస్త ఎక్కువైంది. మెగాస్టార్ స్థాయికి ఎదిగిన చిరంజీవి ఇంతలా పొగిడించుకోవడం అవసరమా? అంటున్నారు. చిరంజీవికి అందరివాడు అనిపించుకోవడం అంటే చాలా ఇష్టం. సినిమా టైటిల్‌కే పరిమితం కాకుండా అందరివాడు అనించుకోవడానికి ప్రయత్నిస్తున్నా ఒక్కోసారి బెడిసి కొడుతోంది. ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్ చేసి దొరికిపోతున్నాడు. భోళా శంకర్ రిలీజ్‌కు ముందు జరిగిన ‘వాల్తేరు వీరయ్య’ 200 రోజుల వేడుక కూడా ట్రోలింగ్‌కు కారణమైంది. స్పీచ్ మొదలుపెడుతూనే ‘ఆరోజుల్లో మేము’ అనే మాట ఇష్టం వుండదు. ఈ రోజుల్లో మేము అంటే ఇప్పుడు ఏమీ లేదనేగా? అన్నాడు చిరంజీవి. ఈ మాటలు రైవల్ సీనియర్ హీరోకు తగిలాయి. ఆ తర్వాత కవర్ చేస్తూ ఆరోజుల్లో 100 రోజులు, సిల్వర్ జూబ్లీలు ఆడేవని కవర్ చేశాడు చిరంజీవి. భోళా శంకర్ రిజల్ట్‌తో రైవల్ ఫ్యాన్స్ ట్రోలింగ్‌కు చిరంజీవి దొరికిపోయాడు. ఇక ఆడేసుకున్నారు.
భోళా నిరాశపరచడం చిరంజీవి స్వయంకృతమేనని మెగా అభిమానులే అంటున్నారు. తెలిసి తెలిసి ఫ్లాప్ డైరెక్టర్‌ను తీసుకోవడంతో సినిమాపై అంచనాల్లేవు. మెహర్ మెగాఫోన్ పట్టి పదేళ్లయింది. చుట్టం కదా అని ఉపాధి కల్పిద్దాం కదా అని ఛాన్స్ ఇచ్చి ట్రోలింగ్ కొని తెచ్చుకున్నాడు చిరంజీవి. దీనికి తగ్గట్టు ఇంటర్వ్యూలో చిరు మాట్లాడుతూ ఎలా చేసినా మెహర్ ఓకె చేసేస్తాడని చెప్పడం, శ్రీముఖి సీన్ వుంచమని చెప్పడంతో డైరెక్టర్‌ను డమ్మీని చేసేశాడంటూ ట్రోలింగ్ చేశారు. కర్ణుడి చావుకు 100 కారణాలంటారు. భోళా రిజల్ట్‌కు వున్నవి మూడు నాలుగే. మెహర్ రమేశ్‌కు ఛాన్స్ ఇవ్వడమే అతి పెద్ద తప్పయితే.. ప్రి రిలీజ్ ఈవెంట్‌లో కీర్తిసురేష్‌తో బిహేవియర్ సినిమాలో అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. రిలీజ్‌కు ముందు సీనియర్ హీరోను ఇన్‌డైరెక్ట్‌గా గిల్లడంతో వాళ్ల ఫ్యాన్స్ పండు పడేదాకా ట్రోలింగ్‌తో గిల్లారు. సినిమా బాగుంటే ఇవేవీ పట్టించుకోకపోయినా ఎప్పుడోకప్పడు గుర్తుపట్టుకుని మరీ ట్రోల్ చేస్తారనేది సత్యం. అయితే, ట్రోలర్స్‌కు వాల్తేరు వీరయ్య మాదిరి కంబ్యాక్‌తో అందరికీ సమాధానం ఎప్పుడిస్తాడా? అని మెగాఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.