Chiranjeevi: చిరంజీవి అన్నయ్యా.. నువ్వు కాస్త మారవా..?
68 ఏళ్ల చిరంజీవి తన వయసు కనబడకుండా శరీరాన్ని అదుపులో పెట్టుకుంటూ అంతకంటే యాక్టివ్‌గా కనిపిస్తూ, జస్ట్ 35ఏళ్ల వ్యక్తిలా అనిపిస్తూ ఉంటాడు. ఈ వయసులోనూ అలా నటించడం, ఏ రోల్ అయినా చేయగలగడం కచ్చితంగా అభినందించాల్సిందే.
Chiranjeevi: చిరంజీవి అంటే మాస్ హీరో, ఫ్యామిలీ హీరో. కుటుంబం అందరూ కలిసి చూసే సినిమా హీరో. అన్నింటికీ మించి ప్రతి కుటుంబంలోనూ ఇలాంటి వ్యక్తిత్వం కచ్చితంగా కనిపిస్తుంటుంది. అలాంటి చిరంజీవి.. వయసు పెరిగే కొద్దీ హీరోగా, నటుడిగా ట్రాక్ తప్పిపోతున్నాడా అనిపిస్తోంది. 68 ఏళ్ల చిరంజీవి తన వయసు కనబడకుండా శరీరాన్ని అదుపులో పెట్టుకుంటూ అంతకంటే యాక్టివ్‌గా కనిపిస్తూ, జస్ట్ 35ఏళ్ల వ్యక్తిలా అనిపిస్తూ ఉంటాడు. ఈ వయసులోనూ అలా నటించడం, ఏ రోల్ అయినా చేయగలగడం కచ్చితంగా అభినందించాల్సిందే.
కాకపోతే 150వ సినిమా దగ్గర నుంచి చిరంజీవి సెలెక్ట్ చేసుకుంటున్న పాత్రలు, వ్యవహరిస్తున్న తీరు విపరీతమైన వెగటు పుట్టిస్తోంది. డాన్సులు చేయగలుగుతున్నాను కాబట్టి.. యాక్షన్ ఇరగదీస్తాను కాబట్టి.. నన్ను ఇంకా మీరు రఫ్ అండ్ మాస్ హీరోగానే చూడాలి అన్నట్లుగా కుర్ర హీరోయిన్లతో తైతక్కలాడుతూ.. ఆ మూస డైలాగులు.. ఎన్నాళ్ళైనా మారని అదే స్టైల్ ఫాలో అవుతున్నాడు. అసలు మేము నిన్ను ఎందుకు చూడాలి అనే పరిస్థితిని చిరంజీవి తెచ్చుకుంటున్నారు. ఆయన వయసు హీరోలైన కమల్ హాసన్, రజనీకాంత్, మమ్ముట్టి, మోహన్ లాల్ డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటున్నారు. సక్సెస్ అవుతున్నారు. కమల్‌హాసన్ విక్రమ్ మూవీతో రూ.400 కోట్ల క్లబ్‌లోకి వెళ్లిపోతే, జైలర్ లాంటి పాత్రతో రజనీకాంత్ ఇప్పటికీ తను మంచి నటుడినని ప్రూవ్ చేసుకున్నారు. మోహన్‌లాల్ సంగతి చెప్పనే అక్కర్లేదు. నిత్యం ప్రయోగాలు.. పనికొచ్చే సినిమాలతో.. అతనిలో నటుడిని చూపించే సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు.
చిరంజీవి మాత్రం తనలో మంచి నటుడున్నాడని విషయాన్ని మర్చిపోయి.. తనను హీరోగానే నిత్యం ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. దానికి తోడు చిరంజీవి చుట్టూ ఉండే చిడతల బ్యాచ్.. ఆ టెంపో తగ్గనివ్వకుండా అన్నయ్య నువ్వు ఇరగదీస్తున్నావ్.. అన్నయ్య నువ్వు పగలతీస్తున్నావ్.. అని పొగుడుతుంటే ఎక్కడికో వెళ్లిపోయి పాతికేళ్ల క్రితం ఆయన వేసిన స్టెప్పులు.. అవే మూస డైలాగులతో.. జనాన్ని అలరించాలని ట్రై చేస్తున్నాడు. తనలో హీరోని మిగుల్చుకోవాలి అనుకుని, చివరికి నటుడిని చంపేసుకుంటున్నాడు. బోళా శంకర్ సినిమా చూసిన ఎవరికైనా చిరంజీవి అంటే వెగటు, జాలి కలుగుతాయి. తెలుగు సినిమా పరిశ్రమను మూడు దశాబ్దాలు ఏలిన స్టార్ హీరో.. ఆ జనరేషన్‌కి ఈ జనరేషన్‌కి కూడా బోర్ కొట్టిస్తున్నారు.
రీమేక్ సినిమాలు కొనుక్కురావడం, వాటికి తన మార్క్ జోడించడం.. రూ.100 కోట్ల కలెక్షన్ కోసం ప్రయత్నించడం.. చివరికి చిరంజీవి ఇలా మిగిలిపోయాడు. దయచేసి ఇలాంటి ఆలోచనల నుంచి బయటికి రా అన్నయ్యా.. నీలో నటుడిని బతికించు. డబ్బులు, రికార్డులు, స్టార్ హోదా కాదు.. నీలో ఒక నటుడున్నాడనే విషయాన్ని నిలబెట్టుకో. అంతేగాని నేనేం చేస్తే అది చూస్తారు. నేనేం చెప్తే అది వింటారు అని మీరు అనుకుంటే అంతకంటే మరో భ్రమ ఉండదు.