చిరంజీవి, త్రివిక్రమ్.. ఓ నెవర్ ఎండింగ్ స్టోరీ..! అసలు సమస్య ఎక్కడుంది..?
ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కు ఉండే క్రేజ్ వేరు. వాళ్లు కలవడం కాదు.. కలుస్తారు అని ఊహ వచ్చినప్పుడు అభిమానులు గాల్లో గంతులు వేస్తూ ఉంటారు.

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కు ఉండే క్రేజ్ వేరు. వాళ్లు కలవడం కాదు.. కలుస్తారు అని ఊహ వచ్చినప్పుడు అభిమానులు గాల్లో గంతులు వేస్తూ ఉంటారు. కానీ ఏం చేస్తాం ఆ కాంబినేషన్స్ ఊరిస్తుంటాయి కానీ వర్కవుట్ అవ్వవు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన చిరంజీవి, త్రివిక్రమ్. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా కోసం అభిమానులు ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్నారు. నిజానికి ఐదేళ్ల కిందే తామిద్దరం సినిమా చేస్తున్నామని ప్రకటించాడు చిరంజీవి. అప్పట్లో వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ వేడుకలో త్రివిక్రమ్ తో తమ సినిమా చేయబోతున్నట్టు అనౌన్స్ చేశాడు చిరంజీవి. కానీ ఇప్పటికీ దీని గురించి ఊసే లేదు. అసలు సంబంధమే లేదన్నట్లు ఎవరి సినిమాలతో వాళ్లు బిజీ అయిపోయారు చిరు, త్రివిక్రమ్. చాలా ఏళ్ళ తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ కాంబినేషన్ ట్రెండ్ అవుతుంది. దానికి కారణం నాగవంశీ. కచ్చితంగా ఇద్దరి కాంబినేషన్లో సినిమా చేస్తాను అంటున్నాడు ఆయన. ప్రస్తుతం చిరంజీవి ఉన్న బిజీలో గురూజీతో ప్రాజెక్ట్ అంటే కాస్త కష్టమే కానీ అనుకుంటే మాత్రం అంత కష్టమేం కాకపోవచ్చు.
పైగా ఈ మధ్య సరైన విజయం కోసం చూస్తున్నాడు మెగాస్టార్. భోళా శంకర్ ఫ్లాప్ తర్వాత ఆయనలో కూడా గట్టి మార్పులు వచ్చాయి. స్క్రిప్ట్ నచ్చక కూతురు సుష్మిత నిర్మాణంలో చేయాల్సిన కళ్యాణ్ కృష్ణ సినిమాను పక్కనబెట్టారు మెగాస్టార్. అలాగే నచ్చిన కథ తీసుకొచ్చిన బింబిసార దర్శకుడు వశిష్ట విశ్వంభర సినిమా ముందుకు తీసుకొచ్చాడు. జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి తరహాలో ఇది పూర్తిగా సోషియో ఫాంటసీ డ్రామా. చిరంజీవి ఇమేజ్‌కు సరిపోయేలా కమర్షియల్ హంగులు ఉండేలా ఈ కథ వస్తుంది. ముల్లోకాల చుట్టూ కథ తిరిగే ఈ కథలో చిరంజీవి ముల్లోక వీరుడిగా నటిస్తున్నాడు. వశిష్ట తర్వాత అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెల సినిమాలకు కమిట్ అయ్యాడు మెగాస్టార్. వీటి తర్వాత త్రివిక్రమ్‌తో ప్రాజెక్ట్ సెట్ అయిందని వార్తలు వస్తున్నాయి.
త్రివిక్రమ్ రైటర్‌గా ఉన్నపుడు జై చిరంజీవకు చిరుతో పని చేసాడు. ఆయన డైరెక్టర్‌గా బిజీ అయ్యాక.. మెగాస్టార్ పాలిటిక్స్ దారి పట్టడంతో కాంబినేషన్ పట్టాలెక్కే అవకాశమే రాలేదు. ఇన్నేళ్లకు ఛాన్స్ వచ్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమా స్క్రిప్ట్ తో బిజీగా ఉన్నాడు త్రివిక్రమ్. దీని తర్వాత చిరంజీవి సినిమా లైన్‌లోకి వస్తుంది. వశిష్ట సినిమా అయిపోయింది కాబట్టి.. అనిల్, శ్రీకాంత్ సినిమాలు త్వరగా పూర్తి చేయాలనేది చిరు ప్లాన్. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే అభిమానులకు అంతకంటే కావాల్సింది లేదు. ఎందుకంటే చిరు ఇమేజ్‌కు.. త్రివిక్రమ్ రైటింగ్ పవర్ తోడైతే బాక్సాఫీస్‌కు చెమటలు పట్టడం ఖాయం.