కోర్ట్ రివ్యూ.. నాని నిర్మాతగా మళ్లీ సక్సెస్ అయ్యాడా.. మనం హిట్ 3 చూడొచ్చా లేదా..?

హీరోగానే కాదు నిర్మాతగా వరుస సినిమాలు చేస్తున్నాడు నాని. తాజాగా ఈయన నిర్మాణంలో వచ్చిన సినిమా కోర్ట్. ప్రియదర్శి, హర్ష్ రోషన్, శివాజీ, శ్రీదేవి కీలకపాత్రల్లో తెరకెక్కిన కోర్టు సినిమా మార్చి 14న విడుదల కానుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 13, 2025 | 12:44 PMLast Updated on: Mar 13, 2025 | 12:44 PM

Court Review Has Nani Become Successful Again As A Producer

హీరోగానే కాదు నిర్మాతగా వరుస సినిమాలు చేస్తున్నాడు నాని. తాజాగా ఈయన నిర్మాణంలో వచ్చిన సినిమా కోర్ట్. ప్రియదర్శి, హర్ష్ రోషన్, శివాజీ, శ్రీదేవి కీలకపాత్రల్లో తెరకెక్కిన కోర్టు సినిమా మార్చి 14న విడుదల కానుంది. అయితే మీడియాకు రెండు రోజుల ముందే స్పెషల్ ప్రీమియర్ వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది.. నాని నమ్మకాన్ని నిలబెట్టిందా లేదా అనేది చూద్దాం..!కథ విషయానికి వస్తే.. వైజాగ్ లోనే ఒక చిన్న కాలనీలో వాచ్మెన్ కొడుకు చంద్రశేఖర్ అలియాస్ చందు అనే కుర్రాడుంటాడు. చదువుకోకుండా ఏదో పని చేసుకుంటూ ఉంటాడు.

అలాంటి వాడి లైఫ్ లోకి అనుకోకుండా జాబిలి అనే అమ్మాయి వస్తుంది. ఫోన్లో మాట్లాడుతూ ఆట పట్టిస్తుంది. ఒకానొక సమయంలో వీళ్ళిద్దరూ ఎదురుపడతారు.. చందు వ్యక్తిత్వం నచ్చి అతనితో ప్రేమలో పడుతుంది జాబిలి. మరోవైపు ప్రాణం కంటే పరువు ముఖ్యంగా బ్రతికే జాబిల్లి బాబాయ్ మంగపతికి ఈ విషయం తెలుస్తుంది. దాంతో ఆ కుర్రాడిపై ఉన్నవి లేని సెక్షన్లు బనాయించి అరెస్టు చేయించి జైల్లో పెడతారు. పైనుంచి ఫోక్సో చట్టం కూడా యాడ్ చేస్తారు. అది తెలిసి ఆ కేసు వాదించడానికి ఎవరు రారు. అలాంటి సమయంలో ఆ కేస్ టేకప్ చేయడానికి సూర్య తేజ అనే లాయర్ వస్తాడు. ఆ కుర్రాడు ఎటువంటి తప్పు చేయలేదు.. అన్యాయంగా కేసులో అతన్ని ఇరికించారు అని ఎలా న్యాయస్థానం ముందు ప్రూవ్ చేస్తాడు అనేది మిగిలిన కథ..

కథనం విషయానికొస్తే.. ఈ రోజుల్లో చిన్న సినిమాల్లో మంచి మంచి పాయింట్స్ తీసుకుంటున్నారు దర్శకులు. నిజం చెప్పాలంటే అక్కడే వాళ్ళు సగం సక్సెస్ అవుతున్నారు. తాజాగా కోర్టు సినిమా విషయంలో కూడా దర్శకుడు రామ్ జగదీష్ ఇక్కడే విజయం సాధించాడు. కోర్టు రూమ్ డ్రామాలకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అక్కడ వాదన ఎంత బాగా జరిగితే.. సినిమా అంత ఆసక్తికరంగా ఉంటుంది. కోర్టు సినిమాకు కూడా ఈ అడ్వాంటేజ్ బాగా పనికొచ్చింది. తాను చెప్పాలనుకున్న పాయింట్ డివియేట్ కాకుండా సూటిగా చెప్పాడు దర్శకుడు రామ్ జగదీష్. ఫోక్సో చట్టం గురించి చాలా మందికి ఐడియా ఉండదు.

అసలు అలాంటి ఒక చట్టం ఉందనే విషయం కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. దాన్ని నేపథ్యంగా చేసుకున్నప్పుడే కోర్టు సినిమా విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. దాని చుట్టూ ఒక సింపుల్ కథ అల్లుకున్నాడు. ఇలాంటి లైన్ తో సినిమా చేయాలి అనుకోవడం కత్తి మీద సామే. ఎందుకంటే ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగిన అన్ని వేళ్ళు దర్శకుడి వైపు చూపిస్తాయి. తన వైపు నుంచి ఆ తప్పు జరగకుండా జాగ్రత్తగా స్క్రిప్ట్ రాసుకున్నాడు దర్శకుడు రామ్ జగదీష్. ఫస్ట్ ఆఫ్ అంతా హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్.. పరువే ప్రాణంగా బ్రతికే ఇంటి పెద్దకు విషయం తెలియడం.. ఆ కుర్రాడిపై లేనిపోని కేసులు పెట్టి జైలుకు పంపించడం.. ఇవన్నీ చకచకా జరిగిపోతాయి.

అసలు కథ మొత్తం ప్రియదర్శి కేసు టేకప్ చేసిన దగ్గర నుంచి నుంచి మొదలవుతుంది. సెకండ్ హాఫ్ అంతా వాదనలు, ప్రతివాదనలు, ట్విస్ట్ లతో ఇంట్రెస్టింగ్ గా వెళ్ళిపోతుంది. ఎక్కడా మనం ఊహించని మలుపులు అయితే ఉండవు కానీ.. మనం ఊహించినప్పుడు మాత్రం ఆ మలుపులు రావు. స్క్రీన్ ప్లే అంటే ఇలాగే ఉండాలి అని సీనియర్ రైటర్ పరుచూరి వెంకటేశ్వరరావు ఒకసారి చెప్పారు. కోర్టు సినిమా చూస్తున్నప్పుడు అదే అనిపించింది. కథ మనం అనుకున్నట్టుగానే ముందుకు సాగుతుంది కానీ కథనం మాత్రం అలా కాదు. కథ ఎంత సున్నితంగా ఉందో.. ఎమోషన్స్ అంత బలంగా ఉన్నాయి. కోర్టు డ్రామా అంతా బాగా వర్కవుట్ అయింది. క్లైమాక్స్ కూడా చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు. మరీ ముఖ్యంగా ఇలాంటి కథలో ఎలాంటి అసభ్యత లేకుండా చూసుకున్నాడు. క్లైమాక్స్ లో న్యాయ వ్యవస్థను ప్రశ్నించాడు కూడా.

ఇక నటీనటుల విషయానికి వస్తే.. ప్రియదర్శి లాయరుగా అదరగొట్టాడు. లాయర్ పాత్రలో అద్భుతంగా నటించాడు. బాల నటుడిగా ఇప్పటికే చాలా సినిమాల్లో మెప్పించిన హర్ష రోషన్ ఈ సినిమాలో చందు పాత్రలో చాలా బాగా నటించాడు. కొత్తమ్మాయి శ్రీదేవి బాగుంది.. నటన కూడా ఆకట్టుకుంటుంది.సాయికుమార్ మరో కీలక పాత్రలో మెప్పించాడు. ఈ సినిమాలో ఎంతమంది ఉన్నా ఈ సినిమాను నిలబెట్టింది శివాజీ.. ఆయన నటన నెక్స్ట్ లెవెల్. తనలోని సరికొత్త విలనిజం చూపించాడు శివాజీ.

టెక్నికల్ టీం విషయానికి వస్తే.. బేబీ ఫేమ్ విజయ్ బుల్గానిన్ సంగీతం చాలా బాగుంది. ప్రేమలో సాంగ్ ఇప్పటికే బాగా పాపులర్ అయింది. మరో రెండు పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా వర్కౌట్ అయింది. ఇక దర్శకుడు రామ్ జగదీష్ నాని తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. నాని నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.

ఓవరాల్ కోర్ట్.. వెరీ ఇంట్రెస్టింగ్ కోర్టు డ్రామా..! ఈ సినిమాతో కేవలం వినోదం మాత్రమే కాదు.. నాని చెప్పినట్టు కొన్ని చట్టాల మీద అవగాహన కూడా వస్తుంది.