Anil Kapoor: ఏమిటీ ‘పర్సనాలిటీ రైట్స్’..? అనిల్ కపూర్ ‘ఝకాస్’ డైలాగ్‌కు లీగల్ ప్రొటెక్షన్..

‘‘అనిల్ కపూర్ చెప్పిన ప్రసిద్ధ మూవీ డైలాగ్ లలో ‘ఝకాస్’ ఒకటి. ఆ డైలాగ్.. పూర్తిగా ఆయన వ్యక్తిత్వ హక్కు (పర్సనాలిటీ రైట్)తో ముడిపడి ఉన్న అంశం. అందువల్ల అనిల్ కపూర్ అనుమతి లేకుండా మరెవరూ ఆ డైలాగ్‌ వాణిజ్యపరంగా కాపీ కొట్టి వాడటానికి వీల్లేదు’’ అని కోర్టు స్పష్టం చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 22, 2023 | 07:39 PMLast Updated on: Sep 22, 2023 | 7:39 PM

Delhi Hc Protects Anil Kapoors Personality Rights What Are They

Anil Kapoor: ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్‌కు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 38 ఏళ్ల కిందట ‘యుద్ధ్’ మూవీలో ఆయన చెప్పిన ‘ఝకాస్’ డైలాగ్‌పై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘అనిల్ కపూర్ చెప్పిన ప్రసిద్ధ మూవీ డైలాగ్ లలో ‘ఝకాస్’ ఒకటి. ఆ డైలాగ్.. పూర్తిగా ఆయన వ్యక్తిత్వ హక్కు (పర్సనాలిటీ రైట్)తో ముడిపడి ఉన్న అంశం. అందువల్ల అనిల్ కపూర్ అనుమతి లేకుండా మరెవరూ ఆ డైలాగ్‌ వాణిజ్యపరంగా కాపీ కొట్టి వాడటానికి వీల్లేదు’’ అని కోర్టు స్పష్టం చేసింది. ‘ఝకాస్’ డైలాగ్‌పై తనకున్న వాణిజ్య హక్కులు దుర్వినియోగం కాకుండా కాపాడాలంటూ 67 ఏళ్ల అనిల్ కపూర్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభా ఎం.సింగ్ ఈమేరకు వ్యాఖ్యలు చేస్తూ తీర్పును వెలువరించారు.
పిటిషన్‌లో ఆసక్తికర అంశాలు..
ఈ కేసులో అనిల్ కపూర్ తరఫు న్యాయవాది ప్రవీణ్ ఆనంద్ వాదనలు వినిపిస్తూ.. అనేక వెబ్‌సైట్లు, వివిధ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు తన క్లయింట్ వ్యక్తిత్వ లక్షణాలను, డైలాగ్‌లను దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించారు. వస్తువుల విక్రయం కోసం అనిల్ కపూర్ ఫొటోలను అనుమతి లేకుండానే వాడుకుంటున్నారని కోర్టుకు వివరించారు. కపూర్ ఫొటోను అవమానకరమైన రీతిలో మార్ఫింగ్ చేస్తున్నారని తెలిపారు. అనిల్ కపూర్ ఫోటోలు, జిఫ్ ఇమేజెస్, నకిలీ ఆటోగ్రాఫ్‌లను ‘ఝకాస్’ అనే డైలాగ్ స్టిక్కర్‌తో ప్రింట్ చేసి మార్కెట్లో అమ్ముతున్నారని న్యాయస్థానానికి చెప్పారు. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. అనిల్ కపూర్ చెప్పిన ‘ఝకాస్’ డైలాగ్‌ను వాణిజ్యపరంగా వాడటానికి వీల్లేదని, అది అనిల్ కపూర్ పర్సనాలిటీ రైట్ అని తేల్చి చెప్పింది.
‘ఝకాస్’ అంటే..
‘ఝకాస్’ అనేది మరాఠీ భాషా పదం. దీని అర్థం తెలివైనది. ఈ పదాన్ని అనిల్ కపూర్ తొలిసారిగా 1985లో ‘యుద్ధ్’ సినిమాలో ఉపయోగించారు. అనిల్ కపూర్ చెప్పే ప్రత్యేకమైన విధానం కారణంగా ఈ డైలాగ్ ఎంతో ఫేమస్ అయింది. ఈ డైలాగ్‌కు సంబంధించి అనిల్ కపూర్ పేరు, వాయిస్, ఇమేజ్, పోలిక, మాట్లాడే విధానం, సంజ్ఞలతో సహా ఆయన వ్యక్తిత్వానికి సంబంధించిన అన్ని అంశాలకు కాపీరైట్ రక్షణ కల్పించాలని కోర్టులో వాదన వినిపించారు. వీటన్నింటికీ న్యాయస్థానం ఓకే చెప్పింది.
గతంలో రజినీకాంత్, అమితాబ్ కేసులలోనూ..
అంతకుముందు 2022 నవంబర్‌లో ఢిల్లీ హైకోర్టు అమితాబ్ బచ్చన్‌కు సంబంధించిన ఇలాంటిదే ఒక కేసును పరిష్కరించింది. అమితాబ్‌కు స్పెషల్‌గా ఉండిపోయే ‘బిగ్ బి’ పేరు, ఆయన పలికిన ‘కంప్యూటర్ జీ’ పదం, ‘లాక్ కియా జాయే’ అనే పదాలను ఆయన వ్యక్తిత్వ హక్కుగా కోర్టు గుర్తించింది. ఈ అంశాలను వాణిజ్యపరంగా వినియోగించకుండా న్యాయస్థానం అప్పట్లో బ్యాన్ విధించింది. ఆభరణాల బ్రాండ్ ‘తనిష్క్‌’ను కలిగి ఉన్న టాటా కంపెనీ.. తనిష్క్ అడ్వర్టయిజ్మెంట్‌లోని అమితాబ్ బచ్చన్ ఫొటోలను వాడినందుకు ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన ఒక నగల దుకాణంపై హైకోర్టులో కేసు వేసింది. 2015లో ప్రముఖ నటుడు రజనీకాంత్‌కి సంబంధించిన ఇలాంటిదే ఒక కేసులో మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘సెలబ్రిటీ హోదా పొందిన వ్యక్తులకు వ్యక్తిత్వ హక్కులు ఉంటాయి’’ అని ఒక తీర్పులో పేర్కొంది. తన పేరు, ఫొటో, డైలాగులను వాణిజ్య అవసరాల కోసం వాడి వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ‘‘మై హూన్ రజనీకాంత్’’ సినిమా నిర్మాతలపై రజనీకాంత్ అప్పట్లో వేసిన దావాపై విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.