దసరా, దేవర విలన్ కు అరుదైన వ్యాధి

shine tom chacko
సినిమా నటులు అరుదైన వ్యాధులతో బాధ పడుతూ ఉంటారనే సంగతి తెలిసిందే. అరుదైన క్యాన్సర్ లు, చర్మ వ్యాధులు వారిని బాధ పెడుతూ ఉంటాయి. ఇలాంటి ఆరోగ్య సమస్యలతో ప్రాణాలు కోల్పోయిన నటులు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు మరో నటుడు అరుదైన వ్యాధితో బాధ పడుతున్నారట. ఆ నటుడు ఎవరో కాదు… దసరా సినిమాలో విలన్ గా మనల్ని అలరించిన మలయాళ నటుడు షైన్ టామ్‌చాకో. ఈ సినిమాలో అతని విలనిజం చాలా బాగా ఆకట్టుకుంది. ప్రతీ సీన్ లో తన మార్క్ చూపించాడు.
ఆ తర్వాత ఒక స్టేజిపై కాస్త వింతగా ప్రవర్తించడంతో విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు ఈ నటుడు. ‘దసరా’ సినిమా తర్వాత నాగ శౌర్య హీరోగా వచ్చిన ‘రంగబలి’ సినిమాలో కూడా విలన్ పాత్ర పోషించి మెప్పించాడు. ఇప్పుడు అగ్ర హీరోల సినిమాల్లో ఆఫర్లను కొట్టేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చే సినిమాలో కూడా నటిస్తున్నాడు. అతని స్పీడ్ చూస్తే తెలుగులో పాపులర్ విలన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దేవర సినిమాలో కూడా అతను విలన్ పాత్రలో కనపడుతున్నాడు.
ఇదిలా ఉంటే తనకు ఒక అరుదైన వ్యాధి ఉందని ఒక మీడియా సమావేశంలో బయట పెట్టాడు. తనకు అటెన్షన్ డెఫిసిటీ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ఏ.డీ.హెచ్.డీ) అనే అరుదైన వ్యాధి ఉందని తెలిపాడు. ఈ వ్యాధితో బాధ పడే వారు… ఇతరుల కంటే ప్రత్యేకంగా కనపడటంపై ఎక్కువ దృష్టి సారిస్తారట. అందరిలా ఉండాలంటే వారికి చికాకుగా ఉంటుందట. అయితే ఈ సమస్య తనకు అసలు బాధ కలిగించడం లేదని… సానుకూల ద్రుక్పధంతోనే చూస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ నటుడు చేతిలో అన్ని భాషల్లో కలిపి ఆరు సినిమాలు ఉన్నాయి. అతను ఈ వ్యాధి నుంచి బయట పడి కెరీర్ లో ముందుకు వెళ్లాలని కోరుకుందాం.