దేవర జపాన్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. ఎన్టీఆర్ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే..!
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర సినిమా తెలుగులో మంచి విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 450 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర సినిమా తెలుగులో మంచి విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 450 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. కేవలం తెలుగులో 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే 162 కోట్ల షేర్ వసూలు చేసి.. డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు 50 కోట్ల లాభాలు తీసుకొచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఓవర్సీస్ లోను దేవరకు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. తాజాగా ఇదే సినిమాను జపాన్లో విడుదల చేశారు. మొన్న మార్చి 28న విడుదలైన ఈ సినిమాకు.. అక్కడ ఊహించిన స్పందన రావడం లేదు. సినిమా కోసం చాలా కష్టపడ్డాడు జూనియర్. వారం రోజులు అక్కడే ఉండి జపాన్ లో ప్రమోషన్ బాగానే చేశాడు తారక్. ఎన్ని చేసినా కూడా దేవర ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ చాలా తక్కువగానే వచ్చాయి. ఇప్పటి వరకు అక్కడ ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే కేవలం 60 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేసింది దేవర. త్రిబుల్ ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత జపాన్ మార్కెట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన జూనియర్.. దేవరతో అనుకున్న విజయం వైపు మాత్రం అడుగులు వేయలేకపోతున్నాడు.
జపనీయులకు ఈ సినిమా అంతగా ఎక్కలేదు. కల్కి లాంటి విజువల్ వండర్ నే జపాన్ ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. అక్కడ సినిమా ఆడాలంటే గుండెలు పిండేసే ఎమోషన్ ఉండాల్సిందే. అందుకే బజరంగీ భాయిజాన్, పీకే, దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్, బాహుబలి, ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాలు జపాన్ మార్కెట్లో సంచలనం సృష్టించాయి. యాక్షన్ పార్ట్ ఉన్నా ఒకే కానీ.. దాన్ని మించే ఎమోషన్ లేకపోతే మాత్రం అసలు పట్టించుకోరు జపాన్ ప్రేక్షకులు. తాజాగా దేవర సినిమాకు ఇదే మైనస్ అవుతుంది. నిజానికి ఈ సినిమా మన దగ్గర విడుదలైనప్పుడు కూడా కేవలం ఎన్టీఆర్ స్టామినాతోనే బ్లాక్ బస్టర్ అయింది కానీ సినిమాలో విషయం పెద్దగా లేదు అనే విమర్శలు చాలా వచ్చాయి. ఎమోషన్స్ కూడా వర్కౌట్ కాలేదు అని దేవర సినిమాతో చెడుగుడు ఆడుకున్నారు విశ్లేషకులు. ఇప్పుడు అలాంటి సినిమాను తీసుకెళ్లి జపాన్ ప్రేక్షకుల ముందు పెడితే వాళ్లు మాత్రం ఎలా చూస్తారు అనే కామెంట్స్ వస్తున్నాయి.
ఈ సినిమాకు ప్రీమియర్స్ నుంచి 1054 టికెట్లు తెగాయి.. అలాగే మొదటి రోజు 1553, రెండో రోజు 2327, మూడో రోజు 1994.. మొత్తంగా 6928 టికెట్లు తెగాయి. జపాన్ భాషలో వీటిని అడ్మిట్స్ అంటారు. జపాన్ లో విడుదలైన గత తెలుగు సినిమాలతో పోలిస్తే దేవర సినిమాకు వచ్చిన కలెక్షన్స్ చాలా తక్కువ. ఈ సినిమాకు చేసిన ప్రమోషన్స్ తో పోలిస్తే.. తారక్ కష్టం వృధా అయిందని చెప్పాలి. కచ్చితంగా ఈ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ అవుతుంది.. తనకు మంచి మార్కెట్ ఓపెన్ అవుతుంది అని కలలు కన్న ఎన్టీఆర్ కు దేవర షాక్ ఇచ్చినట్టే. ఫుల్ రన్ లో కోటి రూపాయల ఇండియన్ కరెన్సీ వసూలు చేసిన గొప్పే అంటున్నారు ట్రేడ్ పండితులు. రెండేళ్ల కింద రంగస్థలం జపాన్ లో విడుదలై మరీ అద్భుతం కాకపోయినా.. మంచి విజయం అయితే అందుకుంది. ఆ తర్వాత ట్రిపుల్ ఆర్ సినిమా కూడా అద్భుతం చేసింది. అదే సీన్ రిపీట్ చేయాలి అనుకున్న ఎన్టీఆర్ కు మాత్రం జపనీయులు షాక్ ఇచ్చారు. మరి ఈయన కలలు కంటున్న మార్కెట్ నెక్స్ట్ సినిమాతో అయినా వస్తుందో లేదో చూడాలి.