చెబితే విన్నారా.. చేతులారా చేసుకున్నారు.. అనుభవించండి..!
శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలతో థియేటర్లు కళకళలాడిపోతుంటాయి. నెలకు కనీసం ఒక్క పెద్ద సినిమా అయినా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలతో థియేటర్లు కళకళలాడిపోతుంటాయి. నెలకు కనీసం ఒక్క పెద్ద సినిమా అయినా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కానీ 2025 లో మాత్రం సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. సంక్రాంతి తర్వాత తండేల్ మినహా.. చెప్పుకోదగ్గ పెద్ద సినిమా ఒకటి కూడా విడుదల కాలేదు. సమ్మర్ సీజన్ అయితే పూర్తిగా నాశనం అయిపోతుంది. 2024 సమ్మర్లో ఎలాగైతే పెద్ద హీరోలందరూ మూకుమ్మడిగా హ్యాండ్ ఇచ్చారో.. ఈసారి కూడా అదే జరిగింది. 2025 సమ్మర్ లో చెప్పుకోవడానికి ఒక్క సినిమా కూడా రావట్లేదు. మండు వేసవిలో సినిమా వినోదం కోరుకుంటున్న సగటు సినీ ప్రేక్షకుడికి మళ్లీ నిరాశే మిగిలింది.
ఈ పరిస్థితికి ఐపీఎల్ కూడా ఒక కారణమే. మార్చి చివరి వారం నుంచి మే సెకండ్ వీక్ వరకు జరగబోయే ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్ కి భయపడి చాలా వరకు పెద్ద సినిమాలు రావడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాయి. ఇలాంటి సమయంలో తమ సినిమాలు విడుదల చేస్తే అనవసరంగా నష్టపోతాం అని నిర్మాతలు ఎవరు పెద్ద సినిమాలను ఈ సీజన్లో విడుదల చేయడానికి ముందుకు రావడం లేదు. షెడ్యూల్ కన్ఫర్మ్ చేసుకున్న ఒకటో రెండో పెద్ద సినిమాలు కూడా తమ రిలీజ్ డేట్స్ మార్చుకున్నాయి. ఏప్రిల్ 10న రావాల్సిన ప్రభాస్ రాజా సాబ్ సినిమా ఎప్పుడు వస్తుందో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అన్ని కుదిరితే దసరాలను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. పెద్ద హీరోల సినిమాలు పక్కన పెడితే కనీసం మీడియం రేంజ్ హీరోలు కూడా సమ్మర్ సీజన్ ను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు మార్చ్ 28న మ్యాడ్ స్క్వేర్.. ఏప్రిల్ 10న జాక్ సినిమాలు తప్పిస్తే.. ఏప్రిల్ 25న మంచి విష్ణు కన్నప్ప.. మే 1న హిట్ 3.. 30న విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మినహాయిస్తే పేరున్న సినిమాలు ఏవి రాలేదు.
సమ్మర్ లో వస్తుంది అనుకున్న చిరంజీవి విశ్వంభర కూడా ఎప్పుడు వస్తుందో అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ హరిహర విరమణ వస్తుంది అని చెప్తున్నారు కానీ వచ్చేవరకు అనుమానమే. దాంతో కళకళలాడాల్సిన సమ్మర్ సీజన్ బోసిపోతుంది. రాబోయే నెల రోజులు కూడా బాక్సాఫీస్ ఇంతే స్తబ్దంగా ఉండబోతుంది. ఇంకా చెప్పాలంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు. దాంతో డబ్బింగ్ సినిమాలు పండగ చేసుకుంటున్నాయి. దీన్ని బట్టి ఇండస్ట్రీలో పరిస్థితులు అర్థం అవుతున్నాయి.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే జూన్ తర్వాతే పెద్ద సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేయబోతున్నాయనిపిస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయడం తప్ప ఇటు నిర్మాతలకు.. అటు సినీ అభిమానులకు వేరే ఆప్షన్ లేదు. విశ్వంభర, మాస్ జాతర రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ అయితే ఆ తర్వాత సినిమా పండగ జరగనుంది. అప్పటి వరకు ఎదురు చూడడం తప్ప ఇంకేమీ చేయలేని పరిస్థితి.