Dil Raju: ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా దిల్ రాజు.. సి.కళ్యాణ్‌పై ఘన విజయం
మొత్తం 48 ఓట్లలో దిల్ రాజు 31 ఓట్లు దక్కించుకుని అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 48 ఓట్లు ఉండగా, అధ్యక్ష పదవి సొంతం చేసుకోవడానికి 25 ఓట్లు కావాలి. దిల్ రాజు అదనంగా మరిన్ని ఓట్లతో, భారీ మెజారిటీ సాధించి గెలిచారు.
Dil Raju: తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా అగ్ర నిర్మాత దిల్ రాజు ఎన్నికయ్యారు. జులై 30, ఆదివారం జరిగిన ఎలక్షన్స్‌లో నిర్మాత సి.కళ్యాణ్‌పై దిల్ రాజు విజయం సాధించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫిలింఛాంబర్ ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో దిల్ రాజు గెలుపు ఖాయమైంది. మొత్తం 48 ఓట్లలో దిల్ రాజు 31 ఓట్లు దక్కించుకుని అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 48 ఓట్లు ఉండగా, అధ్యక్ష పదవి సొంతం చేసుకోవడానికి 25 ఓట్లు కావాలి. దిల్ రాజు అదనంగా మరిన్ని ఓట్లతో, భారీ మెజారిటీ సాధించి గెలిచారు.
తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ ఎన్నికల్లో దిల్ రాజు, సి.కళ్యాణ్ ప్యానెల్స్ పోటీ పడ్డాయి. చాలా వరకు పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. ఫిలిం ఛాంబర్‌లో నాలుగు కమిటీలుంటాయి. అవి ప్రొడ్యూసర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఎగ్జిబిటర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, స్టుడియో ఎగ్జిక్యూటివ్ కమిటీ. ఈ కమిటీల నుంచి మొత్తం 1567 ఓట్లు ఉన్నాయి. అయితే, ఆదివారం జరిగిన ఎన్నికల్లో 891 ఓట్లు పోలయ్యాయి. అంటే 891 మంది ఓటు వేసినట్లు కాదు. కారణం.. ఒక నిర్మాతకు ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉండొచ్చు. ఒక నిర్మాత ఎన్ని బ్యానర్ల ద్వారా సభ్యత్వం పొందితే.. అన్ని ఓట్లు వస్తాయి. అలా కొందరు నిర్మాతలు ఒకటికంటే ఎక్కువ ఓట్లు కలిగి ఉన్నారు. గరిష్టంగా కొందరు నిర్మాతలకు15 ఓట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అలా మొత్తంగా 891 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈ ఛాంబర్‌లోని నాలుగు కమిటీలకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 48 మంది గెలిచారు. వాళ్లు తమ కమిటీలకు ఛైర్మన్లను, ఇతర కార్యవర్గాన్ని కూడా ఎన్నుకున్నారు. చివరకు అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. ఈ 48 మందిలో రెండు ప్యానెళ్లకు చెందినవాళ్లున్నారు. అయితే, కొందరు స్వతంత్రులు కూడా ఉన్నారు.
వాళ్లంతా దిల్ రాజుకు అనుకూలంగా ఓటు వేయడంతో ఆయన విజయం సాధించారు. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడిగా ముత్యాల రామదాస్, జాయింట్ సెక్రటరీగా దామోదర్ ప్రసాద్, ట్రెజరర్‌గా ప్రసన్న కుమార్ ఎన్నికయ్యారు. 14 రౌండ్లలో 891 ఓట్లు పోలయ్యాయి. వీటిలో దిల్ రాజుకు 563 ఓట్లు, సి.కల్యాణ్‌కు 497 ఓట్లు పోలయ్యాయి. కాగా, ఈ ఎన్నికను ఇద్దరూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ.. దిల్ రాజు మరింత జాగ్రత్తగా వ్యవహరించారు. ఆయన తాను విజయం సాధిస్తే ఏం చేస్తాను అని ముందుగానే ప్రకటించారు. కొన్ని దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసుకున్న నిబంధనలను మార్చాలని దిల్ రాజు నిర్ణయించుకున్నారు. అలాగే ఇకపై ఒక నిర్మాతకు ఒకే ఓటు అనే విధానాన్ని కూడా ఆయన తీసుకురాబోతున్నారు. కొత్తగా ఎన్నికైన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవి, కార్యవర్గం పదవీ కాలం రెండేళ్లు ఉంటుంది.