దిల్ రాజు ట్విస్ట్.. ఏకంగా ఆ దర్శకుడితో సినిమా అనౌన్స్ చేసిన హార్ట్ కింగ్..!
టాలీవుడ్‌లో నిర్మాతగా దిల్ రాజుకి ఉన్న బ్రాండ్ అందరికీ తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి ఓ సినిమా వస్తుందంటే క్వాలిటీ విషయంలో.. కంటెంట్ విషయంలో అందరిలోనూ భారీ స్థాయిలో అంచనాలుంటాయి.

టాలీవుడ్‌లో నిర్మాతగా దిల్ రాజుకి ఉన్న బ్రాండ్ అందరికీ తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి ఓ సినిమా వస్తుందంటే క్వాలిటీ విషయంలో.. కంటెంట్ విషయంలో అందరిలోనూ భారీ స్థాయిలో అంచనాలుంటాయి. కొన్నిసార్లు ఆయన అంచనాలు తప్పుతుంటాయి కూడా. గత కొన్ని సంవత్సరాలుగా దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న సినిమాలు పెద్దగా ఆడలేదు. మొన్నటికి మొన్న సంక్రాంతికి వచ్చిన గేమ్ చేంజర్ సైతం డిజాస్టర్ గా నిలిచింది. అయితే వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరోసారి తన సత్తా చూపించాడు దిల్ రాజు. ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా వసూలు చేయడంతో మళ్లీ నిలబడ్డాడు ఈ నిర్మాత. లేదంటే గేమ్ చేంజర్, దానికి ముందు సినిమాలు ఇచ్చిన షాక్ తో సినిమాలకు దూరమైనా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదేమో. అలాంటి బ్యాడ్ డేస్ నుంచి మళ్ళీ కోలుకొని వరుస సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు దిల్ రాజు. తాజాగా ఈ బ్యానర్ నుంచి ఓ క్రేజీ పాన్ ఇండియన్ చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఈ మధ్యే మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘మార్కో’ సినిమాతో దర్శకుడు హనీఫ్ అదేని పేరు బాగా ట్రెండ్ అయింది. ఇండియన్ ఇండస్ట్రీ ఇప్పటి వరకు చూడని మోస్ట్ వైలెంట్ సినిమాను అందించాడు హనీఫ్. అలాంటి క్రేజీ డైరెక్టర్‌తో దిల్ రాజు ప్రొడక్షన్స్ ఓ సినిమాను చేయబోతోంది. శిరీష్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా ఈ ప్రాజెక్ట్ టైటిల్ ఖరారు కాలేదు. ఈ సినిమాలో భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మల్టీస్టారర్‌గా తెరకెక్కిస్తున్నారు. మార్కోతో హనీఫ్ తనలోని మాస్, వయలెన్స్, యాక్షన్ యాంగిల్‌ను చూపించారు. ఇక ఇప్పుడు ఈయన తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. మన దగ్గర ఎంత వైలెన్స్ వర్కౌట్ కాదు.. పైగా దిల్ రాజు సినిమా అంటే కచ్చితంగా ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉండాల్సిందే. అందుకే హనీఫ్ తెలుగు ఆడియన్స్ కోసం ఈసారి యాక్షన్ ఫ్యామిలీ చేయాలని చూస్తున్నాడు. ఇక ఈ అనౌన్స్మెంట్ తో తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
గురు ఫిల్మ్స్‌కు చెందిన సునీతా తాటి ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామి అయ్యారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు. ఇందులో ఒక తెలుగు హీరో, ఒక మలయాళ హీరో కలిసి నటిస్తారని ప్రచారం జరుగుతుంది. దిల్ రాజు అడిగితే కాదనని తెలుగు హీరో ఎవరు లేరు.. మరి ఆ మలయాళ హీరో ఎవరనేది మాత్రమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా దిల్ రాజు లాంటి క్లాస్ ప్రొడ్యూసర్ నుంచి మార్కో లాంటి మాస్ వైలెంట్ సినిమా తీసిన డైరెక్టర్ తో కొలాబరేషన్ అనేది కాస్త కొత్తగానే ఉంది. మరి ఇది రేపు మెటీరియలైజ్ అయిన తర్వాత ఎలా ఉండబోతుందో చూడాలి.