Indian 2 : సీక్వెల్స్ పేరుతో కథలు దాచేస్తారా.. ఆడియెన్స్ ఎమోషన్స్‌తో గేమ్సా..
సీక్వెల్... ఈ మాట ఇప్పుడు టాలీవుడ్‌లో కామన్ అయిపోయింది. హీరో క్రేజ్‌ను వాడుకునేందుకు, కాసుల వర్షం కురిపించేందుకు.. సీక్వెల్‌ను అడ్డుపెట్టుకున్నారు. మొదటి భాగంలో ఇంతే.. అసలు కథ తెలియాలంటే రెండో భాగం చూడాలి అంటూ.. ప్రేక్షకులను వెర్రి పుష్పాలను చేస్తున్నారు.
సీక్వెల్… ఈ మాట ఇప్పుడు టాలీవుడ్‌లో కామన్ అయిపోయింది. హీరో క్రేజ్‌ను వాడుకునేందుకు, కాసుల వర్షం కురిపించేందుకు.. సీక్వెల్‌ను అడ్డుపెట్టుకున్నారు. మొదటి భాగంలో ఇంతే.. అసలు కథ తెలియాలంటే రెండో భాగం చూడాలి అంటూ.. ప్రేక్షకులను వెర్రి పుష్పాలను చేస్తున్నారు. బాహుబలి నుంచి ఇప్పుడు కల్కి వరకు ఇదే వరుస. పోనీ సీక్వెల్ అయినా సరిగ్గా ఉంటుందా అంటే.. అది కాస్త తేలిపోతోంది. భారతీయుడు 2విషయంలో జరిగింది అదే ! అప్పుడెప్పుడో పాతికేళ్ల కింద వచ్చిన హిట్ సినిమాకు.. సీక్వెల్ అని అనౌన్స్ చేసి.. థియేటర్‌లో తుస్సుమనిపించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ముసలోడు నస పుట్టించాడు.
థియేటర్‌లో ! భారతీయుడు 2లోనే ఏమీ లేదు అంటే.. దానికి పార్ట్ 3 అంటున్నారు. ఇలా భారతీయుడు 2తో సీక్వెల్స్ వ్యవహారంపై చర్చ మొదలైంది. ప్రేక్షకుల వీక్‌నెస్‌ను క్యాష్ చేసుకునే ప్రయత్నంలో.. పాన్ ఇండియా సినిమా దర్శకులు.. ఎమోషన్స్‌తో గేమ్స్ ఆడుతున్నారు. ఫస్ట్ పార్ట్ ట్రైలర్‌లా చేసతున్నారు. ఫస్ట్ పార్ట్ చూపించి సెకండ్ పార్ట్ అమ్ముకుంటున్నారు. సినిమాను ముందే షూట్ చేసి.. దాన్ని రెండు ముక్కలు చేసి.. భారీ పబ్లిసిటీ చేసి… ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అని ప్రేక్షకుడిని దారుణంగా దోచుకుంటున్నారు. ఫస్ట్ పార్ట్‌లో ఏమి ఉండదు. కీలకమైనా కథ అంత సెకండ్ పార్ట్‌లోనే ఉంటుంది. ఫస్ట్ పార్ట్ సాగదీస్తారు. చివరలో చిన్న ట్విస్ట్ ఉంటుంది. దానికి లింక్ అంతా సెకండ్ పార్ట్‌లో ఉంటుంది. సెకండ్ పార్ట్ చచ్చినట్లు చూడాలి. ఇలా దిక్కుమాలిన కంటెంట్‌తో ఫస్ట్ పార్ట్ చూపించి.. ఆ తర్వాత సెకండ్ పార్ట్ అమ్ముకుంటున్నారు. బాహుబలి, సలార్, కేజీఎఫ్, విక్రమ్, కల్కి, ఇండియన్.. అన్ని ఇవే మోడల్. సలార్ 1లో స్టోరీ లేదు.. పార్ట్ 2లోనే ఉందనే హింట్ ఇచ్చారు.
ఇక్కడితో కాలేదు.. కేజీఎఫ్‌కు పార్ట్ 3లో ఉంటుందని మాయ చేశారు. విక్రమ్‌లో రోలెక్స్ పాత్రలో ఇంకా ఏదో చెప్పబోతున్నారని సర్‌ప్రైజ్ ఇచ్చారు. కల్కిలో ప్రభాస్ కర్ణుడు అని చెప్పి మాయ చేయబోతున్నారు. ఫస్ట్ పార్ట్‌లో సాగదీసి.. లాస్ట్‌లో ట్విస్ట్ ఇచ్చి.. సెకండ్ పార్ట్‌లోనే స్టోరీ ఉంటుంది.. చచ్చుకుంటూ వెయిట్ చేయాల్సిందే.. చస్తూ చూడాల్సిందే అని ఎమోషనల్ గేమ్ ఆడుతున్నారు మేకర్స్. ఓవరాల్‌గా ప్రేక్షకులను అమాయకులను చేసేస్తున్నారు. పార్ట్ వన్ అనేది.. కేవలం ట్రైలర్‌లా మారిపోయింది ప్రతీ డైరెక్టర్‌కు! ఏదో ఉంటుంది.. ఏదో చూస్తామని ఊహించుకొని థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుడు.. అమాయకంగా, ఆందోళనగా హాల్ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి. ఒక కథను రెండు భాగాలుగా చెప్పడం కమర్షియల్‌గా వర్కౌట్ అవుతుందని.. మొదటిభాగం అంతా సోదితో నింపేయడం అంటే.. ప్రేక్షకుడి ఎమోషన్స్‌తో ఆడుకున్నట్లు కాదా.
సలార్, కల్కి, దేవర.. ఇలా రాబోయే సీక్వెల్స్ లిస్ట్ భారీగానే ఉంది. బాహుబలి నుంచి ఇదే ట్రెండ్ కనిపిస్తోంది.
పార్ట్ వన్ అనేది బాహుబలికి ట్రైలర్ మాత్రమే ! కథ అంతా సెకండ్ పార్ట్‌లో పెట్టి.. మొదటి భాగం రెండున్నర గంటలు సాగదీశాడు రాజమౌళి. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ఒక పాయింట్ హోల్డ్‌లో పెట్టి.. ప్రేక్షకులను మూడేళ్లు వెయిట్ చేయించాడు. పార్ట్ 2లోనే అసలు కథ చెప్పాడు. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయిందని అనుకుంటున్నాం కానీ.. కథ చెప్పకుండా ప్రేక్షకులను రాజమౌళి అమాయకులను చేశాడు అని గుర్తించలేకపోయాం ఎవరం ! ఇక బాహుబలితో ప్రభాస్‌కు వచ్చిన క్రేజ్‌ను వాడుకోవాలని.. కాసులు కురిపించుకోవాలని.. మేకర్స్ అంతా పక్కా ప్లాన్‌తో వెళ్తున్నారు. సలార్, కల్కిలో అదే కనిపించింది. ఈ రెండు సినిమాల మొదటిభాగాల్లో.. బూతద్దం పెట్టి వెతికినా కథలు కనిపించవు. సలార్‌లో అయితే ఈ పైత్యం మరీ పీక్స్. ప్రభాస్‌కు ఎలివేషన్స్ ఇవ్వడం, కండలు చూపించడం మీద పెట్టిన శ్రద్ధ.. డైరెక్టర్ కథ మీద పెట్టలేకపోయాడు.
సినిమా మొత్తం ప్రభాస్ డైలాగ్‌లు 3నిమిషాలు లేవంటే.. ప్రేక్షకుడి గురించి ఏమనుకుంటున్నాడో.. ఆ డైరెక్టర్‌కే తెలియాలి మరి ! పార్ట్ వన్ రిలీజ్ చేసి.. అది పార్ట్ 2కు టీజర్ అంటే.. సగటు ప్రేక్షకుడిని పిచ్చోడి కింద లెక్కయడం కాదా. రీసెంట్ హిట్ కల్కి కూడా అంతే ! కేరక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్ పేరుతో.. సినిమాను లాగాడు భయ్యా… మాములుగా కాదు. బబుల్‌గమ్ సాగినట్లు సాగింది మూవీ. ఇలా సాగదీయకుండా కథ అంతా ఒకే పార్ట్‌లో చెప్తే అయ్యేది కదా అంటే.. మార్కెట్ బాస్.. కాసులు కురవాలి కదా అనే ఆన్సర్లు వినిపిస్తున్నాయ్. హీరో క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలనే కక్కుర్తి కాకపోతే మరేంటి ఇది. కల్కిలో ఎప్పుడో లాస్ట్ 20నిమిషాలు కథ చెప్పడం స్టార్ట్ చేస్తాడు డైరెక్టర్. కావాలనే స్టోరీని సెకండ్ పార్ట్ కోసం దాచేశాడు. ఈ మాత్రం దానికి అంత బిల్డప్ ఎందుకో మరి. సినిమాలో కమల్‌హాసన్ ఉన్నాడని చెప్పి.. 30సెకన్లు చూయించాడు ఫస్ట్ పార్ట్‌లో ! కమల్‌హాసన్ అయినా, కల్కి అయినా.. ప్రభాసే కర్ణుడు అనే హింట్ అయినా.. అన్నీ సెకండ్ పార్ట్‌లోనే అంటూ కథ మొత్తం దాచేసి.. అమాయకం బోర్డు తగిలించి.. ప్రేక్షకుడిని థియేటర్ నుంచి పంపించాడు డైరెక్టర్. సెకండ్ పార్ట్ కోసం మెంటల్‌గా రెడీ చేశాడు. అసలే ల్యాగ్ సినిమా చూశామన్న ఫీలింగ్‌తో ఉన్న ఆడియెన్స్‌కు.. కల్కీ మల్టీవర్స్ కంటిన్యూస్ అనే మాట మరింత మంట పుట్టించింది.
ఇక మోస్ట్ ఎవెయిటెడ్ మూవీ పుష్ప 2. ఈ సీక్వెల్ లెవల్ పైత్యం మరో లెవల్. నిజానికి పుష్ప 2 కథ లేదంట. ఫస్ట్ పార్ట్ సక్సెస్ చూసి.. రెండో భాగం రాసుకున్నాడట డైరెక్టర్ సుకుమార్. ఇది చాలదా.. ప్రేక్షకుడితో సినిమావాళ్ల ఏ రేంజ్‌లో ఆడుకుంటున్నారు అని చెప్పడానికి ! పుష్ప 1లోనూ పెద్దగా కథ లేదు. కూలీ.. ఎర్రచందనం డాన్ అయ్యాడు అంతే ఫస్ట్ పార్ట్‌లో ! అసలు కథ మొదలయ్యేది, విలన్ ఎంటర్ అయ్యేది అక్కడే. మరి ఆ కథ ఏది బాస్ అంటే.. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండంటున్నారు మేకర్స్. పోనీ అదైనా త్వరగా తీసుకువస్తారా అంటే.. నాలుగేళ్లు దాటింది ఫస్ట్ పార్ట్ వచ్చి.. ఇప్పుడు మొదటిభాగం కథ కూడా మర్చిపోయినట్లు అయింది. వీటి సంగతే ఇలా ఉంటే.. రాబోయే దేవర సంగతి ఏంటో ఊహించుకోవడానికి భయంకరంగా ఉంటుందో అని భయపడిపోతున్నారు ప్రేక్షకులు. ఇలా సీక్వెల్ అంటే చిరాకు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. రాబోయే సీక్వెల్స్‌లో క్యూరియాసిటీ ఉన్న మరో మూవీ.. జై హనుమాన్. హనుమాన్ మూవీ క్లైమాక్స్ మాత్రమే హిట్. మరి జై హనుమాన్ థీమ్‌ను ప్రశాంత్ వర్మ హ్యాండిల్ చేయగలడా అంటే.. అది ప్రేక్షకుడి అదృష్టమే.
ఇదంతా ఎలా ఉన్నా.. సీక్వెల్స్ పేరుతో మేకర్లు ఆడుతున్న సిల్లీ గేమ్స్.. ఆడియెన్స్‌తో ఎమోషనల్ గేమ్స్ ఆడినట్లు అవుతోంది. ఫస్ట్ హాఫ్ సోసోగా లాగించేస్తూ.. ప్రమోషన్స్‌తో గట్టెక్కించి.. సెకండ్ పార్ట్‌లో కథ చెప్తున్నారు డైరెక్టర్లు. సెకండ్ హాఫ్‌లోనే సినిమా ఉంటుందని ప్రేక్షకుడిని సైకలాజికల్‌గా ప్రిపేర్ చేస్తున్నారు. ఈ సినిమాలో లేనిది.. రేపు రాబోయే సీక్వెల్లోనే ఏదో ఉందనే భ్రమల్లోకి తీసుకుపోతున్నారు. నిజానికి ఒక్క పార్ట్‌లో మూవీ చూపించవచ్చు. డెరెక్టర్, హీరో బ్రాండ్‌ని అడ్డం పెట్టుకుని ప్రేక్షకుడిని మోసం చేసి అమ్ముకుంటున్నారు. ఇదంతా వేయికోట్లు కొట్టడానికి వేసే ప్లాన్ కాదా.. నిర్మాతలు, దర్శకుల అతితెలివిని ప్రేక్షకులు ఈ మాత్రం అర్థం చేసుకోలేరు అనుకుంటున్నారా?