పహల్గాం ఉగ్రదాడి ఎఫెక్ట్.. పాకిస్తాన్ నటులకు ఇండియన్ సినిమాల్లో నో ఎంట్రీ..!

సినిమాలకు భాషతో పనిలేదు.. అందుకే ఏ భాషలోని వాళ్లైనా ఎక్కడైనా వచ్చి నటించొచ్చు.. మనకు తెలియని భాషల్లో నటించిన వాళ్లను కూడా అభిమానిస్తుంటారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 24, 2025 | 03:15 PMLast Updated on: Apr 24, 2025 | 3:15 PM

Effect Of Pahalgam Terror Attack No Entry For Pakistani Actors In Indian Films

సినిమాలకు భాషతో పనిలేదు.. అందుకే ఏ భాషలోని వాళ్లైనా ఎక్కడైనా వచ్చి నటించొచ్చు.. మనకు తెలియని భాషల్లో నటించిన వాళ్లను కూడా అభిమానిస్తుంటారు. అలాగే పాకిస్తాన్ నటులకు కూడా ఇండియన్ సినిమాల్లో ఆఫర్స్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. అయితే ఇప్పటి వరకు అయిందేదో అయిపోయింది గానీ ఇకపై అలాంటి పరిస్థితులు ఉండేలా కనిపించడం లేదు. ఇప్పట్నుంచి భారతీయ సినిమాల్లో పాకిస్తానీ నటులు కనిపించడం అనేది దాదాపు కనుమరుగు అయిపోయినట్లే. వాళ్ళను సినిమాల్లో తీసుకోవడం అంటే సినిమాను చేజేతులా చంపేసుకోవడమే. తాజాగా జరిగిన పహల్గాం ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ అంటేనే మండి పడుతున్నారు మన ప్రజలు. ఇలాంటి సమయంలో మన సినిమాల్లో పాక్ నటులు కనిపిస్తే పోస్టర్లు చించేస్తారు. ఇప్పటికే రెండు దేశాల మధ్య ఎన్నో వివాదాలు, విద్వేషాలు, నిషేధాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలోనూ కొందరు దర్శకులు తమ సినిమాల్లో పాకిస్తాన్ నటులను తీసుకున్నారు.

ఉదాహరణకు పాకిస్తాన్ నటులైన ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్, అలీ జాఫర్, రాహత్ ఫతేహ్ అలీ ఖాన్ లాంటి వాళ్లు మన సినిమాల్లో నటించారు. కానీ 2016లో ఉరీ దాడి తర్వాత ఇండియన్ మోషన్ పిక్చర్స్ అసోసియేషన్ పాకిస్తానీ నటీనటులను భారతీయ సినిమాల్లో తీసుకోకుండా నిషేధించింది. మహారాష్ట్రలో శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేనలు పాకిస్తానీ నటులను భారతీయ సినిమాల్లో నటించనివ్వమని హెచ్చరించాయి. ఒకవేళ పాకిస్తానీ నటులు మన సినిమాల్లో ఉంటే.. అలాంటి సినిమాలను విడుదల చేయకూడదని కూడా వాళ్లు హెచ్చరించారు. అయితే ఈ రోజు ఉన్న కోపం రేపు ఉండదు. అందుకే 2016 ఉరి అటాక్స్ తర్వాత.. మళ్లీ కొన్నాళ్లకు పాకిస్తాన్ నటులు మన ఇండియన్ సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. అయితే ఇదివరకట్లా వరసగా కాదు గానీ.. అరుదుగా మాత్రం అక్కడి వాళ్లను తీసుకొచ్చి ఇక్కడ నటింపజేస్తున్నారు. అప్పట్లో షారుక్ ఖాన్ తన రాయిస్ సినిమా కోసం పాకిస్తాన్ నటి మహీరా ఖాన్‌ను తీసుకొచ్చాడు.

అలాగే ఫవాద్ ఖాన్ తాజాగా అబిర్ గులాల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్లోనే విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ సినిమాను ఇండియాలో విడుదల చేయబోమని ప్రకటించారు మేకర్స్. అలాగే ఇకపై పాక్ నటులను ఇండియన్ సినిమాల్లో తీసుకోవాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకునేలా వార్నింగ్ ఇస్తున్నారు ప్రజలు. 140 కోట్లు ఉన్న ఈ దేశంలో మీ సినిమాల్లో నటించడానికి నటులు దొరకట్లేదు.. పాకిస్తాన్ వెళ్లి మరీ అక్కడి వాళ్లను తీసుకురావాలా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి పాకిస్తాన్ నటులపై ఇండియన్ సినిమాల్లో నిషేధం అనేదైతే గట్టిగానే వినిపిస్తుందిప్పుడు.