ఎంపురాన్ రివ్యూ.. అంచనాలు పెట్టుకుని వెళ్తే అంతే సంగతులు..!
మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన సినిమా లూసీఫర్. మలయాళ ఇండస్ట్రీ బిజినెస్ రూపు రేఖలను మార్చేసిన సినిమా ఇది.

మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన సినిమా లూసీఫర్. మలయాళ ఇండస్ట్రీ బిజినెస్ రూపు రేఖలను మార్చేసిన సినిమా ఇది. 2019లో విడుదలై 150 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇదే సినిమాను మచ్చటపడి మరీ తెలుగులో గాడ్ ఫాదర్ అంటూ రీమేక్ చేసాడు చిరంజీవి. ఈ సినిమాకు సీక్వెల్ వచ్చిందిప్పుడు. మరి ఎంపురాన్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం..
కథ విషయానికి వస్తే.. పార్ట్ 1 అందరికి గుర్తుండే ఉంటుంది కదా.. పీకేఆర్ అనే రాజకీయ నేత సృష్టించిన సామ్రాజ్యంలో ఎంతోమంది చీడపురుగులు వస్తారు. దాన్ని సెట్ చేసి మళ్లీ మాయమైపోతాడు మోహన్ లాల్. అయితే ఆయన ఉన్నపుడు అంతా సైలెంట్‌గానే ఉంటారు కానీ ఒక్కసారి మోహన్ లాల్ కేరళను వదిలేసిన తర్వాత.. చాలా అక్రమాలు జరుగుతాయి. మళ్లీ పాత పద్దతులే వస్తాయి. దానికి తోడు పికేఆర్ కొడుకు సీఎం పాత్ర పోషించిన టొవినో థామస్ కూడా విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని మరింత ప్రమాదంలో పడేస్తాడు. ఈయన చేసేవి చూస్తున్నా కూడా ఏం చేయలేని పరిస్థితి మంజు వారియర్‌ది. మెల్ల మెల్లగా కేరళ అంతా నాశనం అయిపోతుందనుకుంటున్న సమయంలో మళ్లీ సీన్‌లోకి ఎంట్రీ ఇస్తాడు మోహన్ లాల్. ఆయనకు తోడుగా అప్పుడప్పుడూ వస్తుంటాడు పృథ్వీరాజ్ సుకుమారన్. మరి ఈ ఇద్దరికీ ఉన్న సంబంధం ఏంటి..? మోహన్ లాల్ వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ చక్కబడ్డాయా లేదా అనేది అసలు కథ..
స్క్రీన్ ప్లే విషయానికి వస్తే.. ఓ సినిమాకు సీక్వెల్ చేయడం అంటే అంత ఈజీ కాదు. దానికి చాలా లెక్కలుంటాయి. అవన్నీ వర్కవుట్ అయితేనే సీక్వెల్ కూడా సూపర్ హిట్ అవుతుంది లేదంటే బిస్కెట్ అవుతుంది. సీక్వెల్ అంటేనే కత్తి మీద సాము. బ్రాండ్ సరిగ్గా వాడుకుంటే ఓకే గానీ.. లేదంటే అంతే సంగతులు. లూసీఫర్ 2 కూడా అంతే.. పూర్తిగా బ్రాండ్‌ను నమ్ముకుని వచ్చిన సినిమా. ఫస్ట్ పార్ట్ ఇచ్చిన హైప్ మైండ్‌లో పెట్టుకుంటే తప్పకుండా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే అందులో స్టోరీ టెల్లింగ్ సుప్రీమ్. ప్రతీ సీన్ చాలా అద్భుతంగా డిజైన్ చేసాడు పృథ్వీరాజ్ సుకుమారన్. అయినా ఫస్ట్ పార్ట్ ఇచ్చిన కిక్ మామూలుగా ఉండదు. దాన్ని కానీ మైండ్‌లో పెట్టుకుంటే ఒక్క సీన్ కూడా ఎంజాయ్ చేయలేరు. కాకపోతే ఓ బ్రాండ్ ఉన్న సీక్వెల్ చూద్దాం అనుకుని ముందుగానే ప్రిపేర్ అయి వెళ్లండి అప్పుడు ఈ సినిమాను ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు.
మోహన్ లాల్ ర్యాంపేజ్ కూడా నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. లూసీఫర్ పూర్తిగా మాస్టర్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్.. స్క్రీన్ ప్లే నెక్ట్స్ లెవల్.. సెకండ్ పార్ట్ అలా కాదు.. మొత్తం ఎలివేషన్స్ మీదే వెళ్లిపోతుంది. మొదటి అరగంట అద్భుతంగా మొదలైంది.. కానీ ఆ తర్వాత నెమ్మదిస్తుంది. సినిమా స్టార్ట్ అయిన గంట తర్వాత గానీ మోహన్ లాల్ ఎంట్రీ ఉండదు. స్క్రీన్ మీద హీరో లేకపోయినా.. ఆయన ప్రజెన్స్ కనిపిస్తూనే ఉంటుంది.. లూసీఫర్ అంతా పొలిటికల్ డ్రామా. ఇందులో పాలిటిక్స్ తక్కువ.. ఎలివేషన్ ఎక్కువ. కథ కూడా చాలా మలుపులు తీసుకుంటుంది.. అక్కడక్కడా ఇంట్రెస్టింగ్ సీన్స్ పడ్డాయి కానీ అవి సరిపోలేదు.. కీలకమైన సెకండాఫ్ కూడా మనం ఊహించిన దానికంటే తక్కువగానే అనిపిస్తుంది.
ఈసారి పాలిటిక్స్ కంటే రివేంజ్ డ్రామాపైనే ఫోకస్ చేసాడు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ముఖ్యంగా ఫస్ట్ పార్ట్‌లో హైలైట్‌గా నిలిచిన సన్నివేశాలు పార్టీ కష్టాల్లో ఉన్న ప్రతీసారి వచ్చి ఖురేషీ అడ్డంగా నిలబడుతుంటాడు.. తన చెల్లిని కాపాడుతుంటాడు.. అందులో ఓ ఎమోషన్ ఉంటుంది. ఇందులో అది అంతగా వర్కవుట్ కాలేదు. పైగా మంజు వారియర్, టొవినో మధ్య వచ్చే సన్నివేశాలు ఇంకా బలంగా రాసుకోవచ్చు కానీ ఎందుకో మరి చాలా సాదా సీదాగా వాటిని తీసేసాడు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్. చాలా వరకు ఖర్చు కనిపించింది కానీ ఎమోషనల్ కనెక్ట్ కనిపించలేదు. బ్రాండ్ కోసం వెళ్తే ఎంపురాన్ ఎంజాయ్ చేస్తారు కానీ మునపటి పార్ట్ గుర్తుంటే మాత్రం అస్సలు ఎక్కదు ఈ సినిమా.
నటీనటుల విషయానికి వస్తే.. మోహన్ లాల్ గురించి ఏం చెప్పాలబ్బా.. ఆయన అద్భుతం అంతే. ఎంతసేపు ఉన్నామనేది కాదు.. ఉన్నంత సేపు ఎంత మ్యాజిక్ చేసామన్నదే ముఖ్యం. అబ్రహాం ఖురేషీగా స్క్రీన్‌ను షేక్ చేసాడు. సినిమా మొదలైన గంట తర్వాత హీరో వచ్చినా ఆ ఫీలింగ్ అనిపించదు. పృథ్వీరాజ్ ఉన్నది కాసేపే అయినా బాగున్నాడు.. టొవినో థామస్ ఓ కీలక పాత్రలో మెప్పించాడు. మంజు వారియర్ మరోసారి తన స్క్రీన్ ప్రజెన్స్‌తో మాయ చేసింది. సినిమాలో ఇంకా చాలా మంది నటులున్నారు. కాకపోతే అంతా మలయాళ నటులే కావడంతో మనకు అంతగా పరిచయం ఉండదు. ఉన్నంతలో దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తమ్ముడు ఇంద్రజీత్ బాగా నటించాడు. జర్నలిస్ట్ పాత్ర చాలా బాగుంది. మిగిలిన వాళ్లంతా ఓకే..
టెక్నికల్ టీం విషయానికి వస్తే.. దీపక్ దేవ్ సంగీతం ఈ సినిమాకు ప్లస్. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగా కుదిరింది. ఎడిటింగ్‌లో ఫ్లాస్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని సీన్స్ తీసేసిని సినిమాకు నష్టం లేదు కానీ పృథ్వీరాజ్ సుకుమారన్ మాత్రం దానికి ఒప్పుకోలేదు. అందుకే ఎడిటర్‌ను తప్పు బట్టలేం. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. పృథ్వీరాజ్ సుకుమారన్ మాత్రం ఈసారి దర్శకుడిగా అంతగా మెప్పించలేదు. పొలిటికల్ డ్రామా చూద్దామని వెళ్లిన ఆడియన్స్‌కు రివేంజ్ డ్రామా చూపించారు.ఓవరాల్‌గా మీరు లూసీఫర్ ఫ్రాంచైజీకి ఫ్యాన్ అయితే జస్ట్ గో అండ్ ఎంజాయ్ అది కూడా వితౌట్ ఎక్స్‌పెక్టేషన్స్.. లేదంటే ఓటిటిలో వచ్చేవరకు వెయిట్ చేయండి..